మత్స్యకళాశాలలో పీహెచ్‌డీ కోర్సులు
-
–సోమవారం నుంచి తరగతులు ప్రారంభం
-
అభివృద్ధి పనులకు నిధుల వరద
ముత్తుకూరు:
ముత్తుకూరు మత్స్యకళాశాలలో 2016–17 సంవత్సరం నుంచి పీహెచ్‌డీ కోర్సులు ప్రారం¿¶భం కానున్నాయి. సోమవారం నుంచి తరగతులు మొదలవుతాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆమోదంతో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ వీటిని మంజూరు చేసింది. మొదటి సారిగా 'అక్వాకల్చర్' విభాగంలో 2 సీట్లకు సంబంధించి ఈ కోర్సులు మొదలవుతాయి. బీఎఫ్‌ఎస్సీ మొదటి సంవత్సరం సీట్ల సంఖ్య 40కి పెంచారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది విద్యార్థులు చేరారు. త్వరలో జరిగే 3వ కౌన్సిలింగ్‌లో మిగిలిన సీట్లు కూడా భర్తీ అవుతాయని ప్రొఫెసర్లు భావిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 8 మంది చేరారు. చిత్తూరు, పశ్చిమగోదావరి, అనంతపురం, కడప జిల్లాల నుంచి ఒక్కొక్క విద్యార్థి చేరారు.
అభివృద్ధి పనులకు నిధుల వరద:
మత్స్యకళాశాల అభివృద్ధికి ఎన్నడూ లేనంతగా నిధులు మంజూరయ్యాయి. ఐసీఏఆర్ ద్వారా రూ.కోట్ల నిధులు విడుదలయ్యాయి. ముఖ్యంగా కళాశాల ప్రధాన భవనంపై అంతస్తు నిర్మాణానికి రూ.3.63 కోట్లు మంజూరుకాగా, మొదటి దశలో రూ.1.20 కోట్లు విడుదలయ్యాయి. విద్యార్థినుల హాస్టల్ భవనం మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.1.50 కోట్లు, అక్వాకల్చర్ అనిమల్ హెల్త్ విభాగం అదనపు భవన నిర్మాణానికి రూ.1.10 కోట్లు మంజూరైంది. ముఖ్యంగా ఆర్నమెంటల్ ఫిష్ రేరింగ్ యూనిట్(రంగు చేపల పెంపక కేంద్రం) నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరైంది. రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ ఫండ్ ద్వారా ఈ నిధులు మంజూరయ్యాయి. అలాగే, ఫిషరీ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ల్యాబ్ భవన నిర్మాణానికి రూ.1 కోటి మంజూరైంది. పీజీ విద్యార్ధుల హాస్టల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు.
జనవరిలో కళాశాల రజతోత్సవాలు:
రాష్ట్రంలో ఏకైక మత్స్యకళాశాల ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయి సందర్భంగా జనవరిలో మూడు రోజుల పాటు రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఇన్‌చార్జ్ అసోసియేట్ డీన్ డాక్టర్ రామలింగయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా వెనామీ రొయ్యల పెంపకం స్థితిగతులపై భారీ స్థాయిలో వర్క్‌షాప్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రజతోత్సవాల నిర్వహణకు అసోసియేట్ డీన్ డాక్టర్ కే ఎస్ కృష్ణప్రసాద్ కన్వీనర్‌గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.