సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీఆర్‌సెట్‌లో సీట్ల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. పీహెచ్‌డీ కోర్సుల్లోని సీట్లలో 50 శాతం ఏ–కేటగిరీలో, బీ కేటగిరీలో 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు జీవో నంబర్–1 విడుదల చేశారు.
పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్లను గతంలో ఆయా యూనివర్సిటీలే నేరుగా నిర్వహించేవి. కానీ గత ఏడాది నుంచి అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉన్నత విద్యామండలి ద్వారా ఆర్‌సెట్‌ను నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి సీట్లు కేటాయిస్తున్నారు. ఈ సీట్లను ఏ, బీ కేటగిరీలుగా భర్తీ చేస్తున్నారు.
ఏ–కేటగిరీ సీట్లను జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్వహించే నెట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్స్ (సీఎస్‌ఐఆర్) యూజీసీ నెట్, ఐఐటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్), రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్టేట్ లెవల్ ఎలిజిబులిటీ టెస్ట్ (సెట్) తదితర ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన వారితో ఆర్‌సెట్‌లో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తుంటారు.
ఇక బీ–కేటగిరీ సీట్లను ఆర్‌సెట్‌లో మెరిట్ సాధించిన పీజీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు కేటాయిస్తుంటారు. గతంలో ఇచ్చిన జీవో నంబర్ 45 ప్రకారం ఆర్‌సెట్‌లోని సీట్లలో ఏ–కేటగిరీ అభ్యర్థులతో 25 శాతం సీట్లను, మరో 75శాతం సీట్లను బీ–కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేసేవారు.
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన తమకు 25 శాతం సీట్లు ఇవ్వడం వల్ల నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు విన్నవించడంతో ప్రభుత్వం రెండు కేటగిరీలకు సమానంగా సీట్లు వచ్చేలా 50 శాతం చొప్పున కేటాయింపు చేసింది. ఈ మేరకు గత జీవోను సవరిస్తూ కొత్తగా జీవో నంబర్–1ని విడుదల చేశారు. ఒక కేటగిరీలో మిగిలిన సీట్లను మరో కేటగిరీలోని అభ్యర్థుల ద్వారా భర్తీ చేసే వెసులుబాటు కల్పించారు.
ఆర్‌సెట్‌లో ఏ, బీ కేటగిరీలకు సమానంగా సీట్లు
Published Wed, Jan 4 2023 5:14 AM | Last Updated on Wed, Jan 4 2023 5:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment