సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక ఉన్నత విద్యా మండలి (ఏఐసీటీఈ) తాజాగా పచ్చజెండా ఊపింది. ఫీజుల పెంపునకు సంబంధించి 2015లో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ)లను ఆదేశించింది. దీనితో విద్యార్థులపై ఫీజుల భారం పెరిగిపోనుంది. ఫీజులు పెంచాలన్న ఏఐసీటీఈ నిర్ణయంపై అంతటా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రెండింతలకుపైగా..: ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో దాదాపు అన్ని సాంకేతిక, మేనేజ్‌మెంట్ కోర్సుల ఫీజులు రెండింతలకుపైగా పెరగనున్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కాలేజీల్లో విద్య మరింత భారం కానుంది. ఉదాహరణకు.. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సులకు కనిష్ట వార్షిక ఫీజు రూ.35 వేలుగా ఉండగా.. ఏఐసీటీఈ ఆదేశాలు అమలైతే ఏకంగా రూ. 67 వేలకు పెరగనుంది. గరిష్ట ఫీజు రూ.1.35 లక్షల నుంచి ఏకంగా రూ. 1.89 లక్షలకు చేరనుంది.
పెంపుపై రాష్ట్ర ఎఫ్‌ఆర్సీ తర్జనభర్జన
రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై ఎఫ్‌ఆర్‌సీ కొద్దినెలలుగా కసరత్తు చేస్తోంది. 2019లో నిర్ధారించిన ఫీజులకు మరో 10 శాతం పెంచి ఆదేశాలు ఇస్తారని ఇప్పటిదాకా అంతా భావించారు. కానీ ఏఐసీటీఈ పిడుగులాంటి ఆదేశాలు జారీ చేయడంతో.. ఏం చేయాలన్న దానిపై ఎఫ్‌ఆర్‌సీ తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితుల్లో.. ఫీజుల పెంపు సమస్యగా మారుతుందేమోనని భావించిన ఎఫ్‌ఆర్‌సీ.. శనివారం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేసినట్టు సమాచారం.
ఫీజులు పెంచితే ఉద్యమమే..
రెండేళ్లుగా కరోనాతో పేద, మధ్య తరగతి వర్గా లు ఆర్థికంగా చితికిపోయాయి. జీవనమే దుర్భరమైన కుటుంబాలూ ఉన్నా యి. బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఫీజు లు పెంచి పేదలకు ఉరి బిగించాలనే నిర్ణయం దారుణం. ఫీజులు పెంచితే ఉద్యమం తప్పదు.
– నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
పెంచాల్సిన అవసరమేంటి?
అధ్యాపకులకు ఏడో వేతన ఒప్పందం అమలు చేస్తున్నామని ప్రైవేటు కాలేజీలు ఏఐసీటీఈని నమ్మించాయి. అందుకే శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇది ముమ్మాటికీ అన్యాయమే. అధ్యాపకులకు ఇప్పటికీ ఐదో వేతన ఒప్పందం మేర వేతనాలే అందడం లేదు. కరోనా సమయం నుంచి అధ్యాపకులకు జీతాలు ఇవ్వని కాలేజీలూ ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా ఫీజులు పెంచడం దారుణం.
– సంతోష్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక కాలేజీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment