technical courses
-
ఏఐసీటీఈ పచ్చ జెండా.. భారీగా పెరగనున్న సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక ఉన్నత విద్యా మండలి (ఏఐసీటీఈ) తాజాగా పచ్చజెండా ఊపింది. ఫీజుల పెంపునకు సంబంధించి 2015లో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ)లను ఆదేశించింది. దీనితో విద్యార్థులపై ఫీజుల భారం పెరిగిపోనుంది. ఫీజులు పెంచాలన్న ఏఐసీటీఈ నిర్ణయంపై అంతటా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండింతలకుపైగా..: ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో దాదాపు అన్ని సాంకేతిక, మేనేజ్మెంట్ కోర్సుల ఫీజులు రెండింతలకుపైగా పెరగనున్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్య మరింత భారం కానుంది. ఉదాహరణకు.. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సులకు కనిష్ట వార్షిక ఫీజు రూ.35 వేలుగా ఉండగా.. ఏఐసీటీఈ ఆదేశాలు అమలైతే ఏకంగా రూ. 67 వేలకు పెరగనుంది. గరిష్ట ఫీజు రూ.1.35 లక్షల నుంచి ఏకంగా రూ. 1.89 లక్షలకు చేరనుంది. పెంపుపై రాష్ట్ర ఎఫ్ఆర్సీ తర్జనభర్జన రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ కొద్దినెలలుగా కసరత్తు చేస్తోంది. 2019లో నిర్ధారించిన ఫీజులకు మరో 10 శాతం పెంచి ఆదేశాలు ఇస్తారని ఇప్పటిదాకా అంతా భావించారు. కానీ ఏఐసీటీఈ పిడుగులాంటి ఆదేశాలు జారీ చేయడంతో.. ఏం చేయాలన్న దానిపై ఎఫ్ఆర్సీ తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితుల్లో.. ఫీజుల పెంపు సమస్యగా మారుతుందేమోనని భావించిన ఎఫ్ఆర్సీ.. శనివారం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేసినట్టు సమాచారం. ఫీజులు పెంచితే ఉద్యమమే.. రెండేళ్లుగా కరోనాతో పేద, మధ్య తరగతి వర్గా లు ఆర్థికంగా చితికిపోయాయి. జీవనమే దుర్భరమైన కుటుంబాలూ ఉన్నా యి. బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఫీజు లు పెంచి పేదలకు ఉరి బిగించాలనే నిర్ణయం దారుణం. ఫీజులు పెంచితే ఉద్యమం తప్పదు. – నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పెంచాల్సిన అవసరమేంటి? అధ్యాపకులకు ఏడో వేతన ఒప్పందం అమలు చేస్తున్నామని ప్రైవేటు కాలేజీలు ఏఐసీటీఈని నమ్మించాయి. అందుకే శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇది ముమ్మాటికీ అన్యాయమే. అధ్యాపకులకు ఇప్పటికీ ఐదో వేతన ఒప్పందం మేర వేతనాలే అందడం లేదు. కరోనా సమయం నుంచి అధ్యాపకులకు జీతాలు ఇవ్వని కాలేజీలూ ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా ఫీజులు పెంచడం దారుణం. – సంతోష్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక కాలేజీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు -
మాతృభాషలో ఇంజనీరింగ్!
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సహా టెక్నికల్ కోర్సులు స్థానిక భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూమీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీరింగ్ కోర్సులతో సహా టెక్నికల్ కోర్సులను మాతృభాషలో నేర్చుకునే వీలుకల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఇందుకోసం కొన్ని ఐఐటీ, ఎన్ఐటీలను ఎంపిక చేస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. స్కాలర్షిప్పులు, ఫెలోషిప్పులు సమయానికి విద్యార్ధులకు అందించాలని, ఇందుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయమని యూజీసీని సమావేశంలో ఆదేశించారు. కష్టమే..: సాంకేతిక పదబంధాలు అధికంగా ఉండే టెక్నికల్ కోర్సులను ఇంగ్లిష్‌లో కాదని స్థానిక భాషల్లో బోధించడం సవాలేనని, పైగా వచ్చే విద్యాసంవత్సరం దగ్గరలో ఉన్న ఈ స్వల్పతరుణంలో ఈ సవాలను అధిగమించడం కష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాతృభాషలో ఇంజనీరింగ్ సిలబస్‌కు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ రూపొందించాలని, బోధించేందుకు సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాల్సిఉంటుందని నిపుణులు వివరించారు. -
అంకుర దశలోనే ఆధునిక కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక విద్యా కోర్సులు పాఠశాల స్థాయి నుంచే చదువుకునేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆరో తరగతి నుంచే ఆ కోర్సుకు సంబంధించిన పరిచయ అంశాలను సీబీఎస్ఈ పాఠశాలల్లో బోధించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంచి, ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు, శారీరక దృఢత్వం కలిగి ఉండేలా వారిని తీర్చిదిద్దేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజైన్ అండ్ థింకింగ్, ఫిజికల్ యాక్టివిటీ ట్రైనర్ కోర్సులను తీసుకువచ్చింది. 2020–21 విద్యా ఏడాది నుంచి వీటిని అమల్లోకి తీసుకువస్తోంది. స్కిల్ కోర్సులను రెగ్యులర్ విద్యలో భాగం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలిమెంటరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిలో స్కిల్ కోర్సులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ స్కూళ్లన్నింటిలో వీటిని అమలు చేయనుంది. కొత్త విద్యావిధానానికి అనుగుణంగా.. పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య, అదనపు పాఠ్య కార్యక్రమాలకు మధ్య, వృత్తి విద్యా, సంప్రదాయ విద్యకు మధ్య వ్యత్యాసం ఉండొద్దని, విద్యార్థిని అన్నింటిలో మేటిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాల్సిందేనని నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా ప్రణాళిక చట్రాన్ని (నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్) సవరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సంప్రదాయ విద్యలో వృత్తి విద్యను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టింది. వృత్తి విద్య అంటే టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రీషియన్, సెల్‌ఫోన్ మెకానిక్ వంటి కోర్సులే ఉండగా ఇకపై వాటి రూపు మారుతోంది. 21వ శతాబ్దంలో క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ కీలకమైన ప్రక్రియ. దానిని సీబీఎస్ డిజైన్–థింకింగ్ పేరుతో సబ్జెక్టుగా తీసుకొస్తోంది. తరగతులను అనుసరించి... ప్రాథమిక (6, 7, 8) తరగతుల్లో స్కిల్ కోర్సులకు సంబంధించిన పరిచయ పాఠాలు ఉండనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఐటీ తదితర కోర్సులకు సంబంధించి 12 గంటల బోధన ఉండనుంది. ఏఐతో సహా మొత్తంగా 9 కోర్సులకు సంబంధించిన పరిచయ పాఠాలు బోధిస్తారు. ఇందులో 15 మార్కులు థియరీకి, 35 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. కొత్త సబ్జెక్టులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ యాక్టివిటీ ట్రైనర్ సబ్జెక్టులు కలుపుకొని సెకండరీ స్థాయిలో 18 సబ్జెక్టులు అందుబాటులోకి రానున్నాయి. సీనియర్ సెకండరీ స్థాయిలో 40 సబ్జెక్టులను అందుబాటులోకి తెచ్చింది. అయితే సెకండరీ స్థాయిలో విద్యార్థులు తమ తప్పనిసరి సబ్జెక్టులైన లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్‌తోపాటు ఆరో (అదనపు) సబ్జెక్టును (స్కిల్ సబ్జెక్టుగా) ఎంచుకోవాల్సి ఉంటుంది. సీనియర్ సెకండరీ స్థాయిలో సబ్జెక్టు–1గా లాంగ్వేజ్–1, సబ్జెక్టు–2గా లాంగ్వేజ్–2 ఉంటాయి. సబ్జెక్టు–3, 4, 5లుగా రెండు అకడమిక్ సబ్జెక్టులు (ఎలక్టివ్), ఒక స్కిల్ సబ్జెక్టు ఎంచుకోవాలి. లేదా ఒక అకడమిక్ సబ్జెక్టు, రెండు స్కిల్ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా మూడు స్కిల్ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఆరో అదనపు సబ్జెక్టుగా (ఆప్షనల్) ఒక భాషను లేదా అకడమిక్ సబ్జెక్టును లేదా స్కిల్ సబ్జెక్టును ఎంచుకోవచ్చు. ఇందులో స్కిల్ సబ్జెక్టులో 50 మార్కులు థియరీకి, 50 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించారు. అకడమిక్ సబ్జెక్టుగానే అప్లైడ్ మ్యాథమెటిక్స్ ► 2020–21 నుంచి 11వ తరగతిలో అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్కిల్ సబ్జెక్టుగా ఉండదు. అకడమిక్ సబ్జెక్టుగా ఉంటుంది. అలాగే ఎక్స్‌రే టెక్నీషియన్, మ్యూజిక్ ప్రొడక్షన్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్కిల్ సబ్జెక్టులుగా ఉండవు. ► పదో తరగతిలో విద్యార్థులు ఎవరైనా తప్పనిసరి సబ్జెక్టులైన మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌సైన్స్‌లో ఫెయిల్ అయితే ఆరో సబ్జెక్టుగా చదువుకున్న స్కిల్ సబ్జెక్టును అందులో పరిగణనలోకి తీసుకొని పాస్ చేస్తారు. అయితే విద్యార్థి ఫెయిల్ అయిన ఆ సబ్జెక్టు పరీక్ష రాయాలనుకుంటే రాసుకోవచ్చు. -
టెన్త్ తర్వాత ఉపాధికి మార్గం..పాలిటెక్నిక్
నిడమర్రు : పదో తరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, త్వరగా ఉపాధి సంపాదించాలంటే ఉత్తమ మార్గం పాలిటెక్నిక్ కోర్సు. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ ఏడాది 50,424 మంది విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాశారు. పదో తరగతి తర్వాత టెక్నికల్ కోర్సులు చేసి టెక్నికల్ అంశాలపై పట్టు సాధించి జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు ఉత్తమ మార్గం పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించడం. పాలిసెట్–2018 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15వ తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పాలిటెక్నిక్ కోర్సులు, అర్హతలు, పరీక్షా విధానం తదితర సమాచారం తెలుసుకుందాం. పాలిసెట్ నిర్వహించేది.. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ సంస్థ ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పాలిసెట్)ను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వ/ప్రైవేట్/ఎయిడెడ్/అన్ ఎయిడెడ్/ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో షిఫ్ట్ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులు ఇలా.. మూడేళ్ల కోర్సులు : సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్, మెకానికల్, ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోం సైన్స్. మూడున్నరేళ్ల కోర్సులు కెమికల్(సాండ్విచ్) ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఉన్న కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈసీఈ, ఐఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్స్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ (షుగర్ టెక్నాలజీ) అర్హతలు :ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తించిన పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. పదో తరగతి కంపార్ట్మెంట్లో పాసైనవారు, పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రవేశం తీసుకునే ముందు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. పరీక్షా విధానం.. ♦ ఈ కామన్ ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు 2 గంటల సమయం ఉంటుంది. ♦ పరీక్ష పేపరు ఒకటే ఉంటుంది. 120 ఆబ్జెక్టివ్ మాదిరి ప్రశ్నలకు 120 మార్కులు కేటాయిస్తారు. ♦ పదో తరగతి స్థాయిలోని గణితంలో 60 ప్రశ్నలు, భౌతికశాస్త్రంలో 30 ప్రశ్నలు, రసాయన శాస్త్రానికి సంబంధించిన 30 ప్రశ్నలు ఉంటాయి. ♦ మొత్తం 120 మార్కులకు 36 మార్కులను ఈ కోర్సుకు క్వాలిఫైయింగ్ మార్కులుగా నిర్ణయిస్తారు. ♦ ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కులతో సంబంధం లేకుండా ఆయా కేటగిరిల్లో సీట్లు భర్తీ చేస్తారు. ఉన్నత విద్యాచదువులకు మంచి అవకాశం.. ♦ పాలిటెక్నిక్ కోర్సులు (మూడు/మూడున్నరేళ్ల డిప్లొమా) పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ‘ఈ సెట్’ నిర్వహిస్తారు. దీని ద్వారా బీటెక్/బీఈ నేరుగా రెండో సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ ద్వారా) ప్రవేశాలు కల్పిస్తారు. ఉద్యోగ అవకాశాలు ♦ ప్రభుత్వ/ప్రైవేటు సంస్థల్లో డిప్లొమా చదివినవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సబ్ ఇంజనీర్, ట్రెయినీ ఇంజనీర్‌గా అవకాశాలు ఉంటాయి. జెన్కో, ట్రాన్స్‌కో, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖల్లో డిప్లొమా అభ్యర్థులకు అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తులు ఇలా ♦ https://appolycet.co.in/ వెబ్సైట్లో లాగిన్ అయి పదో తరగతి లేదా తత్సమాన కోర్సుకు సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ, పాస్/హాజరైన సంవత్సరం నమోదు చేస్తే కనిపించే దరఖాస్తు ను పూరించాలి, ఆన్లైన్లోనే ఫీజు రూ.350 కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేదా జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లలో దరఖాస్తులను అప్లోడ్ చేయవచ్చు. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: ఏప్రిల్ 15 ♦ పరీక్ష నిర్వహించే తేదీ: ఏప్రిల్ 27 (ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకూ) జిల్లాలోని హెల్ప్‌లైన్ సెంటర్స్: ♦ ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్, తణుకు ♦ సీఆర్ఆర్ పాలిటెక్నిక్, ఏలూరు ♦ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెం ♦ శ్రీమతి సీతా పాలిటెక్నిక్, భీమవరం ♦ గవర్నమెంట్ పాలిటెక్నిక్, తాడేపల్లిగూడెం పరీక్షా కేంద్రాలు: తణుకు, ఏలూరు, భీమవరంమరిన్ని వివరాలకోసం 91333 99677/91333 99677/ 91333 99688/ 91333 99699 నంబర్లకు సంప్రదించవచ్చు. -
ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) కన్వీనర్లను మంగళవారం ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. వర్సిటీల జాబితాలో పేర్లను పరిశీలించిన మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి కన్వీనర్లను ప్రకటించారు. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ తేదీలు, పరీక్ష ఫీజులను ఆయా వర్సిటీలు, సెట్స్ కమిటీలు సమావేశమై ఖరారు చేస్తాయన్నారు. ఈనెలాఖరు నాటికి నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉందన్నారు. ఐసెట్, లాసెట్ మినహా 2018 సెట్స్ నిర్వహణ బాధ్యతలను 2017లో నిర్వహించిన వారికే అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. -
నిరుద్యోగ భృతి భ్రాంతేనా?
జిల్లాలో 2.10 లక్షల మంది ఎదురుచూపులు తొలి శాసన సభ సమావేశాల్లో ప్రకటన చేయకపోవడంతో అనుమానాలు ఇది కూడా ఎన్నికల హామీగానే మిగిలిపోనుందా? ఇంటికో ఉద్యోగం.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఆ ఊసే ఎత్తటం లేదు. యువతను ఆకట్టుకునేందుకు మ్యానిఫెస్టోలో ప్రధాన అంశంగా చేర్చిన ఈ హామీ అమలుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా యువత ఎదురుతెన్నులు చూస్తున్నారు. చల్లపల్లి : ‘‘ఇంటికో ఉద్యోగం, లేదంటే ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.2 వేల చొప్పున భృతి’’ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఇది. ఆయన మాటలు నమ్మి ఆశతో ఓట్లేసిన నిరుద్యోగులు ఎందరో భృతి వస్తుందని ఆశ పడ్డారు. దీనిపై తొలి శాసనసభ సమావేశాల్లో ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఇది కూడా మిగిలిన పథకాల మాదిరిగా ఎన్నికల హామీలా మిగిలి పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. నెలకు రూ.90 లక్షల భారం అధికారుల రికార్డుల ప్రకారం జిల్లాలో 2.10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో డిగ్రీ పూర్తిచేసినవారు 1.25 లక్షల మంది, పీజీ, సాంకేతిక కోర్సులు పూర్తి చేసిన వారు 48 వేల మంది ఉన్నారు. పదోతరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైనవారు మరో 37వేల మంది ఉన్నారు. వీరంతా చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీకి అర్హులే. వీరిలో 29 నుంచి 32ఏళ్లలోపువారు 45వేల మంది. వీరందరికీ భృతి ఇస్తే నెలకు రూ.90 లక్షల భారం ప్రభుత్వంపై పడుతుంది. హామీపై స్పష్టత ఏదీ..! ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు ప్రయివేటు ఉద్యోగాలు కూడానని ఇటీవల చంద్రబాబు ప్రకటించడంతో ప్రయివేటు ఉద్యోగులు అనర్హులుగా మారనున్నారు. పదో తరగతి పాసై ఖాళీగా ఉండేవారు నిరుద్యోగుల కిందకే వస్తారు. కేరళ, పశ్చిమ బెంగాల్లో పదోతరగతి పాసైన వారి నుంచి పీజీ ఉత్తీర్ణులైన వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అలాగే ఇస్తారా? డిగ్రీ, ఆపై వారినే అర్హులుగా గుర్తిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తమను బురిడీ కొట్టిం చేందుకే చంద్రబాబు ఇలాంటి హామీ ఇచ్చారని పలువురు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. దుర్భర బతుకులు పీజీ, డిగ్రీ చదివిన యువకులు రూ.5 వేలకన్నా తక్కువ వేతనాలకు ప్రయివేటు ఉద్యోగాలు చేసుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో వ్యవసాయ పనులకు వెళ్ళే కూలీలు పురుషులు రోజుకు రూ.300, మహిళలు రూ.150 కూలి తీసుకుంటున్నారు. ఏడాదిలో ఐదునెలల పాటు పనులు చేసుకునే పురుషులు రూ.45 వేలు, మహిళలు రూ.20 నుంచి రూ.25వేలు సంపాదిస్తుండగా పీజీ చదివిన చిరుద్యోగులు ఏడాదికి రూ.36 వేల నుంచి రూ.54 వేలు మాత్రమే సంపాదిస్తున్నారు. ఈ చాలీచాలని జీతాలతో భార్యాపిల్లలతో బతకడం కష్టంగా ఉందని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. బాబును నమ్మి మోసపోయాం డిగ్రీ పూర్తిచేసి ఎనిమిదేళ్ళయింది. చంద్రబాబు ఎన్నికల్లో నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. దీనిపై తొలి శాసనసభ సమావేశాల్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పుడు నుంచి ఇస్తారు, ఎంతవరకు ఇస్తారో ఇంత వరకు చెప్పలేదు. బాబును నమ్మి నాలాంటి నిరుద్యోగులు ఎందరో ఓట్లువేసి మోసపోరు. - జి.వి.ఎస్.కె.నాగకుమార్, అవనిగడ్డ జీవితంలో నమ్మరు ఎన్నికల వాగ్దానాల అమలులో చంద్రబాబును నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని, కమిటీ వేసి మాట తప్పారు. ఇంటికో ఉద్యోగం, లేదా రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చినా దాని ఊసేలేదు. హామీలను నిలబెట్టుకోకపోతే బాబును జీవితంలో ఇక ఎవరూ నమ్మరు. - గుడివాక రామాంజనేయులు, అవనిగడ్డ -
ఫీజు రీయింబర్స్మెంట్ మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుపై మార్గదర్శకాలను పేర్కొంటూ సాంఘిక సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కోర్సు ఫీజు ఎంత ఉన్నప్పటికీ గరిష్టంగా ఇంజనీరింగ్‌కు రూ. 35 వేలు, బీఆర్క్‌కు రూ. 35 వేలు, ఎంబీఏ, ఎంసీఏలకు రూ. 27 వేలు, బీ.ఫార్మసీకి రూ. 31 వేలు, ఫార్మా-డికి రూ. 68 వేలు మాత్రమే చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంజనీరింగ్, బీఆర్క్ కళాశాలల్లో ఎంత ఫీజు ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తారు. అలాగే ఎంసెట్‌లో 10 వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలల్లో ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద చదివిన విద్యార్థులందరికీ కూడా పూర్తి రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రేమండ్ పీటర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సుకు త్వరలో అడ్మిషన్లు మేనేజ్మెంట్ రంగంలో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సుతోపాటు లేటరల్ ఎంట్రీతో ఎంసీఏ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ వెల్లడించారు. ఐసెట్ ర్యాంకుల ఆధారంగా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉన్నత విద్యామండలిలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సు నిర్వహణకు ఐదు కళాశాలలకు, లేటరల్ ఎంట్రీతో ఎంసీఏ కోర్సు నిర్వహణకు 33 కళాశాలలకు అనుమతి ఉందన్నారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ఎంసీఏలో చేరేందుకు బీసీఏ లేదా బీఎస్సీ గణితం కోర్సు చదివిన వారు అర్హులు. మేనేజ్మెంట్లో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ పూర్తిచేస్తే మాస్టర్ ఆఫ్ అప్లయిడ్ మేనేజ్మెంట్ (ఎంఏఎం) డిగ్రీ ప్రదానం చేస్తారు. నాలుగేళ్ల కోర్సు పూర్తిచేస్తే బాచిలర్ ఆఫ్ అప్లయిడ్ మేనేజ్మెంట్(బీఏఎం) డిగ్రీ ప్రదానం చేస్తారు. కేవలం మూడేళ్లు చదివితే బాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రదానం చేస్తారు. యూజీసీ నెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు యూజీసీ నెట్ ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునేందుకు గడువును పొడిగించారు. ఈ నెల 30తో (నేడు) ముగియనున్న ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 4 వరకు చేసుకోవచ్చని ఓయూ రీజినల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలను యూజీసీ వెబ్సైట్లో చూడవచ్చు.