
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) కన్వీనర్లను మంగళవారం ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. వర్సిటీల జాబితాలో పేర్లను పరిశీలించిన మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి కన్వీనర్లను ప్రకటించారు. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ తేదీలు, పరీక్ష ఫీజులను ఆయా వర్సిటీలు, సెట్స్ కమిటీలు సమావేశమై ఖరారు చేస్తాయన్నారు.
ఈనెలాఖరు నాటికి నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉందన్నారు. ఐసెట్, లాసెట్ మినహా 2018 సెట్స్ నిర్వహణ బాధ్యతలను 2017లో నిర్వహించిన వారికే అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.