మార్చి 2 నుంచి ఈసెట్ దరఖాస్తులు
షెడ్యూలు జారీ... ఆన్‌లైన్‌లో పరీక్ష
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈసెట్–2017 షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం జేఎన్‌టీయూహెచ్‌లో విడుదల చేశారు. ఈసెట్ నోటిఫికేషన్ ఈ నెల 27న ప్రకటించనున్నారు. మొదటిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలో మే 6 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించేందుకు ఈసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ పరీక్ష రిజిస్ట్రేసన్ కోసం ఎస్సీ, ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.800 ఫీజు చెల్లించాలి. మార్చి 2 నుంచి ఏప్రిల్ 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఏప్రిల్ 15 నుంచి 20 వరకు దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 వరకు, రూ.1,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్‌టికెట్లను ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ప్రాథమిక కీని మే 8న విడుదల చేస్తారు. అభ్యంతరాలను మే 11 వరకు స్వీకరించి, ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. మే 17 నుంచి ర్యాంకు కార్డులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.