రాష్ట్రంలో కొత్తగా 144 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు!
- వచ్చే 15 ఏళ్లలో ఏర్పాటుకు సర్కారు ప్రణాళిక
- సాంకేతిక విద్యాశాఖ కసరత్తు
- గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసమే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే 15 ఏళ్లలో కొత్తగా 144 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేసే లక్ష్యంతో సాంకేతిక విద్యాశాఖ దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది. తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉన్న 56 కాలేజీల పరిధిలోని 11,720 సీట్లను వచ్చే 15 ఏళ్లలో 48 వేలకు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. వృత్తి విద్య, సాంకేతిక విద్య కోర్సుల్లో పాలిటెక్నిక్ కీలకంగా మారడంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం 56 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, 166 ప్రైవేటు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సెకండ్ షిఫ్ట్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మెుత్తంగా 53,170 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
లేటరల్ ఎంట్రీ అవకాశం ఉండటంతో...
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో లేటరల్ ఎంట్రీ ద్వారా ద్వితీయ సంవత్సరంలో చేరే వీలు ఉంది. దీంతో ఏటా దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఈ విధానం ద్వారా చేరుతున్నారు. ఇంజనీరింగ్‌లో చేరకపోయినా పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా ఉద్యోగ అవకాశాలను పొందే వీలు ఉండటంతో ఈ కోర్సులకు డిమాండ్ ఉంది. పాలిటెక్నిక్ విద్యార్థుల్లో 90 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రస్తుతం 10 శాతం నుంచి 15 శాతం వరకు ఉన్న ఉపాధి అవకాశాలను వచ్చే 15 ఏళ్లలో 70 శాతానికి పెంచేలా సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.