నిరుద్యోగ భృతి భ్రాంతేనా? | Bhrantena earning unemployment? | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ భృతి భ్రాంతేనా?

Published Fri, Jul 4 2014 1:58 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

నిరుద్యోగ భృతి భ్రాంతేనా? - Sakshi

నిరుద్యోగ భృతి భ్రాంతేనా?

  • జిల్లాలో 2.10 లక్షల మంది ఎదురుచూపులు
  •  తొలి శాసన సభ సమావేశాల్లో ప్రకటన చేయకపోవడంతో అనుమానాలు
  •  ఇది కూడా ఎన్నికల హామీగానే  మిగిలిపోనుందా?
  • ఇంటికో ఉద్యోగం.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఆ ఊసే ఎత్తటం లేదు. యువతను ఆకట్టుకునేందుకు మ్యానిఫెస్టోలో ప్రధాన అంశంగా చేర్చిన ఈ హామీ అమలుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా యువత ఎదురుతెన్నులు చూస్తున్నారు.
     
    చల్లపల్లి : ‘‘ఇంటికో ఉద్యోగం, లేదంటే ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.2 వేల చొప్పున భృతి’’ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఇది. ఆయన మాటలు నమ్మి ఆశతో ఓట్లేసిన నిరుద్యోగులు ఎందరో భృతి వస్తుందని ఆశ పడ్డారు. దీనిపై తొలి శాసనసభ సమావేశాల్లో ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఇది కూడా మిగిలిన పథకాల మాదిరిగా ఎన్నికల హామీలా మిగిలి పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
     
    నెలకు రూ.90 లక్షల భారం
     
    అధికారుల రికార్డుల ప్రకారం జిల్లాలో 2.10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో డిగ్రీ పూర్తిచేసినవారు 1.25 లక్షల మంది, పీజీ, సాంకేతిక కోర్సులు పూర్తి చేసిన వారు 48 వేల మంది ఉన్నారు. పదోతరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైనవారు మరో 37వేల మంది ఉన్నారు. వీరంతా చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీకి అర్హులే. వీరిలో 29 నుంచి 32ఏళ్లలోపువారు 45వేల మంది. వీరందరికీ భృతి ఇస్తే నెలకు రూ.90 లక్షల భారం ప్రభుత్వంపై పడుతుంది.  

    హామీపై స్పష్టత ఏదీ..!
     
    ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు ప్రయివేటు ఉద్యోగాలు కూడానని ఇటీవల చంద్రబాబు ప్రకటించడంతో ప్రయివేటు ఉద్యోగులు అనర్హులుగా మారనున్నారు. పదో తరగతి పాసై ఖాళీగా ఉండేవారు నిరుద్యోగుల కిందకే వస్తారు. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో పదోతరగతి పాసైన వారి నుంచి పీజీ ఉత్తీర్ణులైన వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అలాగే ఇస్తారా? డిగ్రీ, ఆపై వారినే అర్హులుగా గుర్తిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తమను బురిడీ కొట్టిం చేందుకే చంద్రబాబు ఇలాంటి హామీ ఇచ్చారని పలువురు  నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.
     
    దుర్భర బతుకులు
     
    పీజీ, డిగ్రీ చదివిన యువకులు రూ.5 వేలకన్నా తక్కువ వేతనాలకు ప్రయివేటు ఉద్యోగాలు చేసుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో వ్యవసాయ పనులకు వెళ్ళే కూలీలు పురుషులు రోజుకు రూ.300, మహిళలు రూ.150 కూలి తీసుకుంటున్నారు. ఏడాదిలో ఐదునెలల పాటు పనులు చేసుకునే పురుషులు రూ.45 వేలు, మహిళలు రూ.20 నుంచి రూ.25వేలు సంపాదిస్తుండగా పీజీ చదివిన చిరుద్యోగులు ఏడాదికి రూ.36 వేల నుంచి రూ.54 వేలు మాత్రమే సంపాదిస్తున్నారు. ఈ చాలీచాలని జీతాలతో భార్యాపిల్లలతో బతకడం కష్టంగా ఉందని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
     
     బాబును నమ్మి మోసపోయాం
     డిగ్రీ పూర్తిచేసి ఎనిమిదేళ్ళయింది. చంద్రబాబు ఎన్నికల్లో నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. దీనిపై తొలి శాసనసభ సమావేశాల్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పుడు నుంచి ఇస్తారు, ఎంతవరకు ఇస్తారో ఇంత వరకు చెప్పలేదు. బాబును నమ్మి నాలాంటి నిరుద్యోగులు ఎందరో ఓట్లువేసి మోసపోరు.              
     - జి.వి.ఎస్.కె.నాగకుమార్, అవనిగడ్డ
     
     జీవితంలో నమ్మరు
     ఎన్నికల వాగ్దానాల అమలులో చంద్రబాబును నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని, కమిటీ వేసి మాట తప్పారు. ఇంటికో ఉద్యోగం, లేదా రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చినా దాని ఊసేలేదు. హామీలను నిలబెట్టుకోకపోతే బాబును జీవితంలో ఇక ఎవరూ నమ్మరు.
     - గుడివాక రామాంజనేయులు, అవనిగడ్డ
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement