సాక్షి, హైదరాబాద్: వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుపై మార్గదర్శకాలను పేర్కొంటూ సాంఘిక సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కోర్సు ఫీజు ఎంత ఉన్నప్పటికీ గరిష్టంగా ఇంజనీరింగ్‌కు రూ. 35 వేలు, బీఆర్క్‌కు రూ. 35 వేలు, ఎంబీఏ, ఎంసీఏలకు రూ. 27 వేలు, బీ.ఫార్మసీకి రూ. 31 వేలు, ఫార్మా-డికి రూ. 68 వేలు మాత్రమే చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంజనీరింగ్, బీఆర్క్ కళాశాలల్లో ఎంత ఫీజు ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తారు.
అలాగే ఎంసెట్‌లో 10 వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలల్లో ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద చదివిన విద్యార్థులందరికీ కూడా పూర్తి రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రేమండ్ పీటర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సుకు త్వరలో అడ్మిషన్లు
మేనేజ్‌మెంట్ రంగంలో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సుతోపాటు లేటరల్ ఎంట్రీతో ఎంసీఏ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ వెల్లడించారు. ఐసెట్ ర్యాంకుల ఆధారంగా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉన్నత విద్యామండలిలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సు నిర్వహణకు ఐదు కళాశాలలకు, లేటరల్ ఎంట్రీతో ఎంసీఏ కోర్సు నిర్వహణకు 33 కళాశాలలకు అనుమతి ఉందన్నారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ఎంసీఏలో చేరేందుకు బీసీఏ లేదా బీఎస్సీ గణితం కోర్సు చదివిన వారు అర్హులు. మేనేజ్‌మెంట్‌లో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ పూర్తిచేస్తే మాస్టర్ ఆఫ్ అప్లయిడ్ మేనేజ్‌మెంట్ (ఎంఏఎం) డిగ్రీ ప్రదానం చేస్తారు. నాలుగేళ్ల కోర్సు పూర్తిచేస్తే బాచిలర్ ఆఫ్ అప్లయిడ్ మేనేజ్‌మెంట్(బీఏఎం) డిగ్రీ ప్రదానం చేస్తారు. కేవలం మూడేళ్లు చదివితే బాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డిగ్రీ ప్రదానం చేస్తారు.
యూజీసీ నెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
యూజీసీ నెట్ ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకునేందుకు గడువును పొడిగించారు. ఈ నెల 30తో (నేడు) ముగియనున్న ఆన్‌లైన్ దరఖాస్తులను నవంబర్ 4 వరకు చేసుకోవచ్చని ఓయూ రీజినల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలను యూజీసీ వెబ్‌సైట్లో చూడవచ్చు.