
పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారు
కోర్సులు పూర్తయినా సర్టీఫికెట్లు ఇవ్వడం లేదు
ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం శాసనమండలి సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైఎస్సార్ïÜపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్న చర్చకు రాగా.. పెద్దఎత్తున ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ప్రభుత్వ వైఖరి కారణంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్సులు పూర్తయినప్పటికీ ఫీజులు చెల్లించలేదనే కారణంతో ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులకు సర్టీఫికెట్లు కూడా ఇవ్వడం లేదని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని దునుమాడారు.
వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి బదులిస్తూ.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.3,169 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నట్టు వెల్లడించారు. బకాయిల చెల్లింపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.
ఆ హామీ అమలు చేయడం లేదు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. యూజీ కోర్సుల్లో ఆరు త్రైమాసికాలకు సంబంధించి రూ.4,200 కోట్ల చొప్పున ప్రభుత్వం ఫీజులు బకాయి పడిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. యూజీ, పీజీ కోర్సులకు 2018–19లో చంద్రబాబు ప్రభుత్వం రూ.1,880 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి పెట్టిందన్నారు.
ఈ మొత్తాన్ని 2020లో ఒకేసారి వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. మరో ఎమ్మెల్సీ టి.కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక 13 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 2014–19 మాదిరిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సీలింగ్ పెడుతుందా, వంద శాతం రీయింబర్స్‌మెంట్ చేస్తుందా అని వివరణ కోరారు.
పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.3,196 కోట్లు బకాయిలు పెట్టడంతో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్లేస్‌మెంట్స్ వచ్చినా కొన్ని కళాశాలల యాజమాన్యాలు సర్టీఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. జీవో 77 ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలని కోరారు. మంత్రి డోలా మాట్లాడుతూ.. ప్రైవేట్ కళాశాలల్లో పీజీ చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించిన జీవో 77 రద్దుపై సమాధానం దాటవేశారు.
ఒకే చట్ట పరిధిలోకి విశ్వవిద్యాలయాలు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఒకే చట్టం పరిధిలోకి తీసుకుని వస్తామని మానవ వనరులు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. అమరావతిలో డీప్‌టెక్ వర్సిటీ, విశాఖలో ఐఎస్‌బీ ఏఐ వర్సిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment