
విద్యార్థులు, నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ సమరభేరి
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువతతో కలిసి పోరుబాట
అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీకి సన్నద్ధం
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.4,600 కోట్లు చెల్లించాలని డిమాండ్..
సర్కారు బెదిరింపులను బేఖాతరు చేస్తూ కదంతొక్కడానికి బాధితులంతా సిద్ధం
కూటమి సర్కార్ ఇవ్వాల్సింది రూ.7,100 కోట్లు.. బడ్జెట్‌లో రూ.2,600 కోట్లే కేటాయింపు
తన హయాంలో రూ.18,663.44 కోట్లు ఇచ్చిన వైఎస్ జగన్
నిత్యం అవమాన భారంతో కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు
పుస్తెలు తాకట్టు పెట్టి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించిన తల్లులు
ఎన్నికల్లో చెప్పిన మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన ఒట్టిమాటే
నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిపై నోరు మెదపని వైనం
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. రెండేళ్లలో 2,500 సీట్లు కోల్పోతున్న దుస్థితి
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురు చూపులు
9 నెలలు కావొస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సందిగ్ధతే
అతీగతీ లేని జాబ్ క్యాలెండర్.. ఏపీపీఎస్సీ ద్వారా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు
గత ప్రభుత్వంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్ల నిర్వహణలోనూ కుతంత్రాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఐదు త్రైమాసికాలుగా ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.3,500 కోట్లు, వసతి దీవెన రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అవమాన భారంతో కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న విద్యార్థులు, పుస్తెలు అమ్మి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించిన తల్లుల పక్షాన ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ సమరభేరి మోగించింది. డీఎస్సీపై చేసిన మొదటి సంతకమే తుస్సుమనిపించిన సీఎం చంద్రబాబు.. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా నిరుద్యోగులను వంచిస్తున్న తీరుపై కూడా వైఎస్సార్‌సీపీ కదనభేరి మోగించనుంది.
విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో బుధవారం ‘యువత పోరు’కు సిద్ధమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లుతండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయనుంది.
అన్నదాతల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13న రైతు పోరు.. విద్యుత్ చార్జీల బాదుడును నిరసిస్తూ డిసెంబర్ 27న విద్యుత్ పోరును నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు రైతు పోరు, విద్యుత్ పోరును విఫలం చేయడానికి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. వారి బెదిరింపులు.. నిర్భందాలను రైతులు, అన్ని వర్గాల ప్రజలు లెక్క చేయలేదు. వైఎస్సార్‌సీపీ నిర్వహించిన రైతు పోరులో అన్నదాతలు.. విద్యుత్ పోరులో అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా మహిళలు కదంతొక్కారు.
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు రైతు పోరు, విద్యుత్ పోరు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు యువత పోరును నియంత్రించాలని ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. అయినా రైతు పోరు.. విద్యుత్ పోరు కంటే మరింతగా యువత పోరును విజయవంతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.
నమ్మించి నయ వంచన
» రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. కళాశాలల యాజమాన్యం తరగతి గది నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తుందోనన్న అవమాన భారంతోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. కళ్ల ముందే బిడ్డలు పడుతున్న అవస్థలు చూడలేక పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న దుర్భర పరిస్థితి కనిపిస్తోంది
» నిజానికి గత విద్యా సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.1,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లను జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూటమి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన ఖర్చులను నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ.3,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి పెట్టింది.
» కూటమి సర్కారు ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లో మొక్కుబడి ప్రకటనలు మినహా విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదు. అయితే, వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’ ప్రకటనతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక త్రైమాసికంలో రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ.. చాలా వరకు నిధులు ఇంకా కళాశాలల ఖాతాల్లో జమ కాకపోవడం గమనార్హం.

» ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి ప్రైవేటు కళాశాలల్లో చేరినవారి నెత్తిన పిడుగు పడినట్లయింది. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఇలా.. ఉన్నత విద్యను సొంత డబ్బు పెట్టి చదువుకోలేని వారు తీవ్ర సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.
» వైఎస్ జగన్ తీసుకొచ్చిన కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 700 సీట్లు కోల్పోగా, వచ్చే ఏడాది అదనంగా వచ్చే సీట్లతో కలిపి మొత్తం 2,500 సీట్లను కోల్పోవాల్సి వస్తోంది.
ఇవ్వాల్సింది రూ.7,100 కోట్లు... బడ్జెట్‌లో రూ.2,600 కోట్లే
గత ఐదు త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.4,600 కోట్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. 2024–25కి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఈ ప్రభుత్వం రూ.700 కోట్లు కూడా ఇవ్వలేదు. అంటే గతేడాది పిల్లలకు రూ.3,200 కోట్లు బాకీ పెట్టారు.
అంతేకాకుండా 2025–26లో మరో రూ.3,900 కోట్లు విద్యాదీవెన, వసతి దీవెనకు కావాలి. ఈ రెండూ కలిపితే పిల్లలకు రూ.7,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్‌లో కేవలం రూ.2,600 కోట్లే కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే పిల్లలను చదువులకు దూరం చేసే కుట్ర తేటతెల్లమవుతోంది. ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక విద్యార్థులను నట్టేట ముంచారు.
ఇప్పటికే ఆన్‌లైన్ వర్టికల్స్ ఎడెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. మరోవైపు విద్యా దీవెన ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసే పరిస్థితి వచ్చింది. వసతి దీవెనను పూర్తిగా గాలికి వదిలేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వారికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించడంతోపాటు 2025–26 బడ్జెట్‌లో ఈమేరకు తగినన్ని నిధులు కేటాయిస్తూ సవరణ చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
రూ.18,663.44 కోట్లు ఇచ్చిన వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు త్రైమాసికం ముగిసిన వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ఏడాదికి రూ.3,900 కోట్లు చొప్పున అందచేసింది.
ఐదేళ్లలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేశారు. గతంలో టీడీపీ సర్కారు ఇవ్వకుండా ఎగ్గొట్టిన రూ.1,778 కోట్ల ఫీజు బకాయిలను సైతం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచారు. మొత్తం రూ.18,663.44 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు.
» కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు ఊడబెరికి వలంటీర్లను నడిరోడ్డుపైకి లాగేశారు. రూ.10,000 వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించి, పీఠం ఎక్కాక 2.60 లక్షల మంది వలంటీర్ల జీవితాలను గాలికి వదిలేశారు.
» తొలి సంతకం అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొట్టిన డీఎస్సీకి 9 నెలలైనా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా ముంచారు. 16,347 పోస్టులను ప్రకటించి.. డిసెంబరు నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేశారు.
»‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్‌లా పారిపోయే బ్యాచ్ కాదు నేను..’ అంటూ 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో ప్రగల్భాలు పలికిన లోకేశ్.. ఇప్పుడు జాబ్ కేలండర్ ఊసే మర్చిపోయారు. చంద్రబాబు సైతం ఇదే హామీ పదేపదే ఇచ్చారు. జనవరి 1 వెళ్లిపోయింది, ఫిబ్రవరి దాటేసింది, మార్చి కూడా అయిపోతోంది.. కానీ జాబ్ కేలండర్ ప్రకటన లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్–1, 2 మెయిన్స్ పరీక్షలను పలుసార్లు వాయిదా వేశారు.
గత నెలలో గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించారు. ఈ పరిణామాలను గమనిస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన 21 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని 10 లక్షల మందికి పైగా పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో.. శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలా? అని మథనపడుతున్నారు.
» చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలో నిరుద్యోగుల సంక్షేమానికి పైసా కూడా విదల్చలేదు. ఏపీలో గత ఏడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి.
ఇంటికి ఒకరిని గుర్తించినా నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు, ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చేసరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు, ఏడాదికి రూ.61,200 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూపాయి కూడా కేటాయించలేదు.
Comments
Please login to add a commentAdd a comment