
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
వలంటీర్ వ్యవస్థను కొనసాగించి.. వేతనం రూ.10 వేలు చేస్తామని చెప్పిందెవరు?
వలంటీర్లను నమ్మించి దగా చేయడం దారుణం: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థే లేదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అదే వాస్తవమైతే విజయవాడ వరద బాధితులకు సహాయ, సహకారాలు అందించేందుకు వలంటీర్లు కావాలని అధికారిక ఉత్తర్వులిచ్చి.. వలంటీర్ల సేవలు ఏవిధంగా వినియోగించుకున్నారు’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వేతనాలు రూ.10 వేలకు పెంచుతామని నమ్మించి, 2.56 లక్షల మందిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు.
వలంటీర్లకు గౌరవ వేతనాల పెంపు అంశంపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్న సోమవారం మండలిలో చర్చకు వచ్చింది. సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వలంటీర్లు ఎవరూ లేరని, ఈ నేపథ్యంలో వేతనాల పెంపు అంశమే ఉత్పన్నం కాదన్నారు. మంత్రి సమాధానంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వరదల్లో వారిని ఎలా వినియోగించుకున్నారు?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వలంటీర్లే లేకపోతే విజయవాడ వరదల్లో వారి సేవలను ప్రభుత్వం ఎందుకు వినియోగించుకుందని నిలదీశారు. వరదల సమయంలో ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్, తేదీలతో సహా సభలో చదివి వినిపించారు. వరద సహాయ చర్యల్లో పాల్గొనకపోతే వలంటీర్లపై మీద చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరించిందని గుర్తు చేశారు. వలంటీర్లతో అవసరం తీరాక ఆ వ్యవస్థే లేదని చెప్పడం సమంజసం కాదన్నారు.
‘గత ప్రభుత్వంలో వలంటీర్లకు ఇచ్చిన రూ.5 వేలు సరిపోదు.. మేం వస్తే రూ.10 వేలు చెల్లిస్తాం’ అని టీడీపీ నాయకులు ప్రచారం చేశారన్నారు. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వీరికి నెలకు రూ.10 వేలకు వేతనం పెంచుతామని ప్రస్తుత సీఎం, మంత్రులు హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సేవాభావంతో ముందుకు వచ్చి ప్రజల మన్ననలు పొందిన వలంటీర్లను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం తలచుకుంటే వలంటీర్లను రెన్యూవల్ చేయడం పెద్ద సమస్య కాదన్నారు. వలంటీర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి డోలా మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థ మనుగడలో ఉందనే భ్రమలో తాము విజయవాడ వరదల్లో వారి సేవలు వినియోగించుకోవడానికి ఉత్తర్వులు ఇచ్చామన్నారు. మనుగడలో లేని వారిని ఎలా కొనసాగించాలని ప్రశ్నించారు.
నిమ్మల ముసిముసి నవ్వులు
‘మా ప్రభుత్వం వస్తేనే వలంటీర్ల వేతనాలు రూ.10 వేలకు పెంచుతాం. వేతనం పెరిగిన వెంటనే నాకు పూతరేకులు, స్వీట్ బాక్స్, జున్ను ఇవ్వాలి’ అని వలంటీర్లకు చెబుతూ ఎన్నికల ముందు ప్రస్తుత మంత్రి ఒకరు ప్రచారం చేశారని రమేశ్‌యాదవ్ గుర్తు చేశారు. వేతనాలు పెంచితే మంత్రికి పూతరేకులు, జున్ను ఇద్దామని వలంటీర్లు అందరూ రెడీగా ఉన్నారన్నారు. దీంతో వెంటనే సభలోని వారంతా మంత్రి నిమ్మల రామానాయుడు వైపు చూశారు. ఈ క్రమంలో ఆయన పేపర్‌లో ఏదో చదువుతున్నట్టు తల దించుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment