టెన్త్‌ తర్వాత ఉపాధికి మార్గం..పాలిటెక్నిక్‌ | Polytechnic Courses For After Tenth Class Results | Sakshi
Sakshi News home page

టెన్త్‌ తర్వాత ఉపాధికి మార్గం..పాలిటెక్నిక్‌ కోర్సులు

Published Fri, Apr 6 2018 1:33 PM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM

Polytechnic Courses For After Tenth Class Results - Sakshi

నిడమర్రు :  పదో తరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, త్వరగా ఉపాధి సంపాదించాలంటే ఉత్తమ మార్గం పాలిటెక్నిక్‌ కోర్సు. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలీసెట్‌)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ ఏడాది 50,424 మంది విద్యార్థులు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు రాశారు. పదో తరగతి తర్వాత టెక్నికల్‌ కోర్సులు చేసి టెక్నికల్‌ అంశాలపై పట్టు సాధించి జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు ఉత్తమ మార్గం పాలిటెక్నిక్‌ కోర్సులు అభ్యసించడం. పాలిసెట్‌–2018 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 15వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పాలిటెక్నిక్‌ కోర్సులు, అర్హతలు, పరీక్షా విధానం తదితర సమాచారం తెలుసుకుందాం.

పాలిసెట్‌ నిర్వహించేది.. స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ సంస్థ ఈ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌)ను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రభుత్వ/ప్రైవేట్‌/ఎయిడెడ్‌/అన్‌ ఎయిడెడ్‌/ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో రెండో షిఫ్ట్‌ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సులు ఇలా..
మూడేళ్ల కోర్సులు : సివిల్‌ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌ షిప్, మెకానికల్, ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోం సైన్స్‌.

మూడున్నరేళ్ల కోర్సులు
కెమికల్‌(సాండ్‌విచ్‌) ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఉన్న కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, ఈసీఈ, ఐఈ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీడియో ఇంజనీరింగ్, బయో మెడికల్‌ ఇంజినీరింగ్, లెదర్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌ (షుగర్‌ టెక్నాలజీ)

అర్హతలు :ఆంధ్రప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ గుర్తించిన పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. పదో తరగతి కంపార్ట్‌మెంట్‌లో పాసైనవారు, పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రవేశం తీసుకునే ముందు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.

పరీక్షా విధానం..
ఈ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష రాసేందుకు 2 గంటల సమయం ఉంటుంది.
పరీక్ష పేపరు ఒకటే ఉంటుంది. 120 ఆబ్జెక్టివ్‌ మాదిరి ప్రశ్నలకు 120 మార్కులు కేటాయిస్తారు.
పదో తరగతి స్థాయిలోని గణితంలో 60 ప్రశ్నలు, భౌతికశాస్త్రంలో 30 ప్రశ్నలు, రసాయన శాస్త్రానికి సంబంధించిన 30 ప్రశ్నలు ఉంటాయి.
మొత్తం 120 మార్కులకు 36 మార్కులను ఈ  కోర్సుకు క్వాలిఫైయింగ్‌ మార్కులుగా నిర్ణయిస్తారు.
ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు క్వాలిఫైయింగ్‌ మార్కులతో సంబంధం లేకుండా ఆయా కేటగిరిల్లో సీట్లు భర్తీ చేస్తారు.

ఉన్నత విద్యాచదువులకు మంచి అవకాశం..
పాలిటెక్నిక్‌ కోర్సులు (మూడు/మూడున్నరేళ్ల డిప్లొమా) పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ‘ఈ సెట్‌’ నిర్వహిస్తారు. దీని ద్వారా బీటెక్‌/బీఈ నేరుగా రెండో సంవత్సరంలో (లేటరల్‌ ఎంట్రీ ద్వారా) ప్రవేశాలు కల్పిస్తారు.

ఉద్యోగ అవకాశాలు
ప్రభుత్వ/ప్రైవేటు సంస్థల్లో డిప్లొమా చదివినవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సబ్‌ ఇంజనీర్, ట్రెయినీ ఇంజనీర్‌గా అవకాశాలు ఉంటాయి. జెన్‌కో, ట్రాన్స్‌కో, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖల్లో డిప్లొమా అభ్యర్థులకు అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఇలా
https://appolycet.co.in/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి పదో తరగతి లేదా తత్సమాన కోర్సుకు సంబంధించిన హాల్‌ టికెట్‌ నెంబరు, పుట్టిన తేదీ, పాస్‌/హాజరైన సంవత్సరం నమోదు చేస్తే కనిపించే దరఖాస్తు ను పూరించాలి, ఆన్‌లైన్‌లోనే ఫీజు రూ.350 కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేదా జిల్లాలో ఏర్పాటు చేసిన  హెల్ప్‌లైన్‌ సెంటర్లలో దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15
పరీక్ష  నిర్వహించే తేదీ: ఏప్రిల్‌ 27 (ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకూ)

జిల్లాలోని  హెల్ప్‌లైన్‌ సెంటర్స్‌:
ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్, తణుకు
సీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్, ఏలూరు
గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ జంగారెడ్డిగూడెం
శ్రీమతి సీతా పాలిటెక్నిక్, భీమవరం
గవర్నమెంట్‌ పాలిటెక్నిక్, తాడేపల్లిగూడెం
పరీక్షా కేంద్రాలు: తణుకు, ఏలూరు, భీమవరంమరిన్ని వివరాలకోసం 91333 99677/91333 99677/ 91333 99688/ 91333 99699 నంబర్లకు సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement