అంకుర దశలోనే ఆధునిక కోర్సులు | Artificial Intelligence And Design Thinking Courses In CBSE Schools | Sakshi
Sakshi News home page

అంకుర దశలోనే ఆధునిక కోర్సులు

Published Sun, Apr 26 2020 2:12 AM | Last Updated on Sun, Apr 26 2020 3:20 AM

Artificial Intelligence And Design Thinking Courses In CBSE Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక విద్యా కోర్సులు పాఠశాల స్థాయి నుంచే చదువుకునేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆరో తరగతి నుంచే ఆ కోర్సుకు సంబంధించిన పరిచయ అంశాలను సీబీఎస్‌ఈ పాఠశాలల్లో బోధించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంచి, ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు, శారీరక దృఢత్వం కలిగి ఉండేలా వారిని తీర్చిదిద్దేందుకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) చర్యలు చేపట్టింది.

ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డిజైన్‌ అండ్‌ థింకింగ్, ఫిజికల్‌ యాక్టివిటీ ట్రైనర్‌ కోర్సులను తీసుకువచ్చింది. 2020–21 విద్యా ఏడాది నుంచి వీటిని అమల్లోకి తీసుకువస్తోంది. స్కిల్‌ కోర్సులను రెగ్యులర్‌ విద్యలో భాగం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలిమెంటరీ, సెకండరీ, సీనియర్‌ సెకండరీ స్థాయిలో స్కిల్‌ కోర్సులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ స్కూళ్లన్నింటిలో వీటిని అమలు చేయనుంది.

కొత్త విద్యావిధానానికి అనుగుణంగా.. 
పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య, అదనపు పాఠ్య కార్యక్రమాలకు మధ్య, వృత్తి విద్యా, సంప్రదాయ విద్యకు మధ్య వ్యత్యాసం ఉండొద్దని, విద్యార్థిని అన్నింటిలో మేటిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాల్సిందేనని నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా ప్రణాళిక చట్రాన్ని (నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌ వర్క్‌) సవరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సంప్రదాయ విద్యలో వృత్తి విద్యను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టింది. వృత్తి విద్య అంటే టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రీషియన్, సెల్‌ఫోన్‌ మెకానిక్‌ వంటి కోర్సులే ఉండగా ఇకపై వాటి రూపు మారుతోంది. 21వ శతాబ్దంలో క్రిటికల్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లం సాల్వింగ్‌ కీలకమైన ప్రక్రియ. దానిని సీబీఎస్‌ డిజైన్‌–థింకింగ్‌ పేరుతో సబ్జెక్టుగా తీసుకొస్తోంది.

తరగతులను అనుసరించి... 
ప్రాథమిక (6, 7, 8) తరగతుల్లో స్కిల్‌ కోర్సులకు సంబంధించిన పరిచయ పాఠాలు ఉండనున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఐటీ తదితర కోర్సులకు సంబంధించి 12 గంటల బోధన ఉండనుంది. ఏఐతో సహా మొత్తంగా 9 కోర్సులకు సంబంధించిన పరిచయ పాఠాలు బోధిస్తారు. ఇందులో 15 మార్కులు థియరీకి, 35 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. కొత్త సబ్జెక్టులైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఫిజికల్‌ యాక్టివిటీ ట్రైనర్‌ సబ్జెక్టులు కలుపుకొని సెకండరీ స్థాయిలో 18 సబ్జెక్టులు అందుబాటులోకి రానున్నాయి. సీనియర్‌ సెకండరీ స్థాయిలో 40 సబ్జెక్టులను అందుబాటులోకి తెచ్చింది. అయితే సెకండరీ స్థాయిలో విద్యార్థులు తమ తప్పనిసరి సబ్జెక్టులైన లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్‌ సైన్స్‌తోపాటు ఆరో (అదనపు) సబ్జెక్టును (స్కిల్‌ సబ్జెక్టుగా) ఎంచుకోవాల్సి ఉంటుంది. సీనియర్‌ సెకండరీ స్థాయిలో సబ్జెక్టు–1గా లాంగ్వేజ్‌–1, సబ్జెక్టు–2గా లాంగ్వేజ్‌–2 ఉంటాయి. సబ్జెక్టు–3, 4, 5లుగా రెండు అకడమిక్‌ సబ్జెక్టులు (ఎలక్టివ్‌), ఒక స్కిల్‌ సబ్జెక్టు ఎంచుకోవాలి. లేదా ఒక అకడమిక్‌ సబ్జెక్టు, రెండు స్కిల్‌ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా మూడు స్కిల్‌ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఆరో అదనపు సబ్జెక్టుగా (ఆప్షనల్‌) ఒక భాషను లేదా అకడమిక్‌ సబ్జెక్టును లేదా స్కిల్‌ సబ్జెక్టును ఎంచుకోవచ్చు. ఇందులో స్కిల్‌ సబ్జెక్టులో 50 మార్కులు థియరీకి, 50 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించారు.  

అకడమిక్‌ సబ్జెక్టుగానే అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ 
► 2020–21 నుంచి 11వ తరగతిలో అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ స్కిల్‌ సబ్జెక్టుగా ఉండదు. అకడమిక్‌ సబ్జెక్టుగా ఉంటుంది. అలాగే ఎక్స్‌రే టెక్నీషియన్, మ్యూజిక్‌ ప్రొడక్షన్, అప్లైడ్‌ ఫిజిక్స్, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ స్కిల్‌ సబ్జెక్టులుగా ఉండవు.  
► పదో తరగతిలో విద్యార్థులు ఎవరైనా తప్పనిసరి సబ్జెక్టులైన మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌సైన్స్‌లో ఫెయిల్‌ అయితే ఆరో సబ్జెక్టుగా చదువుకున్న స్కిల్‌ సబ్జెక్టును అందులో పరిగణనలోకి తీసుకొని పాస్‌ చేస్తారు. అయితే విద్యార్థి ఫెయిల్‌ అయిన ఆ సబ్జెక్టు పరీక్ష రాయాలనుకుంటే రాసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement