న్యూఢిల్లీ: నాణ్యమైన విద్య అందకపోవడం వల్లనే ఇంజనీరింగ్ కాలేజీల్లో అధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ముందస్తు ప్రణాళిక లేకుండా ఏఐసీటీఈ దరఖాస్తు చేసుకున్న వారికల్లా అనుమతి ఇవ్వడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు.
గత నాలుగేళ్లలో ఇలా అధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోయిన 100కు పైగా కాలేజీలను మూసివేశామన్నారు. కాలేజీల్లో సీట్లు మిగిలిపోవడం వల్ల దేశానికి ఎలాంటి సమస్య లేదన్నారు. విద్యార్థులంతా కాలేజీల్లో నాణ్యమైన విద్య, వసతులను బట్టి కాలేజీలను ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు.
ఈ సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా రాష్ట్రాలతో సమన్వయమై సరైన ప్రణాళికలతోనే కొత్త కాలేజీలకు అనుమతిస్తున్నామని జవదేకర్ స్పష్టం చేశారు. కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ లేకనే విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు మొగ్గుచూపడం లేదన్న కాలేజీల వాదనను జవదేకర్ తప్పుబట్టారు. ఐఐటీల్లో చాలా ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నాయని, చాలా ఉద్యోగ అవకాశాలున్నాయి, కానీ నాణ్యమైన విద్యావంతులు అందుబాటులో ఉండటం లేదన్నారు. మార్కెట్ తగ్గట్టుగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోలేకపోతున్నారని చెప్పారు.
దీనికి యూనివర్సిటీలు కూడా కారణమని, పాత సిలబస్‌తోనే కోర్సులను కొనసాగించడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడం కోసమే ప్రభుత్వం మెక్ ఇన్ ఇండియా కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇన్‌క్యూబేషన్ సెంటర్లలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణనిస్తున్నారని జవదేకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment