మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల కొరత కారణంగా వృత్తి విద్యా కోర్సులు వెలవెలబోతున్నాయి. ఇంజనీరింగ్ ఫార్మసీ వంటి కోర్సుల్లో ఏటా సగం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. అనుమతుల సమయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), అనుబంధ గుర్తింపు ఇచ్చేటప్పుడు యూనివర్సిటీలు పట్టించుకోని కారణంగా నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీల్లో సీట్లు కుప్పలుతెప్పలుగా పెరిగాయి. దీంతో మెరుగైన బోధన అందక విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయి.
ఇంజనీరింగ్ చేసిన వారిలో 69 శాతం మందికి ఉపాధి దొరకడం లేదు. గత ఐదారేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు ఉపాధి అవకాశాలు కల్పించే కాలేజీలపైనే దృష్టి పెడుతున్నారు. ఆర్థికంగా కష్టమైనా ప్లేస్‌మెంట్స్ ఉన్న కాలేజీల్లో.. మేనేజ్‌మెంట్ కోటాలోనూ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఏటా ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిపోతోంది. – సాక్షి, హైదరాబాద్
దేశవ్యాప్తంగా సగం సీట్లే భర్తీ...
2016–17 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 6,472 ఇంజనీరింగ్ కాలేజీల్లో 29,98,298 సీట్లు అందుబాటులో ఉండగా అందులో 15,41,182 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే దాదాపు సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 268 ఇంజనీరింగ్ కాలేజీల్లో 2,30,552 సీట్లను ఏఐసీటీఈ మంజూరు చేయగా అందులో కేవలం 1,18,419 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
ఇక ఫార్మసీలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 2016–17 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మసీ కాలేజీల్లో 1,69,776 సీట్లు అందుబాటులో ఉండగా అందులో 1,09,741 సీట్లు భర్తీ అయ్యాయి. మన రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫార్మసీలో 25,757 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 10,391 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. గత నాలుగైదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది.
64% నుంచి 50 శాతానికి పడిపోయిన ప్రవేశాలు...
దేశంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు గత ఆరేళ్లలో దారుణంగా పడిపోయాయి. 2012–13 విద్యా సంవత్సరంలో 64.87 శాతంగా ఉన్న సీట్ల భర్తీ.. 2016–17 విద్యా సంవత్సరానికి 50.26 శాతానికి తగ్గిపోయింది. అలాగే రాష్ట్రంలో 2012–13లో 56.63 శాతంగా ఉన్న ప్రవేశాలు 2016–17లో 51.97 శాతానికి పడిపోయాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా ఫార్మసీ కాలేజీల్లో కేవలం 60 శాతం నుంచి 64 శాతం వరకే సీట్లు భర్తీ అవుతుండగా రాష్ట్రంలోని ఫార్మసీ కాలేజీల్లో 40 శాతం నుంచి 50 శాతం లోపే సీట్లు భర్తీ అవుతున్నాయి. గత ఐదేళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. 2012 నుంచి పరిస్థితి చూస్తే దేశవ్యాప్తంగా ఫార్మసీలో ప్రవేశాల శాతం క్రమంగా పెరుగుతుండగా మన రాష్ట్రంలో మాత్రం క్రమంగా తగ్గిపోతోంది.
ఆలస్యంగానైనా స్పందించిన ఏఐసీటీఈ...
ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో నెలకొన్న పరిస్థితులకు నాణ్యతా ప్రమాణాల కొరతే ప్రధాన కారణమన్న అంశంపై ఏఐసీటీఈ ఎట్టకేలకు మేల్కొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యల్లో భాగంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను కట్టడి చేయడంపై దృష్టి సారించి ఐదేళ్లపాటు కొత్త కాలేజీలకు అనుమతులపై నిషేధం విధించాలని నిర్ణయించింది.
2019 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఇటీవల ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశంలో స్పష్టం చేసింది. అలాగే 30 శాతం లోపు ప్రవేశాలున్న కాలేజీలను మూసివేయాలని నిర్ణయించింది.
మూసివేతకు దరఖాస్తులు...
విద్యార్థులు చేరకపోవడంతో ఏటా పదుల సంఖ్యలో ఫార్మసీ, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీలు మూత పడుతున్నాయి. 2012 నుంచి 2016 మధ్య 22 కాలేజీలు మూతపడగా 80 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేతకు దర ఖాస్తు చేసుకున్నాయి. 100 ఎంసీఏ కాలేజీలు, 200 మేనేజ్‌మెంట్ కాలేజీలూ మూసివేత కోసం ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో మూసివేతకు దరఖాస్తు చేసుకున్న వాటిల్లో 11 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.
ఇదీ ఫార్మసీలో సీట్ల భర్తీ పరిస్థితి...
విద్యా సంవత్సరం దేశవ్యాప్తంగా.. రాష్ట్రంలో..
మొత్తం సీట్లు భర్తీ అయినవి మొత్తం సీట్లు భర్తీ అయినవి
2016–17 1,69,776 1,09,741 25,757 10,391
2015–16 1,73,837 1,04,818 29,750 11,832
2014–15 1,77,815 1,01,590 35,566 12,596
2013–14 1,69,665 98,318 32,780 15,219
2012–13 1,61,292 99,124 29,846 16,320
Comments
Please login to add a commentAdd a comment