ఉజ్వల భవిష్యత్తుకు.. ఏవియేషన్ | Aviation courses to Bright future | Sakshi
Sakshi News home page

ఉజ్వల భవిష్యత్తుకు.. ఏవియేషన్

Published Tue, Jun 21 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

ఉజ్వల భవిష్యత్తుకు.. ఏవియేషన్

ఉజ్వల భవిష్యత్తుకు.. ఏవియేషన్

కమర్షియల్ పైలట్ ట్రైనింగ్
ప్రజల ఆదాయాల్లో పెరుగుదల, విమాన ప్రయాణ చార్జీలు తగ్గడం, వ్యాపార నిర్వహణకు సంబంధించి రాకపోకలు పెరగడం, పర్యాటక రంగ అభివృద్ధి తదితర కారణాల వల్ల విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఏవియేషన్ రంగం విస్తరిస్తూ యువతకు సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అందుబాటులో ఉన్న ఏవియేషన్  కోర్సులు, వాటిని అందిస్తున్న సంస్థలు, అర్హతలు తదితర వివరాలు..
 
ఏవియేషన్ రంగంలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కోర్సుకు క్రేజ్ ఎక్కువ. దీనికి ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే, అత్యున్నత వేతనంతో ఉద్యోగం పొందొచ్చు. కమర్షియల్ పైలట్ కావాలనుకునే వారికి కమర్షియల్ పైలట్ లెసైన్స్ (సీపీఎల్) తప్పనిసరి. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గుర్తింపు పొందిన సంస్థ నుంచి శిక్షణ పూర్తిచేసిన వారికి ఈ లెసైన్స్ లభిస్తుంది. తొలుత స్టూడెంట్ పైలట్ లెసైన్స్,  అనంతరం ప్రైవేట్ పైలట్ లెసైన్స్, ఆ తర్వాత కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఇస్తారు.
 
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. ఇంటర్‌లో వీటిని చదవనివారు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా అభ్యసించవచ్చు. ఈ కోర్సులో చేరే వారికి నిర్ణీత శారీరక, ఆరోగ్య ప్రమాణాలు ఉండాలి. అలాగే నిర్దిష్ట వయోపరిమితి కలిగి ఉండాలి. కోర్సులో ప్రవేశాలకు పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
 
వేతనం: కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పైలట్ ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది.
కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ - భువనేశ్వర్, న్యూఢిల్లీ,  గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ - బెంగళూరు, రాజీవ్‌గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ - తిరువనంతపురం, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్‌బరేలీ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్
 
క్యాబిన్ క్రూ/ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్
ఇందులో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ కోర్సుల కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది మధ్యలో ఉంటుంది. కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఫ్రాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ (కోర్సులు: డిప్లొమా ఇన్ ఏవియేషన్, హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, డిప్లొమా కోర్‌‌స ఇన్ హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ కస్టమర్ సర్వీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్), ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ (కోర్సు: క్యాబిన్ క్రూ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ - ఎయిర్ హోస్టెస్/ఫ్లైట్ స్టీవార్‌‌డ).
అర్హతలు: ఇంటర్/+2 పూర్తిచేసిన మహిళా, పురుష అభ్యర్థులిద్దరూ అర్హులు. ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీసెస్, ఇన్ ఫ్లైట్ ట్రైనింగ్, సేఫ్టీ అండ్ ఫస్డ్ ఎయిడ్ ప్రొసీజర్, ఫుడ్ అండ్ బేవరేజ్ ప్రొడక్షన్ అండ్ సర్వింగ్ తదితర అంశాలు నేర్పిస్తారు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.4 నుంచి రూ.6 లక్షలు ఉంటుంది.
 
ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్
ఇది నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ. ఎయిర్‌క్రాఫ్ట్‌ల డిజైన్, రూపకల్పన, నిర్వహణ తదితరాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇది పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో చీఫ్ ఇంజనీర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు.
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్/+2 పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ఇందులో ప్రవేశాలకు అభ్యర్థులు జాతీయ/రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
వేతనం:  ప్రారంభంలో వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుంది.
సంస్థలు:  జేఎన్‌టీయూ - కాకినాడ, మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
 
బీఎస్సీ ఏవియేషన్
బీఎస్సీ ఏవియేషన్ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఎయిర్ రెగ్యులేషన్స్, నేవిగేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ ఇంజిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏవియేషన్ సెక్యూరిటీ, ఫ్లైట్ సేఫ్టీ తదితర అంశాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దీన్ని పూర్తిచేసిన వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, గ్రౌండ్ ఆపరేషన్స్ స్టాఫ్, కార్గో మేనేజ్‌మెంట్ స్టాఫ్, టికెటింగ్ స్టాఫ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు.
అర్హత: ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్‌లతో ఇంటర్/+2.
వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఉన్నత విద్య దిశగా కూడా వెళ్లొచ్చు.
 
కోర్సును అందిస్తున్న సంస్థలు:
ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్; ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ                       - రాయ్‌బరేలీ
 
ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (ఏఎంఈ)
కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు, ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి డీజీసీఏ.. ఏఎంఈ లెసైన్స్‌ను అందిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తనిఖీ, నిర్వహణ, సర్వీసింగ్‌పై ఈ కోర్సు ప్రధానంగా దృష్టిసారిస్తుంది. కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు పొందొచ్చు. అలాగే ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ సంస్థలు, ఫ్లయింగ్ స్కూళ్లలో కూడా ఉద్యోగాలు సాధించొచ్చు.
 
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. అలాగే నిర్ణీత వయోపరిమితి, వైద్య ప్రమాణాలు ఉండాలి. చివరి 6 నెలల పాటు విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయాలి.
వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది.
కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్.
 
బీబీఏ ఇన్ ఏవియేషన్ మేనేజ్‌మెంట్
కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు కరిక్యులంలో ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ,  ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, సేఫ్టీ మేనేజ్‌మెంట్ తదితర అంశాలు ఉంటాయి. ఈ కోర్సును పూర్తిచేసిన వారు విమానాశ్రయాల్లో ఎయిర్‌పోర్ట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటర్, స్టాఫ్ మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించొచ్చు.
 
అర్హత : కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూపులో ఇంటర్/+2.
అందిస్తున్న సంస్థలు: ఎయిమ్‌ఫిల్ ఇంటర్నేషనల్ - హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్) - డెహ్రాడూన్ (బీబీఏ ఏవియేషన్ ఆపరేషన్‌‌స).
వేతనం:  ప్రారంభంలో 3 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఔత్సాహికులు ఎంబీఏ కూడా చేయొచ్చు.
 
గ్రౌండ్ స్టాఫ్
మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఈ కోర్సులుంటాయి. ఏదైనా గ్రూపులో ఇంటర్ పూర్తి చేసిన వారు ఇందులో చేరొచ్చు. ఎయిర్‌పోర్ట్ స్ట్రాటజీ అండ్ ఫంక్షనింగ్, కార్గో మేనేజ్‌మెంట్ అండ్ హ్యాండ్లింగ్, స్టాఫ్ మేనేజ్‌మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ తదితర అంశాలను ఇందులో నేర్పిస్తారు.

కోర్సు పూర్తిచేసిన వారు ప్రాంతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎయిర్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, కార్గో డిపార్ట్‌మెంట్ మేనేజర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి ఉంటుంది. అయితే ఈ కోర్సు తర్వాత ఐఏటీఏ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలుంటాయి.
 
కోర్సులు - అందిస్తున్న సంస్థలు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ ఫెమిలియరైజేషన్ అండ్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ (కోర్సు: ఎయిర్ కార్గో అండ్ కొరియర్ మేనేజ్‌మెంట్).
 
ఇంకా ఎన్నో..

ఇవే కాకుండా డిప్లొమా ఇన్ క్యాబిన్ క్రూ అండ్ ఇన్ ఫ్లైట్ సర్వీస్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్, డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో ప్రాక్టీసెస్ అండ్ డాక్యుమెంటేషన్, డిప్లొమా ఇన్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ తదితర ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఇంటర్ విద్యార్హతతో ఈ కోర్సులు చేయొచ్చు.
 
నల్సార్ వర్సిటీలో..
నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్)... ఏవియేషన్ అండ్ స్పేస్‌లా కోర్సులను అందిస్తోంది. కోర్సుల వివరాలు...
మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ (రెండేళ్లు)
మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్పేస్ అండ్ టెలీకమ్యూనికేషన్ ‘లా’స్ (రెండేళ్లు)
పీజీ డిప్లొమా ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ (ఏడాది)
పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ లా (ఏడాది)
అర్హతలు: మూడేళ్ల ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement