గుజరాత్: దేశంలోనే అత్యంత పిన్న వయసులో కమర్షియల్ పైలట్ అయిన ఘనత మైత్రి పటేల్ సొంతం చేసుకున్నారు. సూరత్‌కి చెందిన మైత్రి కేవలం 19 యేళ్ల వయసులోనే ఆకాశం అంచులను అందుకున్నారు. ‘నా ప్రయాణంలో ఎదురైన సవాళ్లన్నింటిని నా కలను నెరవేర్చుకోవడానికి పునాదులుగా మల్చుకున్నాను’ అని ఆమె మీడియాకు వెల్లడించారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన మైత్రి, 8 యేళ్ల వయసులో మొదటిసారిగా విమానం చూశానని, అప్పుడే తాను పైలట్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 12 వ తరగతి వరకు మన దేశంలోనే చదివినా.. అనంతరం పైలట్ ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్లానని చెప్పారు. ఐతే ఈ ట్రైనింగ్‌ను కేవలం 11 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు.
మైత్రి తండ్రి కాంతిలాల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ సూరత్ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు పడవలో ప్రయాణికులను చేరవేస్తూ డబ్బు సంపాందించేవాడినని తెలిపాడు. విమానాలు టేక్ ఆఫ్, ల్యాండ్ అవ్వడం చూస్తూ ఉండేవాడినని, అప్పుడే తన కూతురు కూడా ఫైలట్ అయ్యి, ప్రపంచమంతా పర్యటించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తన కూతురిని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లో కూడా చేర్పించానని ఆనందం వ్యక్తం చేశారు.
అయితే ఈ పిన్న వయస్కురాలైన పైలట్ మైత్రి పటేల్ మాత్రం తన దృష్టి భవిష్యత్ ప్రణాళికపై కేంద్రీకరించినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆకాశంలో విహరించాలని, బోయింగ్ విమానంలో ఎగరాలని, అందుకు త్వరలోనే ట్రైనింగ్ తీసుకోబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment