- సంస్కృతీ విద్యాసంస్థల అంతర్జాతీయ సదస్సులో వక్తులు
- ఎస్‌ఎస్‌బీలో ఘనంగా స్మార్ట్ సదస్సు ప్రారంభం
పుట్టపర్తి టౌన్ : అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ సాంకేతికతను అలవర్చుకున్నప్పుడే ఆధునిక మానవుడు ఉజ్వల భవిష్యత్తును పొందగలడని వివిధ దేశాల నిర్మాణ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఆధునిక కాలంలోఅభివృద్ధి చెందిన దేశాల పట్టణీకరణ, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్ సిటీస్ టెక్నాలజీపై సంస్కృతీ విద్యాసంస్థలలో రెండురోజుల అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. విద్యాసంస్థల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ముఖ్య అతిథిగా విచ్చేసిన జపాన్‌లోని టోక్యో యూనివర్శిటీ డైరెక్టర్ అజ్‌బే బ్రౌన్ జ్యోతి ప్రజ్వలన గావించారు.
అనంతరం అజ్‌బే బ్రౌన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడి ప్రభుత్వాలు స్మార్ట్ పరిజ్ఙానంతో తక్కువ ఖర్చుతో నిర్మాణాలు, భద్రత, మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండే భారతదేశంలో నిర్మాణ రంగంలో స్మార్ట్ టెక్నాలజీ వినియోగం అత్యవసరమన్నారు. పారిస్‌కు చెందిన నిర్మాణ రంగ నిపుణురాలు క్లారిసెస్‌టన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే స్మార్ట్ నగరాల సాంకేతికత, ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. సామాజిక మార్పులకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను అందించే దిశగా విద్యార్థులు ముందడుగు వేయాలని కొలరాడో స్టేట్ యూనివర్శిటీకి చెందిన బో బ్లాడ్‌జెట్ సూచించారు.
ఆధునిక మానవుని అవసరాలకు అనుగుణంగా యువత నూతన అవిష్కరణలవైపు దృష్టి సారించాలని వర్క్‌బెంచ్ ప్రాజెక్ట్స్ సీఈఓ పవన్‌కుమార్ అన్నారు. బెంగళూరుకు చెందిన సామాజిక అవిష్కరణల నిపుణుడు అభిజిత్ సిన్హా మాట్లాడుతూ నీటి అవసరం లేని మూత్రాశాలలను, తక్కువ ఖర్చుతో నిర్మించగలిగే అంబులెన్స్‌లను రూపొందించే కృషి చేస్తున్నామన్నారు. కళాశాలలో ఇంజనీరింగ్ విభాగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వియన్నా యూనివర్శిటీ సైంటిస్ట్ పౌల్‌స్పెసిబెర్గ్, స్మార్ట్ డిజైనర్ చోలే జిమ్మర్‌మెన్, మంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ నిపుణుడు చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ సాంకేతికతతోనే బంగారు భవిష్యత్తు
Published Fri, Jan 27 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
Advertisement