ఎన్నికల తర్వాతే మంచిరోజులు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం, డాలర్ ప్రభావం.. ఇలా ఒకదాని వెంట మరొకటి చొప్పున సమస్యలు చుట్టుముట్టడంతో 2013 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఇక కోలుకునేది సార్వత్రిక ఎన్నికల తర్వాతే’’ అని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికల సమయంలో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడిదారులు, విదేశీ సంస్థలు వెనుకడుగు వేస్తాయని, ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఎన్నికలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయని వారు పేర్కొన్నారు. అందుకే ఇలాంటి సమయంలో కోట్ల రూపాయల పెట్టుబడులంటే ఆలోచిస్తారన్నారు. ‘సీఐఐ ఎస్టేట్ సౌత్-మేకింగ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ రియల్ ఎస్టేట్’ రెండు రోజుల సదస్సు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోట ల్‌లో జరిగింది. ఈ సదస్సులో ఎస్టేట్ సౌత్ 2013 చైర్మన్, మంజీరా కన్‌స్ట్రక్షన్స్ సీఎండీ జి.యోగానంద్ మాట్లాడుతూ... ఏటా జీడీపీ పెరుగుదలలో 25 శాతం రియల్ ఎస్టేట్ మార్కెట్ నుంచే వస్తోందన్నారు. ‘వచ్చే 30-40 ఏళ్లలో జనాభా రెండింతలవుతుంది. ఈ జనాభాకు ఇళ్లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఆసుపత్రులు అవసరముంటాయి. అందుకే భవిష్యత్తులో మాల్స్, హోటళ్లు, ఆసుపత్రులకు మంచి గిరాకీ ఉంటుంది’ అని చెప్పారు.
అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం, అక్కడి స్థానిక సంస్థలు మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని ఎస్టేట్ సౌత్ 2013 కో-చైర్మన్, అక్షయ ప్రై.లి. సీఎండీ టి.చిట్టిబాబు అభిప్రాయపడ్డారు. ప్రి-ఇంజనీరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయిందని సీబీఆర్‌ఈ దక్షిణాసియా సీఎండీ అన్షుమన్ మేగజైన్ చెప్పారు. ‘‘ఈ టెక్నాలజీతో సమయం ఆదా ఆవటమే కాక ఫ్లాట్ల ధరలు కూడా తక్కువగా ఉంటాయి. ఇంటి విస్తీర్ణం కూడా పెరుగుతుంది’’ అని చెప్పారాయన. సదస్సులో సీఐఐ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్, శ్రీనివాస హేచరీస్ వైస్ చైర్మన్ సురేష్ చిట్టూరి, ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్, అప్రెడా అధ్యక్షుడు దశరథ్‌రెడ్డి, ఏపీ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.