జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కేంద్రమంత్రిగా జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి అయిన తరువాత తొలిసారిగా నెల్లూరుకు వచ్చిన ఆయన్ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి నారాయణ కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారని, ఆయనకు తన పూర్తి సహకారాన్ని అందజేస్తానని తెలిపారు. గతంలో ఆచరణకు నోచు కోని పథకాలను పూర్తి చేయడానికి తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల రెండు పార్టీలు లాభం పొందాయని తెలిపారు. అయితే నెల్లూరు ప్రజలే తమకు న్యాయం చేయలేదన్నారు. ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ-బీజేపీకి రాలేదని తెలిపారు. తిరుపతి, నెల్లూరు ఎంపీ స్థానాలు బీజేపీకి దక్కకపోవడం బాధాకరమన్నారు. అయితే ఆ ఎంపీలు కూడా సమర్థులేనని తెలిపారు నెల్లూరును అభివృద్ధి చేయడానికి తన సంపూర్ణ సహకారం అందజేస్తానని తెలిపారు. జిల్లాలోని సమస్యలపై కలెక్టరును వివరాలు అడిగానని, నివేదిక అందిన వెంటనే ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తానని తెలిపారు.
సమస్యలెదురైనా పోలవరం ఆర్డినెన్స్ తెచ్చాం
కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రాష్ట్రానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని, ఇందులో భాగంగానే సమస్యలు ఎదురైనా పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో తీసుకొచ్చామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. విభజనకు కట్టుబడ్డా, విభజన తీరును వ్యతిరేకించామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని విభజించిందని తెలిపారు. ఇందులో భాగంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని చెప్పారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ సభ్యులు దేశ సమస్యలు అనేకం ఉన్నా, వాటిని చర్చించ కుండా పాలస్తీనాపై చర్చించమని గొడవకు దిగడం సమంజసం కాదన్నారు. రైలు చార్జీలను పెంచకుండా అభివృద్ధి అసాధ్యమన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైలు ప్రాజెక్టులు విలువ ఐదు లక్షల కోట్ల రూపాయలని తెలిపారు. అంత ఆదాయం రైల్వేలో లేనందున రైలు చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రానికి ఇంకా అనేక విద్యా సంస్థలు, రాష్ట్రం కోరిన ప్రాజెక్టులు తెప్పిస్తామని చెప్పారు. అన్ని అంశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అవసరం ఉందన్నారు. అభివృద్ధి విషయంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ పార్టీలు ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు.
ఘనసన్మానం:
నెల్లూరు (దర్గామిట్ట): కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన మువ్పవరపు వెంకయ్యనాయుడుకు సింహపురి ప్రజలు ఘనంగా సన్మానించారు. అనిల్ గార్డెన్స్‌లో శుక్రవారం రాత్రి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి మాణిక్యరావు, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మాత్యులు నారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. తనకు ఇద్దరు గురువులున్నారని, మొదటి గురువు చంద్రబాబు అయితే రెండో గురువు వెంకయ్యనాయుడని చెప్పారు. కేంద్రంలో వెంకయ్యనాయుడుకు, రాష్ట్రంలో తనకు ఒకే శాఖ రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన సహకారంతో నెల్లూరును పూర్తిగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు.
మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు వల్లే ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా 900 వైద్య సీట్లు వచ్చాయని కొనియాడారు. వెంకయ్యనాయుడు సింహపురి ముద్దు బిడ్డ కాదని, తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డగా ఎదిగారన్నారు. ఆయన స్నేహితుడుగా తాను గర్వపడుతున్నాని తెలిపారు. మంత్రి మాణిక్యరావు మాట్లాడుతూ అధికారంతో సంబంధం లేకుండా నమ్మిన సిద్దాంతంతో పనిచేసే తత్వం వెంకయ్యనాయుడుకు ఉందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి భానుప్రకాష్, మాజీ ఎమ్మెల్యేలు కృష్ణయ్య, దారా సాంబయ్య, ఎప్‌సీఐ మాజీ డెరైక్టర్ రాధాకృష్ణారెడ్డి, బీజీపీ నేతలు కందుకూరి సత్యనారాయణ, కప్పిర శ్రీనివాసులు, ఆంజనేయరెడ్డి, వరదయ్య, రమేష్, మండల ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లరెడ్డి, రంగినేని కృష్ణయ్య, టీడీపీ నేత విజయకృష్ణారెడ్డి, రత్నం విద్యాసంస్థల అధినేత కిషోర్ పాల్గొన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యకు ఘన స్వాగతం
నెల్లూరు (సెంట్రల్): జిల్లా ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి అయిన తరువాత మొదటిసారి సొంతగడ్డపై అడుగుపెట్టడంతో బీజేపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అయ్యప్పగుడి వద్ద పెద్ద ఎత్తున బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అయ్యప్పగుడి వద్ద నుంచి వేదాయపాళెం, నిప్పోసెంటరు, కరెంటుఆఫీస్, వెంకటరమణ హాల్ సెంటరు, కేవీఆర్ పెట్రోలు బంకు మీదుగా ర్యాలీ నిర్వహించి నగరంలోకి ప్రవేశించారు. బ్యాండు, కీలుగుర్రాలు, మహిళలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాండు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.