ప్రతీకాత్మక చిత్రం
ఇంటర్మీడియెట్(ఎంపీసీ) విద్యార్థుల కలల కోర్సు.. ఇంజనీరింగ్(బీటెక్/బీఈ). నేటి యువత క్రేజీ కెరీర్ ఇది. దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యాక ఏం చేయాలి?! అనే ప్రశ్న ఎదురవుతోంది. ఉద్యోగమా.. ఉన్నత విద్యా.. ఏ మార్గం ఎంచుకోవాలి.. వాస్తవానికి బీటెక్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ముందు అనేక ఉన్నత విద్య, ఉద్యోగ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా.. తమ కెరీర్ లక్ష్యాలకు ఏది అనుకూలమో అది ఎంచుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. బీటెక్ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం..
బీటెక్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ కోర్ విభాగంలోనే కొనసాగాలనుకుంటే.. ఎంటెక్‌లో చేరొచ్చు. లేదా మేనేజ్‌మెంట్ వైపు వెళ్లాలనుకుంటే.. ఎంబీఏలో అడుగుపెట్టొచ్చు. ఇటీవల కాలంలో ఎంబీఏను ఎంచుకునే ఇంజనీరింగ్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. మరికొందరు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ) ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్నారు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
బీటెక్ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. నిజానికి ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ ద్వారా ఉద్యోగం పొందడం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గంగా చెప్పొచ్చు. ప్రముఖ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి ఏటా ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ నిర్వహిస్తుంటాయి. ఈ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే విద్యార్థులు అందుకోసం ముందుగానే కసరత్తు ప్రారంభించాలి. రిక్రూటర్లను ఆకట్టుకునేలా రెజ్యూమ్‌ని రూపొందించుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే బీటెక్ మొదటి ఏడాది నుంచే సబ్జెక్ట్‌ల్లో మంచి స్కోరు వచ్చేలా చూసుకోవాలి. అంతేకాకుండా కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌తోపాటు బీటెక్ ప్రాజెక్ట్ వర్క్‌పైనా పట్టు సాధించాలి. కాలేజీలో జరిగే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్పంచుకోవడం మేలు చేస్తుంది. ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో విజయం సాధించేందుకు సబ్జెక్టు నైపుణ్యాలతోపాటు, ప్రాక్టికల్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్, కంపెనీలు, మార్కెట్‌లు, తాజా టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి.
ఉన్నత విద్య.. ఎంటెక్/ఎంబీఏ
► ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. స్వదేశంలో ఎంటెక్ లేదా విదేశాల్లో ఎంఎస్ చేయాలని ప్రణాళికలు వేసుకుంటారు. దేశలోని టాప్ కాలేజీల్లో ఎంటెక్‌లో చేరేందుకు చక్కటి మార్గం.. ‘గేట్’(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్). బీటెక్ సబ్జెక్టులపై సమగ్ర అవగాహన, బేసిక్ కాన్సెప్ట్‌లపై గట్టి పట్టు, ప్రశ్నల ప్రాక్టీస్ ద్వారా గేట్‌లో మంచి ర్యాంకు సాధించొచ్చు.
► గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్ అభ్యర్థులు మేనేజ్‌మెంట్ కోర్సులను ఎంచుకుంటున్నారు. బీటెక్+ఎంబీఏ.. గొప్ప కెరీర్ కాంబినేషన్‌గా గుర్తింపు పొందింది. వీరికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే చాలామంది విద్యార్థులు బీటెక్ తర్వాత ఎంబీఏలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాప్ బిజినెస్ స్కూల్స్ ఐఐఎం(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)ల్లో పీజీ కోర్సుల్లో చేరాలంటే..క్యాట్(కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. క్యాట్‌తోపాటు మ్యాట్,సీమాట్, ఐసెట్, జీమ్యాట్ వంటి ఎంట్రెన్స్‌ల ద్వారా ఎంబీఏలో చేరేందుకు అవకాశం ఉంది.
పీఎస్‌యూల్లో ఉద్యోగం
బీటెక్ అభ్యర్థులకు మరో మంచి అవకాశం.. ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ) ఉద్యోగం. వీరు గేట్‌లో టాప్ ర్యాంకు ద్వారా సదరు పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీహెచ్‌ఈఎల్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, నాల్కో, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ వంటి వాటిల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగం దక్కించుకోవచ్చు. గేట్ స్కోరుతో సంబంధం లేకుండా.. డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఎన్‌ఎండీసీ, బార్క్, ఇస్రో వంటి ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తాయి.
సివిల్స్, ఈఎస్‌ఈ
పరిపాలన విభాగంలో చేరాలనుకునే బీటెక్ అభ్యర్థులకు చక్కటి మార్గం.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఇందుకోసం యూపీఎస్సీ ఏటా విడుదల చేసే నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. మూడంచెల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించేందుకు సన్నద్ధమవ్వాలి. ఇది దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. అలాగే ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం యూపీఎస్సీ విడుదల చేసే మరో ప్రతిష్టాత్మక నోటిపికేషన్..ఈఎస్‌ఈ(ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్). దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ ఏ స్థాయి పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే యూపీఎస్సీ విడుదల చేసే మరో ఉన్నత నోటిఫికేషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్)కు కూడా బీటెక్ అభ్యర్థులు పోటీ పడొచ్చు.
దేశ సేవకు ‘డిఫెన్స్’
భారత సైన్యానికి అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక విభాగం ఉంది. దీంతో భారత సైన్యంలోని టెక్నికల్ వింగ్స్‌లో ఇంజనీర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. టెక్నికల్ ఎంట్రీ లెవెల్‌తో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరొచ్చు. బీటెక్ తర్వాత యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్(యూఈఎస్), ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్), షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ) వంటి వాటి ద్వారా త్రివిధ దళాల్లో చేరొచ్చు. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టీజీసీ)కు దరఖాస్తు చేసుకొని.. ఇండియన్ మిలటరీ అకాడమీలో చేరొచ్చు. రక్షణ దళాల్లో ఉద్యోగం అంటే.. అత్యంత గౌరవప్రదమైన కెరీర్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. ఇందులో చేరిన అభ్యర్థులకు మంచి వేతనం, ఉద్యోగ భద్రత, సౌకర్యాలతోపాటు దేశానికి సేవ చేస్తున్నామని సంతృప్తి సైతం లభిస్తుంది.
ప్రైవేట్ రంగంలో కొలువు
బీటెక్ ఉత్తీర్ణులకు ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. నైపుణ్యాలుంటే.. ప్రభుత్వ రంగం కంటే ఎన్నో రెట్లు అధిక వేతనాలు కార్పొరేట్ కంపెనీల్లో లభిస్తున్నాయి. బీటెక్ గ్రాడ్యుయేట్లను ఇంజనీర్లుగానే కాకుండా.. పరిశోధకులుగా, కన్సల్టెంట్లుగా, సాఫ్ట్‌వేర్ డవలపర్‌లుగా నియమించుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీర్, సిస్టమ్ అనలిస్ట్, ఐటీ కో ఆర్డినేటర్, అప్లికేషన్ డెవలపర్ వంటి జాబ్స్ ఐటీ రంగంలో దక్కించుకోవచ్చు. అలాగే క్వాలిటీ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ఇండస్ట్రియల్ మేనేజర్, ప్లాంట్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ టెక్నీషియన్ వంటి కొలువులు సైతం తయారీ రంగంలో సొంతం చేసుకోవచ్చు. సీ, సీ++, జావా, ఎస్‌క్యూఎల్, ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, నెట్‌వర్కింగ్, ఐవోటీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఎంబెడెడ్ టెక్నాలజీ, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నైపుణ్యాలు పెంచుకుంటే వివిధ విభాగాల్లో కొలువులు లభించే అవకాశం ఉంటుంది.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
ఇటీవల ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, కొత్త ఆలోచనతో స్టార్టప్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. విద్యార్థులు ప్రారంభించిన పలు స్టార్టప్స్ విజయవంతం కావడం.. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రేరణగా నిలుస్తోంది. కాని సొంత వ్యాపారం అనే మార్గంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేందుకు ఎంతో ఓపిక, సహనం అవసరం!!
Comments
Please login to add a commentAdd a comment