బీటెక్‌ ఫస్టియర్‌.. ఇలా చేస్తే నో ఫియర్‌! | BTech First Year: Tips For Academic Success, Focus on 4 0 Skills | Sakshi
Sakshi News home page

BTech First Year: బీటెక్‌.. 4.0 స్కిల్స్‌తోనే సక్సెస్‌!

Published Tue, Jun 22 2021 8:22 PM | Last Updated on Tue, Jun 22 2021 9:17 PM

BTech First Year: Tips For Academic Success, Focus on 4 0 Skills - Sakshi

బీటెక్‌ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టాం.. నాలుగేళ్ల తర్వాత మంచి మార్కులతో పట్టా పొందితే చాలు.. కొలువు ఖాయమనే అభిప్రాయంతో చాలామంది విద్యార్థులు ఉంటారు. వాస్తవానికి కోర్సు పూర్తయ్యాక కోరుకున్న ఉద్యోగం దక్కాలంటే.. మార్కులతోపాటు మరెన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లేటెస్ట్‌ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌ సొంతం చేసుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో ఈ స్కిల్స్‌ ఉన్న అభ్యర్థులకే ఆఫర్లు ఇచ్చేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు.. తమ నాలుగేళ్ల స్టడీని ఎలా ప్లాన్‌ చేసుకోవాలి.. నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ..

బీటెక్‌లో అకడమిక్‌గా మంచి మార్కులతోనే కొలువుల కల సాకారమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్‌కు అనుగుణంగా నూతన టెక్నాలజీలపై పట్టు సాధించాలి. ఇందుకోసం బీటెక్‌ మొదటి సంవత్సరం నుంచే కృషి చేయాలన్నది నిపుణుల సలహా. 

డిజిటల్‌ యుగం
ప్రస్తుతం అంతటా డిజిటల్‌ టెక్నాలజీ రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లోని సంస్థలూ ఆధునిక సాంకేతికతల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నైపుణ్యాలున్న వారికే నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు.. సదరు తాజా నైపుణ్యాలు, టెక్నాలజీలపై పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. బీటెక్‌ మూడో సంవత్సరంలోకి వచ్చాక నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే సఫలం కాలేరు. ఎందుకంటే.. ఆ సమయంలో ఓవైపు తృతీయ, చివరి సంవత్సరాల అకడమిక్‌ ఒత్తిడి.. మరోవైపు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్‌ వర్క్, ప్లేస్‌మెంట్స్‌ వంటివి ఉంటాయి.

 
బ్రాంచ్‌ ఏదైనా
బీటెక్‌లో ఏ బ్రాంచ్‌ విద్యార్థులైనా సరే.. తమ విభాగానికి సరితూగే ఇండస్ట్రీ పరిణామాలను నిత్యం తెలుసుకోవాలి. డిజిటల్‌ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. కోర్‌ బ్రాంచ్‌లు మొదలు సాఫ్ట్‌వేర్‌ కొలువులకు మార్గం వేసే సీఎస్‌ఈ, ఐటీ విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌
► ప్రస్తుతం బీటెక్‌ విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా పేర్కొంటున్న నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. కారణం.. కంపెనీలు ఈ స్కిల్స్‌ ఉన్న వారికే ఆఫర్లు ఖరారు చేస్తుండటమే! మొత్తం విద్యార్థుల్లో ఇండస్రీ ్ట4.0 స్కిల్స్‌ ఉన్న వారి సంఖ్య 20 నుంచి 25 శాతం మధ్యలోనే ఉంటోంది. దీంతో అవకాశాలున్నా.. నైపుణ్యాలు లేక ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కాబట్టి బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు.. భవిష్యత్‌ అవకాశాలు అందుకోవాలంటే.. ఇప్పటి నుంచి ఆయా నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. (ఎన్‌డీఏ, ఎన్‌ఏ 2021: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు)

► ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా పేర్కొంటున్న.. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), డేటా అనలిటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, రోబోటిక్స్, 3డి డిజైన్, ఎథికల్‌ హ్యాకింగ్, సైబర్‌ సెక్యూరిటీ, వీఆర్‌/ఏఆర్‌ టెక్నాలజీలు..ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతున్నాయి. బీటెక్‌ విద్యార్థులు తొలి రోజు నుంచే వీటిని నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇంజనీరింగ్‌లో చేరిన లక్ష్యానికి అనుగుణంగా కెరీర్‌ను ఉజ్వలంగా మలచుకునే అవకాశం లభిస్తుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలామంది విద్యార్థులు లేటెస్ట్‌ స్కిల్స్‌ నేర్చుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థులు ఆన్‌లైన్‌ మార్గాల్లో సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. 


కోడింగ్‌.. ప్రోగ్రామింగ్‌
ప్రస్తుతం ఉద్యోగ సాధనంలో కీలకంగా నిలుస్తున్న నైపుణ్యాలు.. కోడింగ్, ప్రోగ్రామింగ్‌. వాస్తవానికి ఇంజనీరింగ్‌ కోర్సు స్వరూపంలోనే వీటికి అకడమిక్‌గా ప్రాధాన్యం ఉంది. కాని ప్రాక్టికల్‌ అప్రోచ్‌ తక్కువగా ఉండటంతో ఈ నైపుణ్యాలు ఆశించినంతగా లభించట్లేదు. ము ఖ్యంగా సీఎస్‌ఈ/ఐటీ బ్రాంచ్‌ల విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లను ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో నేర్చుకునేందుకు సిద్ధమవ్వాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్, పైథాన్, ఆర్, జావా, సీ, సీ++, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్‌ వంటివి నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. మూక్స్, ఆన్‌లైన్‌ వేదికలు, షార్ట్‌టర్మ్‌ కోర్సులు, యూట్యూబ్‌ వీడియోల ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్‌ హ్యా ట్, ఐబీఎం, జెట్‌ కింగ్‌ వంటి సంస్థలు ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌పై సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా సంబంధిత నైపుణ్యాలు పొందొచ్చు. 

సర్క్యూట్‌ బ్రాంచ్‌ల విద్యార్థులు
► ఈసీఈ, ఈఈఈ వంటి సర్క్యూట్‌ బ్రాంచ్‌ల విద్యార్థులు కూడా లేటెస్ట్‌ డిజిటల్‌ స్కిల్స్‌ సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలి. 

► ఈసీఈ విద్యార్థులు వీఎల్‌ఎస్‌ఐ, నానో టెక్నాలజీ విభాగాల్లో షార్ట్‌టర్మ్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేయడం ద్వారా జాబ్‌ మార్కెట్లో ముందుండొచ్చు. వీరికి కలిసొచ్చే మరికొన్ని సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఫైబర్‌ ఆప్టిక్‌ టెక్నాలజీ; ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌; రోబోటిక్స్‌. 

► ఈఈఈ విద్యార్థులు.. ఎలక్ట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్, పవర్‌ సిస్టమ్స్‌ అనాలిసిస్, సర్క్యూట్‌ అనాలిసిస్, అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ ఇన్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌ వంటివి నేర్చుకోవాలి. వీటితోపాటు ఎస్‌సీఏడీఏ (సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌), డిస్ట్రిబ్యూటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పలు మార్గాల్లో నేర్చుకునే అవకాశం ఉంది. 


రోబోటిక్‌ స్కిల్స్‌
మెకానికల్‌ బ్రాంచ్‌ విద్యార్థులు.. రోబోటిక్‌ స్కిల్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. దీంతోపాటు ఈ బ్రాంచ్‌ విద్యార్థులు క్యాడ్, క్యామ్‌; ఆటోమేషన్, 2–డి, 3–డి డిజైన్‌ ప్రింటింగ్‌లపైనా అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం రోబో ఆధారిత కార్యకలాపాలు అన్ని సంస్థల్లోనూ సాగుతున్నాయి. అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు రోబోటిక్‌ స్కిల్‌ మేలు చేస్తుందని చెప్పొచ్చు. వీటిని సొంతంగా అభ్యసించేందుకు పలు ఆన్‌లైన్‌ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి.

ప్రాక్టికల్, అప్లికేషన్‌ అప్రోచ్‌
మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. ఏ అంశాన్నైనా ప్రాక్టికల్‌ ఓరియెంటేషన్, అప్లికేషన్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అందుకోసం లేబొరేటరీల్లో ఆయా సబ్జెక్ట్‌ అంశాలకు సంబంధించి ప్రాక్టికల్స్‌ చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. తద్వారా రియల్‌ టైం నైపుణ్యాలు సొంతమవుతాయి. 

ఇంటర్న్‌షిప్స్‌
బీటెక్‌ కోర్సులో చేరిన విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా రియల్‌ టైమ్‌ నైపుణ్యాలు పెంచుకునేందుకు.. కనీసం రెండు లేదా మూడు ఇంటర్న్‌షిప్స్‌ చేయాలి. ఈ మేరకు ఏఐసీటీఈ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి విద్యార్థులు ఆయా విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు పొందేందుకు గల మార్గాలను అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్‌లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌ సెల్, ఆయా సంస్థల్లో పని చేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. ప్రాక్టికల్‌ నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. ఇంటర్న్‌గా చూపిన ప్రతిభ ఆధారంగా సదరు సంస్థల్లోనే పూర్తిస్థాయి ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.  


సాఫ్ట్‌ స్కిల్స్‌

బీటెక్‌ విద్యార్థులు సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్చుకోవడానికి కూడా ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుతం సంస్థల్లో టీం వర్క్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిచేసే క్రమంలో బృందంలోని సహోద్యోగులతోపాటు వివిధ విభాగాల సీనియర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. ఆ క్రమంలో సాఫ్ట్‌ స్కిల్స్‌ ఎంతో ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, బిహేవియరల్‌ స్కిల్స్, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్, లాంగ్వేజ్‌ స్కిల్స్, క్రియేటివ్‌ థింకింగ్, డెసిషన్‌ మేకింగ్‌ వంటివి ప్రధాన సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు.

ఆన్‌లైన్‌ సదుపాయాలు
విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్,సాఫ్ట్‌స్కిల్స్‌ పెంచుకునేందకు ఆన్‌లైన్‌ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మూక్స్, ఎన్‌పీటీఈఎల్,స్వయం వంటి పోర్టల్స్‌ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్ల లెక్చర్స్‌ వినే అవకాశం లభిస్తుంది. ఇలా..ఒకవైపు అకడమిక్‌ నాలెడ్జ్, మరోవైపు ఇండస్ట్రీకి అవసరమైన లేటెస్ట్‌ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా.. మొదటి ఏడాది నుంచే ముందుకుసాగితే.. బీటెక్‌ విద్యార్థులు తమ కలల కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.


బీటెక్‌ మొదటి సంవత్సరం.. ముఖ్యాంశాలు

► బ్రాంచ్‌ ఏదైనా ఉద్యోగ సాధనలో కీలకం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌.
► ప్రాక్టికల్‌ అప్రోచ్,అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌ ఉంటేనే జాబ్‌ ఆఫర్స్‌.
► డిజిటల్‌ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్‌ స్కిల్స్‌కూ ప్రాధాన్యమిస్తున్న సంస్థలు. 

లేటెస్ట్‌ స్కిల్స్‌ ఉంటేనే
ఇప్పుడు ఏ బ్రాంచ్‌ విద్యార్థులైనా.. లేటెస్ట్‌ స్కిల్స్‌ ఉంటేనే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మెరుగ్గా రాణించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంజనీరింగ్‌ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే తమ బ్రాంచ్‌కు సరితూగే టెక్నాలజీస్‌పై అవగాహన పొందేందుకు కృషి చేయాలి. అకడమిక్స్‌లో లెర్నింగ్‌తోపాటు ప్రాక్టికల్‌ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.  
– ప్రొఫెసర్‌ ఎన్‌.వి.రమణరావు, డైరెక్టర్, నిట్‌–వరంగల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement