బీఎస్సీ డేటా సైన్స్ | BSC Data Science | Sakshi
Sakshi News home page

బీఎస్సీ డేటా సైన్స్

Published Sun, Aug 2 2020 3:58 AM | Last Updated on Sun, Aug 2 2020 3:58 AM

BSC Data Science - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా డిగ్రీలో పలు కొత్త కోర్సులు, కొత్త కాంబినేషన్లను ప్రవేశ పెట్టేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే వీటిని అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం విద్యారంగంలో అత్యధిక డిమాండ్‌ ఉన్న డేటా సైన్స్‌ను బీఎస్సీ డేటా సైన్స్‌ పేరుతో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. యూనివర్సిటీ ల్లోని కంప్యూటర్‌ సైన్స్, మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్‌ విభాగాలతోపాటు టీసీఎస్, కాగ్నిజెంట్‌ వంటి పారిశ్రామిక రంగాలకు చెందిన నిఫుణుల సహకారంతో కోర్సు సిలబస్‌కు డిజైన్‌ చేసింది. 

టాప్‌ కోర్సు బీఎస్సీ డేటా సైన్స్‌ 
మార్కెట్లో పరిస్థితులు, ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా రూపుదిద్దుకున్న బీఎస్సీ డేటా సైన్స్‌ కోర్సును రాష్ట్రంలోని 80 ప్రైవేటు కాలేజీల్లో నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది. కొన్ని కాలేజీల్లో ఒక సెక్షన్‌కు, ఇంకొన్ని కాలేజీల్లో రెండు మూడు సెక్షన్లకు అనుమతిచ్చింది. ఇక 26 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఈ కోర్సు నిర్వహణకు కళాశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉండనున్నాయి. హైదరాబాద్‌ బేగంపేటలోని ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్‌ డిగ్రీ కాలేజీ, సిటీ కాలేజీ, గద్వాలలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (కోఎడ్యుకేషన్‌), బాన్స్‌వాడ, కామారెడ్డి, ఎస్‌ఆర్‌ఆర్‌ కరీంనగర్, జీడీసీ (ఉమెన్‌) కరీంనగర్, ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ ఖమ్మం, ఎమ్‌వీఎస్‌ మహబూబ్‌నగర్, ఎన్‌టీఆర్‌ (ఉమెన్‌) మహబూబ్‌నగర్, నారాయణపేట, కూకట్‌పల్లి, నాగార్జున కాలేజీ– నల్లగొండ, గిరిరాజ్‌ కాలేజీ–నిజమాబాద్, హయత్‌నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, గజ్వేల్‌ (ఉమెన్‌), కేడీసీ హన్మకొండ, పింగలి ఉమెన్స్‌ కాలేజీ– హన్మకొండల్లో ఈ కోర్సును ప్రవేశ పెడుతోంది. 

వేటికవే విలక్షణం.. ఈ కోర్సులు 
► బీకాం బిజినెస్‌ అనలటిక్స్‌ కోర్సును 24 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు. 
► బీకాం టాక్సేషన్‌ కోర్సు 27 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అందుబాటులోకి రానుంది. వీటిలో ఆదిలాబాద్, భద్రాచలం డిగ్రీ కాలేజీలున్నాయి. 
► బీకాం ఫారిన్‌ ట్రేడ్‌ కోర్సును హైదరాబాద్‌లోని సిటీ కాలేజీ, బేగంపేట ఉమెన్స్‌ కాలేజీ, ఖైరతాబాద్‌ డిగ్రీ కాలేజీల్లో అందుబాటులోకి రానుంది. 
►మొదటిసారి బీఏ మ్యాథమేటిక్స్‌ను ప్రవేశపెడుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా ఆర్ట్స్‌ కాంబినేషన్స్‌తో రూపుదిద్దిన ఈ కోర్సును ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. మ్యాథ్స్, హిస్టరీ, ఎకనమిక్స్‌ కాంబినేషన్‌తో పాటు పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టుల కాంబినేషన్లతో ఈ కోర్సు రూపుదిద్దుకుంది. 
► జమ్మికుంట డిగ్రీ కాలేజీలో మాత్రమే ఉన్న బీఏ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును తాజాగా 21 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు. కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌తో కాంబినేషన్‌తో ఈ కోర్సును తీసుకువస్తున్నారు. 
► ప్రస్తుతం ఇంటర్మీడియట్‌లో వొకేషనల్‌ కోర్సులు చదివిన విద్యార్థులకు మరిన్ని అవకాశాలు పెంచేలా బీఎస్సీ డెయిరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్‌ క్రాప్‌ ప్రొడక్షన్‌ వంటి కోర్సులను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. 
► జువాలజీ, కెమిస్ట్రీ, డెయిరీ సైన్స్‌ కాంబినేషన్‌తో డెయిరీ సైన్స్, క్రాప్‌ప్రొడక్షన్, బోటనీ, కెమిస్ట్రీతో కాంబినేషన్‌తో బీఎస్సీ అగ్రికల్చర్‌ క్రాప్‌ ప్రొడక్షన్‌ కోర్సును తీసుకువస్తున్నారు. 
►ఒకటీ రెండు కాలేజీలకే పరిమితమైన సెరీకల్చర్, ఫిషరీస్‌ వంటి కోర్సులను ఈసారి మరిన్ని కాలేజీలకు విస్తరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement