Nissie Leone: అనుకుంది... సాధించింది | Ap Women Nissie Leone success story | Sakshi
Sakshi News home page

Nissie Leone: అనుకుంది... సాధించింది

Published Tue, Jun 11 2024 12:40 AM | Last Updated on Tue, Jun 11 2024 10:22 AM

Ap Women Nissie Leone success story

– నిస్సీ లియోన్‌ సక్సెస్‌ స్టోరీ

కుటుంబంలో ఆడపిల్లను ఒక మైనస్‌గా భావించిన సమాజం నుంచి ఆడ, మగ అనే తేడా లేకుండా ఉన్నంతలో తమ పిల్లల్ని గొప్పగా చదివించాలనే సంకల్పం దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ మొదలైంది. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే నిస్సీ లియోన్‌.  

ఆడపిల్లను చదువుకోసం పొరుగూరుకు కూడా ఒంటరిగా పంపడానికి ఇప్పటికీ భయపడుతున్న రోజుల్లో విదేశాల్లో కొలువుకి ఎంపిక అయ్యేలా ప్రొత్సహించారు నిస్సీ తల్లిదండ్రులు, చదివింది డిగ్రీ అయినా యూకేలో ఉద్యోగంలో చేరుతోంది. వార్షిక వేతనం అక్షరాలా రూ.37 లక్షలు అందుకోబోతోంది.  గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన నిస్సీ లియోన్‌  తన విజయావకాశం గురించి ఆనందంగా తెలియజేస్తోంది.

‘‘బీఎస్సీ కార్డియాలజీలో డిగ్రీ పూర్తిచేశాను. యూకేలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌కు చెందిన ఎన్‌హెచ్‌ఎస్‌ నార్తెర్న్‌ కేర్‌ అలియన్స్‌ నన్ను ఉద్యోగానికి ఎంపికచేసింది. ప్రపంచవ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఈ సంస్థ ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఇండియా నుంచి ఇద్దరు ఎంపిక కాగా వారిలో నేనూ ఒకరిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

ఈ రోజుల్లో... 
మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న జార్జ్, అమ్మ సునీతలు స్థానిక చర్చ్‌లో  పాస్టర్స్‌గా పని చేస్తున్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడు. సేవా తత్పరతతో కూడిన ఉద్యోగం చేయాలనేది నా ఆలోచన. మా అమ్మనాన్నల సేవాగుణం నాలోనూ అలాంటి ఆలోచనలు కలగడానికి కారణం అయింది. మొదట వైద్యురాలిగా స్థిరపడాలనుకునేదాన్ని. 

కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వైద్య సహాయకురాలిగా స్థిరపడాలనుకున్నాను. శ్రీకాకుళంలోని బొల్లినేని మెడీ స్కిల్స్‌ పారా మెడికల్‌ డిగ్రీ కళాశాలలో కార్డియాలజీ విభాగంలో చేరాను. పిల్లల ఉన్నతోద్యాగాల గురించి పెద్దలు తరచూ ‘వాళ్లబ్బాయి సాఫ్ట్‌వేర్‌ అంట, వీళ్లమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుందంట’ అనే మాటలను వింటూనే ఉంటాం.

 అయితే దేశంలో కొన్ని రంగాలలో ఉన్నవారు మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. వారి విద్యార్హత, నాలెడ్జ్, చదివిన కాలేజీ, అభ్యర్థి నడవడిక, బృందంలో పనిచేసే వైఖరి.. వంటి వాటి ఆధారంగా జీతాలను నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసే వారికి సైతం మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి.

 విదేశీ సంస్థలు అందుకు స్వాగతం పలుకుతున్నాయి అని జెమ్స్‌ మెడికల్‌ కాలేజ్‌  ఛీఫ్‌ మెంటార్‌ బొల్లినేని భాస్కరరావు, బొల్లినేని మెడ్‌ స్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌  డైరెక్టర్‌ సిహెచ్‌. నాగేశ్వరరావు, అకడమిక్‌ డైరెక్టర్‌ పద్మజల ద్వారా తెలిసింది. అంతకుముందు నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన లేదు. కానీ, వారిప్రొత్సాహంతోనే ఈ ఘనత సాధించాను.

దశల వారీగా...
నేషనల్‌ హెల్త్‌ సర్వీసుకు చెందిన ఎన్‌హెచ్‌ఎస్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేస్తోంది. ఇందులో ప్రవేశం అంత సులువేమీ కాదని కొద్దిరోజుల్లోనే అర్ధమైంది. హైదరాబాద్‌ కు చెందిన ప్రకార స్వచ్ఛంద సంస్థ ద్వారా మా కాలేజీకి సమాచారం వచ్చింది.

 నైపుణ్యం కలిగిన బీఎస్సీ కార్డియాలజీ ఎకో గ్రాఫర్‌ కావాలని, అందుకు వెంటనే అప్లై చేసుకోవాలనీ మా కాలేజీ వాళ్లు చె΄్పారు. దీంతో అప్లై చేసి, సికింద్రాబాద్‌ కిమ్స్‌లో శిక్షణ తీసుకున్నాను. కిందటేడాది జరిగిన బ్రిటిష్‌ సొసైటీ అఫ్‌ ఎకోకార్డియోగ్రాఫీ (బిఎస్‌ఇ) వారు నిర్వహించిన ట్రాన్స్ థొరాసిక్‌ ఎకోకార్డియోగ్రఫీ (టీటీఇ) పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యాను. 

నిపుణులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ చేసింది. అంతకుముందు జరిగిన థియరీ పరీక్షలోనూ మంచి మార్కులు వచ్చాయి. రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించడంతో ఉద్యోగానికి ఎంపియ్యాను. వార్షిక వేతనం ఇండియా కరెన్సీలో రూ.37 లక్షలు అని తెలిసింది.

 అమ్మానాన్నలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను. ఒక డిగ్రీ విద్యార్థిని ఈ స్థాయిలో ΄్యాకేజీకి ఎంపిక కావడం చిన్న విషయం కాదని అందరూ అంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతోంది. వీసాకు అయ్యే మొత్తాన్ని, విమాన యాన ఖర్చులు కూడా ఆ సంస్థనే అందిస్తోంది’’ అంటూ ఆనందంగా తెలియజేసింది నిస్సీ. 

అనస్తీషియా, కార్డియాలజీ రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్టులుగా ఉండేవి. కార్డియాలజీలో పని పట్ల మరింత సంతృప్తి లభిస్తుందనిపించి ఈ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాను. మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యవృత్తిలో రాణించాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి, ఈ డిగ్రీ తీసుకున్నాను. నా కాలేజీ ఫీజు విద్యా దీవెనలో కవర్‌ అయ్యింది. ఇప్పుడు మంచి సంస్థలో ఉద్యోగం లభించింది. 
– నిస్సీ లియోన్‌

మా చుట్టుపక్కల వాళ్లందరూ మా అమ్మాయి గురించి గొప్పగా  మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంది. నిస్సీ తల్లిదండ్రులుగా మాకూ గుర్తింపు వచ్చింది. ఈ రోజే మా అమ్మాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి బయల్దేరింది. 
– తల్లిదండ్రులు

– నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement