9 ఏళ్లలో 75 కాలేజీలు మూత!  | Fewer admissions of students in districts | Sakshi
Sakshi News home page

9 ఏళ్లలో 75 కాలేజీలు మూత! 

Published Thu, Apr 11 2024 4:46 AM | Last Updated on Thu, Apr 11 2024 4:46 AM

Fewer admissions of students in districts - Sakshi

తీవ్ర ప్రతికూలతలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్‌ కాలేజీలు

2014లో 234... ఇప్పుడు 159 మాత్రమే

జిల్లాల్లో అరకొరగా విద్యార్థుల ప్రవేశాలు

నిశిత పరిశీలనకు ప్రత్యేక కమిటీ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. జిల్లాల్లోని కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో మూతపడుతున్నాయి. కొ­న్ని రాజధాని పరిసర ప్రాంతాలకు మారుతున్నాయి. ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది ఎన్ని కాలేజీలు ఉంటాయ­నే­ది అధికార వర్గాలే స్పష్టత ఇవ్వడం లేదు. కనీస స్థాయి విద్యార్థుల ప్రవేశాలు లేని కాలేజీలు కౌన్సెలింగ్‌లో నిలబడటం కష్టమనే వాదన వినిపిస్తోంది.

ప్రతి ప్రైవేటు కాలేజీకి సంబంధిత విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ ప్రక్రియ ఇంతవరకూ మొదలవ్వలే­దు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా కాలేజీల తనిఖీలు చేపట్టాలనే యోచనలో ఉంది. దీంతో యూనివర్సిటీలు అఫ్లియేషన్‌ విధానాన్ని మొదలు పెట్టలేదు.

మరోవైపు ఎక్కువ కాలేజీలు డిమాండ్‌ లేని బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్ల తగ్గింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటేనే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఎన్ని సీట్లు ఉంటాయనేది ఇప్పటివరకు స్పష్టత కరువైంది. 

ఏటా తగ్గుతున్న కాలేజీలు... 
హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీలు మినహా, జిల్లాల్లోని కాలేజీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దీంతో అనివార్యంగా మూతపడే పరిస్థితి కన్పిస్తోంది. 2014లో రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్‌ కాలేజీలుంటే, 2023 కౌన్సెలింగ్‌ నాటికి ఈ సంఖ్య 159కి పడిపోయింది. తొమ్మిదేళ్ల కాలంలోనే దాదాపు 75 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడ్డాయి. 2017 నుంచి కాలేజీలు కనుమరుగవ్వడం ఎక్కువైంది.

నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లల్లో తప్ప, ఇతర బ్రాంచీల్లో పది మంది కూడా చేరే పరిస్థితి కనిపించడం లేదు. పలు జిల్లాలకు చెందిన కాలేజీ యాజమాన్యాలు దాదాపు 15 కాలేజీలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మార్చుకునేందుకు దరఖాస్తులు పెట్టాయి. మరో పది కాలేజీలు ఈసారి అఫ్లియేషన్‌ నిబంధనలకు దూరంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

విద్యార్థుల విముఖతే సమస్య.. 
జిల్లాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడటం లేదు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ), డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ సీట్ల­ను పెంచుకునేందుకు జిల్లా కాలేజీలకు అనేక అడ్డంకు­లు ఎదురవుతున్నాయి.

మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం, డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో అధ్యాపకుల కొరత సమ­స్య కాలేజీలను వేధిస్తోంది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌ జిల్లాల్లో ఉండటం లేదు. ఈ కారణంగా కాలేజీల నిర్వహణ అతికష్టంగా ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనికి తోడు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్‌ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. 

ఆలోచనల్లో మార్పు  
విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్‌ కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వీటికే మార్కెట్‌ ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లో ఉంటే ఇంజనీరింగ్‌ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభమనే ఆలోచనలతో ఉన్నారు. ఈ పరిణామాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌ కాలేజీల నిర్వహణను కష్టంగా మారుస్తున్నా­యి. అన్ని బ్రాంచీల్లోనూ సరికొత్త సాంకేతిక బోధన విధానం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.      –ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement