Computer courses
-
ఏఐకి రూ.19 లక్షలు సైబర్ సెక్యూరిటీకి రూ.18 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు యాజ మాన్య కోటా సీట్ల బేరసారాల జోరు పెంచాయి. వీలైనంత ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లను పెద్ద మొత్తంలో అమ్ముకోవాలని చూస్తున్నాయి. డిమాండ్ ఉన్న టాప్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు సామాన్యులు ఆశించే స్థాయిలో లేవని తెలుస్తోంది.ఇంజనీరింగ్ సెట్ ఫలితాలు మరో పది రోజుల్లో రానుండటంతో యాజమాన్య సీట్ల వైపు ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అయితే, సీట్లు కొనుగోలు చేసేవాళ్లు, విక్రయించే కాలేజీలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తామేమీ చేయలేక పోతున్నామని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కడితేనే సీటు గ్యారంటీరాష్ట్రంలో ఈ ఏడాది 1.09 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండే వీలుంది. ఇందులో 30% అంటే దాదాపు 31 వేల సీట్లు మేనేజ్మెంట్ కోటా కిందకొస్తాయి. ఇందులో టాప్ కాలే జీల్లో 19 వేల సీట్ల వరకూ ఉండగా, వీటిలో సగం సీట్లను ఎన్ ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాలి. బీ కేటగిరీ సీట్లను జేఈఈ, ఈఏపీసెట్ ర్యాంకర్లు, ఇంటర్లో మార్కులు ఎక్కువ వచ్చిన వారికి క్రమానుగతంగా ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా సీట్లకు ఏడాదికి 5 వేల డాలర్లు (దాదాపు రూ. 4 లక్షలు) వసూలు చేసుకునే వీలుంది. అయితే, బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసే వాళ్ల వివ రాలు ప్రభుత్వ సంస్థల పరిధిలోకి రావడం లేదు. ఆన్లైన్ విధానంలోనూ ఉండటం లేదు. దీన్ని సాకుగా తీసుకుని యాజమాన్యాలు ముందే సీట్లను అమ్ముకుంటున్నాయి. ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు రాదని తెలిసిన వాళ్లు సీట్ల కోసం ఎగబడుతున్నారు. సెట్ రిజల్ట్ వస్తే డిమాండ్ పెరుగు తుందని, సీట్లు కూడా అయిపోయే ప్రమాదం ఉందని యాజ మాన్యాలు డిమాండ్ సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజు ప్రత్యేక విభాగాలు పెట్టి సీట్ల కోసం వచ్చే వారిని ఒప్పించి, మెప్పించి డబ్బు వసూలు చేస్తున్నాయి. సీటు ఇవ్వాలంటే ముందే డబ్బులు కట్టి రిజర్వు చేసుకోవాలని షరతు విధిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చాకే అడ్మిషన్లు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు మాత్రమే సీట్లు భర్తీ చేయాలి. ఇందుకు విరుద్ధంగా సీట్లు అమ్ముకునే సంస్థలపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ర్యాంకర్లకూ గాలం» జేఈఈ ర్యాంకర్లతో కాలేజీ యాజ మాన్యాలు రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్లకు కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేయించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు రాష్ట్ర సెట్లోనూ మంచి ర్యాంకు వస్తుంది. కంప్యూటర్ బ్రాంచీలో సీటుకు దరఖాస్తు చేస్తే తొలి కౌన్సెలింగ్‌లోనే సీటు వస్తోంది. జాయినింగ్ రిపోర్టు చేసి సీటు కన్ఫమ్ చేసుకుంటున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్ తర్వాత, స్పాట్ అడ్మిషన్‌కు ముందు సీటు వదులుకుని, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరతారు. ఇలా ఖాళీ అయిన సీట్లనూ యాజమాన్యాలు భారీ మొత్తంలో అమ్ముకుంటాయి. కంప్యూటర్ బ్రాంచీలో సీటుకు రూ.18 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి కోర్సులకు ఏకంగా రూ. 19 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 58 శాతం సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. -
9 ఏళ్లలో 75 కాలేజీలు మూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. జిల్లాల్లోని కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో మూతపడుతున్నాయి. కొన్ని రాజధాని పరిసర ప్రాంతాలకు మారుతున్నాయి. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది ఎన్ని కాలేజీలు ఉంటాయనేది అధికార వర్గాలే స్పష్టత ఇవ్వడం లేదు. కనీస స్థాయి విద్యార్థుల ప్రవేశాలు లేని కాలేజీలు కౌన్సెలింగ్‌లో నిలబడటం కష్టమనే వాదన వినిపిస్తోంది. ప్రతి ప్రైవేటు కాలేజీకి సంబంధిత విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ ప్రక్రియ ఇంతవరకూ మొదలవ్వలేదు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా కాలేజీల తనిఖీలు చేపట్టాలనే యోచనలో ఉంది. దీంతో యూనివర్సిటీలు అఫ్లియేషన్ విధానాన్ని మొదలు పెట్టలేదు. మరోవైపు ఎక్కువ కాలేజీలు డిమాండ్ లేని బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్ల తగ్గింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటేనే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్ని సీట్లు ఉంటాయనేది ఇప్పటివరకు స్పష్టత కరువైంది. ఏటా తగ్గుతున్న కాలేజీలు... హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలు మినహా, జిల్లాల్లోని కాలేజీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దీంతో అనివార్యంగా మూతపడే పరిస్థితి కన్పిస్తోంది. 2014లో రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2023 కౌన్సెలింగ్ నాటికి ఈ సంఖ్య 159కి పడిపోయింది. తొమ్మిదేళ్ల కాలంలోనే దాదాపు 75 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. 2017 నుంచి కాలేజీలు కనుమరుగవ్వడం ఎక్కువైంది. నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లల్లో తప్ప, ఇతర బ్రాంచీల్లో పది మంది కూడా చేరే పరిస్థితి కనిపించడం లేదు. పలు జిల్లాలకు చెందిన కాలేజీ యాజమాన్యాలు దాదాపు 15 కాలేజీలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మార్చుకునేందుకు దరఖాస్తులు పెట్టాయి. మరో పది కాలేజీలు ఈసారి అఫ్లియేషన్ నిబంధనలకు దూరంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల విముఖతే సమస్య.. జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడటం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ సీట్లను పెంచుకునేందుకు జిల్లా కాలేజీలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో అధ్యాపకుల కొరత సమస్య కాలేజీలను వేధిస్తోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ జిల్లాల్లో ఉండటం లేదు. ఈ కారణంగా కాలేజీల నిర్వహణ అతికష్టంగా ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనికి తోడు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. ఆలోచనల్లో మార్పు విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వీటికే మార్కెట్ ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లో ఉంటే ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభమనే ఆలోచనలతో ఉన్నారు. ఈ పరిణామాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీల నిర్వహణను కష్టంగా మారుస్తున్నాయి. అన్ని బ్రాంచీల్లోనూ సరికొత్త సాంకేతిక బోధన విధానం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
మరో 4 వేల సీట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ఇంజనీరింగ్ సీట్లు పెంచే అవకాశం ఉందని సమాచారం. 3 వేల నుంచి 4 వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ ఒకరు తెలిపారు. సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పు జరిగి చేరికల్లో ఎక్కువ మందికి చాన్స్ లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా నిధులూ అవసరమవుతాయి. దీంతో ఆన్లైన్ కోర్సుల నిర్వహణ ద్వారా ఐఐటీలు కొంతమేర నిధులు సమకూర్చుకునే ప్రతిపాదన ముందుకు వస్తోంది. కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ నేపథ్యంలో.. దేశంలో కంప్యూటర్ నేపథ్యం ఉన్న కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ప్యాకేజీల దృష్ట్యా రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎన్ఐటీలు, ఐఐటీల్లోనూ కంప్యూటర్ ఆధారిత కోర్సులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. జేఈఈలో అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్ష¯న్గా పెట్టుకుంటున్నారు. మరోవైపు నైపుణ్యంతో కూడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సదస్సులోనూ ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఐఐటీలు సైతం కంప్యూటర్ కోర్సుల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐటీలు, ఐఐటీల్లో సీట్లు పెంపు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొంబయి ఫస్ట్..ఢిల్లీ, మద్రాస్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 15 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బొంబయి ఐఐటీకి ప్రతి ఏటా డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ ఐఐటీని జేఈఈ అడ్వాన్స్‌డు ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ఖరగ్‌పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఐఐటీ ఉంటోంది. గత ఏడాది ముంబై ఐఐటీలో ఓపె¯న్ కేటగిరీలో బాలురైతే 67, బాలికలైతే 291వ ర్యాంకు వరకు సీటు కేటాయింపు జరిగింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకు సీటు దక్కింది. ఇక విద్యార్థులు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో భిలాయ్ ఐఐటీ ఉంది. ఈ నేపథ్యంలో సీట్లు పెరిగితే మరింత మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది. ఎన్ఐటీల్లోనూ అవకాశాలు దేశవ్యాప్తంగా ఐఐటీ సీట్లు పెరిగితే ఎన్ఐటీల్లోనూ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల మెరుగైన ర్యాంకులు పొందినవారు ఐఐటీలో చేరుతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని, ఎక్కువమందికి సీట్లు లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో 1996 ర్యాంకు వరకు సీటు వస్తే, 2023లో బాలురకు 3115 ర్యాంకు వరకు సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుందంటున్నారు. తిరుచిరాపల్లి ఎన్ఐటీలో బాలురకు 2022లో 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోయాయి. గత ఏడాది మాత్రం బాలురకు 1509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్‌నే ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యతగా కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయో టెక్నాలజీలో 48 వేల వరకు సీటు వచ్చింది. -
ఇంజనీరింగ్ కాలేజీల ఎదురీత
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి. దశాబ్ద కాలంగా ఏటా కళాశాలలు మూతపడు తున్నాయి. 2015 నాటికి రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11కుగాను ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ఇలా ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఆఖరుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యామండలి అధికారులు అంటున్నారు. ఎందుకీ పరిస్థితి? సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో డిమాండ్ బాగా తగ్గింది. ఈ కోర్సుల్లో 40 శాతం కంటే తక్కువే అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో మెకానికల్, సివిల్ బ్రాంచీల జోలికే వెళ్లడం లేదు. 2023 ప్రవేశాల్లో దాదాపు 30 కాలేజీల్లో సివిల్ బ్రాంచ్‌లో సగానికి పైగానే సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 58 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే ప్రవేశాలుంటున్నాయి. సీఎస్ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యకు ఎక్కువ మంది హైదరా బాద్‌ను ఎంపిక చేసుకుంటుండగా, ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యనూ ఇక్కడే పూర్తి చేయాలని భావిస్తున్నారు. చదువుకునే సమయంలోనే పార్ట్ టైం ఉద్యోగం వెతుక్కునే అవకాశం నగరంలో ఉందని భావిస్తున్నారు. అరకొర విద్యార్థులతో జిల్లాల్లో కాలేజీలను నడిపే పరిస్థితి లేదని నిర్వాహకులు అంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులకు మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో విద్యార్థులు ఆ కాలేజీల వైపు వెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల అవి క్రమంగా మూతపడుతున్నాయి. ప్రైవేటు వర్సిటీలొస్తే మరీ ప్రమాదం ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యాశాఖ ఆహ్వానం పలుకుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీలోని ప్రధాన కాలేజీలు ఇక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులను ఆకట్టుకునేందుకు అవి ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతు న్నారు. ఈ పోటీని మన ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువనే వాదన విన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం కాలేజీల నాణ్యత పెంచాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రానికి సూచించింది. న్యాక్ అక్రిడిటేషన్ పరిధిలోకి వస్తేనే అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తరహా పోటీని తట్టుకునే ప్రైవేటు కాలేజీలు 20కి మించి లేవు. ఇంజనీరింగ్ విద్యలోనూ మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు. పోటీ పెరిగితే మనుగడ ప్రైవేటు యూనివర్సిటీలు పెరుగు తున్నాయి. కొత్త కోర్సుల దిశగా అవి దూసుకెళ్తున్నాయి. భవిష్యత్ లోనూ ఇదే ట్రెండ్ కన్పిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్య మిస్తున్నారు. జిల్లాల్లోని ప్రైవేటు కాలేజీలు ఈ పోటీని తట్టుకునేలా లేవు. ఇందుకు తగ్గట్టుగా ముందుకెళ్లే పరిస్థితి రావాలి. అప్పుడే వాటికి మనుగడ ఉంటుంది. – ప్రొఫెసర్ డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ -
కంప్యూటర్ కోర్సుల బోధనకు.. అధ్యాపకులంతా అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కంప్యూటర్ కోర్సులను ఏ బ్రాంచీ అధ్యాపకులైనా బోధించే వెసులుబాటు ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దేశంలోని అన్ని యూనివర్సిటీలనూ ఆదేశించింది. కొత్తగా వచ్చిన కోర్సుల బోధన కోసం ఇప్పటికే వాటిని పూర్తిచేసిన వారే ఉండాలన్న నిబంధన సరికాదని పేర్కొంది. దీనివల్ల ఎక్కడా ఫ్యాకల్టీ లభించని పరిస్థితి తలెత్తుతుందని, కంప్యూటర్ కోర్సుల బోధనకు సమస్య తలెత్తుతుందని స్పష్టం చేసింది. సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్ ఆధారిత బ్రాంచీలకు డిమాండ్ పెరుగుతోందని.. వాటిలో ఫ్యాకల్టీకి సంబంధించి కొన్నేళ్లు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌ను కూడా బోధనకు వినియోగించుకోవాలని సూచించింది. వర్సిటీలు వేధిస్తున్నాయన్న ఫిర్యాదులతో.. కొన్నేళ్లుగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ తగ్గుతూ.. కంప్యూటర్ ఆధారిత టెక్ కోర్సుల్లో చేరేవారు పెరుగుతున్నారు. మన రాష్ట్రంలో ఈసారి 58శాతం విద్యార్థులు కంప్యూటర్ కోర్సుల్లోనే చేరారు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు డిమాండ్ బాగా పెరిగింది. అయితే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఈ కోర్సుల బోధనపై పలు షరతులు పెట్టాయి. సదరు సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారినే ఫ్యాకల్టిగా నియమించాలని స్పష్టం చేశాయి. కానీ చాలా కాలేజీలు ఇతర ఇంజనీరింగ్ కోర్సులు (సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ) బోధిస్తున్న అధ్యాపకులను కొత్త కోర్సులకు ఫ్యాకల్టిగా నియమించాయి. ఈ అధ్యాపకులు కొత్త కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సులు చేసినవారేనని పేర్కొంటున్నాయి. కానీ దీనిని తాము అనుమతించబోమని, పీజీ చేసినవారిని నియమించాల్సిందేనని యూనివర్సిటీలు పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు కాలేజీలపై వర్సిటీ అధికారుల వేధింపులు పెరిగాయంటూ కొందరు ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏఐసీటీఈ.. ఇతర కోర్ గ్రూపులు బోధించే వారినీ కొత్త కంప్యూటర్ కోర్సుల బోధనకు అనుమతించాలంటూ వర్సిటీలకు స్పష్టత ఇచ్చింది. ఆ కోర్సులు తప్పనిసరి ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచీలో బోధిస్తున్న అధ్యాపకుడైనా కొన్ని కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధించాలనుకుంటే మైనర్ డిగ్రీ కోర్సుగా దానిని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులను మూక్స్, స్వయం వంటి సంస్థలు ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాయి. ఇతర ఇంజనీరింగ్ బ్రాంచీల అధ్యాపకులకు సాంకేతికతలు, బోధనపై అవగాహన ఉంటుందని.. అదనంగా సర్టిఫికెట్ కోర్సులు చేయడాన్ని అర్హతగా పరిగణించాలని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ సర్టిఫికెట్ కోర్సులకు 18 నుంచి 20 క్రెడిట్స్ ఉంటాయని, అవి బోధనకు సరిపోతాయని స్పష్టం చేసింది. 20% అనుమతిస్తున్నాం ఇతర బ్రాంచీల వారిని ఇప్పటికే 20శాతం వరకూ కొత్త కోర్సుల ఫ్యాకల్టిగా అనుమతిస్తున్నాం. వంద శాతం అనుమతిస్తే బోధనలో నాణ్యత ఉండదని భావిస్తున్నాం. అయితే సంబంధిత సర్టిఫికెట్ కోర్సులు చేసిన వారిని అనుమతించాలని ఏఐసీటీఈ తెలిపింది. ఇందులో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ అందరినీ అనుమతించాలి కొత్త కంప్యూటర్ కోర్సులు బోధించే నైపుణ్యం అలవరచుకున్న అందరినీ బోధనకు అనుమతించాలి. దీనికి వర్సిటీలు అభ్యంతరం చెప్పడం సరికాదు. వర్సిటీల తీరుతో ఫ్యాకల్టీ లభించక బోధన కుంటుపడుతుంది. సర్టిఫికెట్ కోర్సులు చేసిన కోర్ గ్రూప్ వారికీ కంప్యూటర్ అనుబంధ కోర్సులపై పట్టు ఉంటుంది. – వి.బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘ప్రొఫెషనల్’గా బోధన!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చాలా కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుల బోధన పక్కాగా సాగేలా చూడటంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టి పెట్టింది. కొత్త కోర్సులకు అనుగుణమైన నైపుణ్యాలు ఉన్న, సమర్థవంతంగా బోధించగల ఫ్యాకల్టీని కాలేజీలు నియమించుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. నాణ్యత ప్రమాణాల్లేని ఫ్యాకల్టీ ఉన్నట్టు గుర్తిస్తే.. సంబంధిత కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని భావిస్తోంది. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన నిబంధనలతో కూడిన సమగ్ర నివేదికను రూపొందించింది. కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు దాన్ని పరిశీలించి, సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపారు. ఆ నివేదిక ప్రకారం.. కొత్తగా అందుబాటులోకి వస్తున్న కీలక కంప్యూటర్ కోర్సులను బోధిస్తున్న వారి అర్హతలను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలే కాకుండా ఏఐసీటీఈ కూడా ప్రత్యేకంగా పరిశీలించనుంది. ఇందుకోసం కొన్ని బృందాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సంస్కరణలను ఈ ఏడాది నుంచే అమల్లోకి తేవాలని భావించినా.. కొన్ని అనుమతుల దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి. కీలక కోర్సుల బోధనలో.. దేశవ్యాప్తంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య తగ్గుతోంది. తెలంగాణలో 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే.. ఇందులో 58శాతం కంప్యూటర్ కోర్సులవే. సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు 50 శాతం దాటడం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సరికొత్త కోర్సులకు విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కొత్త కోర్సులు మొదలై రెండేళ్లు గడుస్తున్నా చాలా కాలేజీల్లో బోధన సాధారణ కంప్యూటర్ సైన్స్ కోర్సుల మాదిరిగానే ఉంటోందని ఏఐసీటీఈ గుర్తించింది. ఇప్పటికే కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థుల్లో కేవలం 8 శాతం మందిలో మాత్రమే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అర్హత గల నైపుణ్యం ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో బోధన విధానంలో గణనీయమైన మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ప్రొఫెషనల్స్తోనే పాఠాలు ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రత్యేక నైపుణ్యంతో బోధించాల్సి ఉంటుందని ఏఐసీటీఈ స్పష్టం చేస్తోంది. చాలా కాలేజీల్లో గత రెండేళ్లు జరిపిన అధ్యయనంలో ఆ తరహా బోధన కనిపించలేదని పేర్కొంటోంది. కాలేజీలు ఎంటెక్ పూర్తి చేసిన సాధారణ ఫ్యాకల్టీతో కోర్సుల బోధన కొనసాగిస్తున్నాయి. వారు కృత్రిమ మేధ (ఏఐ), ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ఆన్లైన్లో సెర్చ్చేసో, అప్పటికప్పుడు నేర్చుకునో బోధిస్తున్నారు. వారికి ప్రాక్టికల్ అనుభవం ఉండటం లేదు. అలాంటి వారు సమర్థవంతంగా బోధించలేరని ఏఐసీటీఈ అభిప్రాయానికి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులంతా వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా నైపుణ్యం సంపాదించిన వాళ్లే. ఈ క్రమంలోనే వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులను బోధనకు అనుమతిస్తూ ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రతీ కాలేజీలోనూ అలాంటి వారు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన తెచ్చే ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల చేత పాఠాలు చెప్పించాలని భావిస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందే కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ కోర్సులు బోధించే అధ్యాపకుల వివరాలు తెప్పించుకుని.. వారికి అర్హత ఉంటేనే గుర్తింపు ఇవ్వాలనే నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రొఫెషనల్స్ సేవలు ఎంతో అవసరం వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు సంబంధిత కోర్సు చేయకున్నా.. కావాల్సిన అనుభవం ఉంది. కాలేజీల్లో పనిచేసే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అధ్యాపకులకు ఎంటెక్ సర్టిఫికెట్లు ఉన్నా ఈ కోర్సులను బోధించే అనుభవం తక్కువ. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొత్త కంప్యూటర్ కోర్సులను బోధించేందుకు పూర్వ విద్యార్థుల సాయం తీసుకుంటున్నాం. అమెరికాలో ఓ ఏఐ ప్రొఫెషనల్ వారానికి కొన్ని గంటలు ఆన్లైన్ ద్వారా బోధిస్తున్నారు. స్థానికంగా ఉద్యోగాలు చేసేవారు నేరుగా క్లాసులు చెబుతారు. దీనివల్ల నాణ్యత పెరుగుతుంది. ఎంటెక్ చేసిన ఫ్యాకల్టీకి కూడా ప్రొఫెషనల్స్ ద్వారా క్లాసులు చెప్పించాలి. అప్పుడే భవిష్యత్‌లో కొత్త కోర్సులకు అధ్యాపకులు అందుబాటులో ఉంటారు.– ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ సరైన ఫ్యాకల్టీ లేకుండా అనుమతులు వద్దు కొన్నేళ్లుగా ఇష్టానుసారం కంప్యూటర్ కోర్సులకు అనుమతి ఇస్తు న్నారు. మరి ఆ కోర్సులను బోధించే వా రు ఉన్నారా? లేదా? అనేది యూనివర్సి టీలు పరిశీలించాలి. లేకపోతే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. నైపుణ్యం లేకుండా విద్యార్థులకు డిగ్రీలిస్తే, మార్కెట్లో వారు నిలబడటం కష్టం. ఈ విషయాన్ని అనేక సర్వేలు రుజువు చేస్తున్నాయి.– అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
కంప్యూటర్ కోర్సులు ‘కేక’
సాక్షి, హైదరాబాద్: తొలి విడత ఇంజనీరింగ్ సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం 82,666 సీట్లు అందుబాటులో ఉంటే, 70,665 భర్తీ చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ వెల్లడించారు. 12,001 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,56,879 మంది అర్హత సాధించారు. 76,821 మంది ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 75,708 మంది వివిధ కాలేజీలు, వివిధ బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చారు. మొత్తం 50,44,634 ఆప్షన్లు అందాయి. 5,043 మంది ఎలాంటి ఆప్షన్లు ఇవ్వలేదు. 5,576 మందికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో సీట్లు వచ్చాయి. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 173 పాల్గొన్నాయి. 28 కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు మూడు యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు జరిగినట్టు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలని ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. సగానికిపైగా కంప్యూటర్ కోర్సులే మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఎక్కువగా కంప్యూటర్ కోర్సులనే విద్యార్థులు కోరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రాంచీల్లో కలిపి 82,666 సీట్లుంటే, కంప్యూటర్ కోర్సుల్లోనే 55,876 సీట్లున్నాయి. వీటిల్లో భర్తీ అయిన సీట్లు 52,637. అన్ని బ్రాంచీలకు కలిపి ఉన్న సీట్లలో 67.5 శాతం కంప్యూటర్ కోర్సులవైతే, 32.5 శాతం ఇతర బ్రాంచీలకు చెందినవి ఉన్నాయి. కంప్యూటర్ కోర్సుల్లో సీఎస్సీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటాసైన్స్, ఐటీతో కలుపుకుని మొత్తం 18 రకాల కోర్సులున్నాయి. ఎక్కువ మంది ఈ కోర్సులకే ఆప్షన్లు ఇవ్వడంతో 94.20 శాతం సీట్లు భర్తీ చేశారు. మిగిలిపోయిన సీట్లు 3,239 ఉన్నాయి. ఇవి కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినవే. ఈ కోర్సుల్లో వందశాతం భర్తీ ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్ కోర్సులో 137సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయ్యాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 91, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టంలో 318, సీఎస్సీ (సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ)లో 133, సీఎస్సీ (నెట్వర్క్)లో 91, సీఎస్సీ (ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్)లో 870 సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయినట్టు అధికారులు వెల్లడించారు. భారీగా సీట్లు మిగిలిన సివిల్, మెకానికల్, ఈఈఈ కౌన్సెలింగ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత ఏడాది కూడా ఇదే విధంగా ఉండటంతో చాలా కాలేజీలు ఈ బ్రాంచీల్లో సీట్లు రద్దు చేసుకోవడంతో 7 వేల సీట్లు తగ్గాయి. అయినప్పటికీ ఈ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాటి అనుబంధ బ్రాంచీల్లో 17,274 సీట్లు అందుబాటులో ఉంటే, 13,595 సీట్లు మాత్రమే కేటాయించారు. 3,679 సీట్లు మిగిలిపోయాయి. మెకానికల్, సివిల్ సహా వాటి అనుబంధ బ్రాంచీల్లోనూ 3,642 సీట్లు మిగిలిపోయాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 44.76 శాతం, మెకానికల్ 38.50 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ఈఈఈలోనూ 58.38 శాతం సీట్లు భర్తీ చేశారు. -
దరఖాస్తులు 3.20 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు ఈసారి భారీగా దరఖాస్తులొచ్చాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌లో నూ ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. ఇప్పటివరకూ రెండు విభాగాలకు కలిపి 3,20,310 అప్లికేషన్లు అందాయి. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీవి 72,164 ఉన్నాయి. గత సంవత్సరం (2022) మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూ హ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరగడంతో ఆ మేరకు పరీ క్ష కేంద్రాల పెంపుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దేశవ్యాప్తంగా 2019 చివరలో కోవిడ్ విజృంభించడం, రెండేళ్ళ పాటు విద్యా సంస్థలు సరిగా నడవకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021లో టెన్త్ వార్షిక పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పాస్ చేశారు. ఎప్పటిలాగే పరీక్షలు జరిగితే 20 శాతం వడపోత అక్కడే జరిగేది. కానీ పరీ క్షలు లేకపోవడంతో విద్యార్థులు చాలావరకు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు తీసుకున్నా రు. వీళ్ళే ఇంటర్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఎంసెట్ రాస్తున్నారు. అంటే ఎంసెట్ దరఖాస్తులు పెరగడానికి ‘అంతా పాస్’దోహదపడిందన్న మాట. ‘కంప్యూటర్’ క్రేజ్ కూడా కారణమే.. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఈఈ రాయాల్సి ఉంటుంది. ఇందులో ర్యాంకు రావాలంటే బాగానే కష్టపడాలి. ముమ్మర కోచింగ్ తీసుకోవాలి. ఇంతా చేసి సాధారణ ర్యాంకు వస్తే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు లభించడం కష్టం. ఈ కారణంగానే ఇంటర్ ఉత్తీర్ణుల్లో సగానికిపైగా జేఈఈ వైపు వెళ్ళడం లేదు. ఎలాగైనా కంప్యూటర్ సంబంధిత ఇంజనీరింగ్ కోర్సు చేయాలనుకుంటున్న వారు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎంసెట్‌కు 3 లక్షల మంది దరఖాస్తు చేస్తే, జేఈఈకి 1.40 లక్షల మందే దరఖాస్తు చేయడం గమనార్హం. మరోవైపు విద్యార్థుల అభిమతానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ట్రెండ్ మార్చాయి. సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుంటున్నాయి. వీటి స్థానంలో సీఎస్సీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకుంటున్నాయి. దీంతో ఎంసెట్‌లో అర్హత సాధిస్తే ఏదో ఒక కాలేజీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అనువైన కంప్యూటర్ కోర్సు సీటు వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు.ఎంసెట్‌కు దరఖాస్తులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాజధాని చుట్టే ఎంసెట్ ఎంసెట్ కోసం మొత్తం 21 జోన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 16 జోన్లు తెలంగాణలో, 5 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న జోన్లలో ఐదు హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,48,146 ఎంసెట్ దరఖాస్తులొస్తే, హైదరాబాద్ కేంద్రంగానే 1,71,300 అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లోనే జూనియర్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీల దృష్టీ ఇక్కడే ఉంటోంది. టెన్త్ పూర్తవ్వగానే ఇంటర్ విద్యాభ్యాసానికి, ఎంసెట్ శిక్షణకు హైదరాబాదే సరైన కేంద్రమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ కారణంగానే పిల్లల్ని హాస్టళ్ళలో ఉంచి మరీ చదివిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ కేంద్రంగానే ఎంసెట్ రాసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. రెండు రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాల పెంపు! ఎంసెట్ దరఖాస్తులు అనూహ్యంగా పెరగడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల్లోనూ పరీక్ష కేంద్రాలు పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష నిర్వహించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. తెలంగాణలో ఇంటర్ వెయిటేజ్ ఎత్తివేయడంతో ఈసారి ఏపీ నుంచి దరఖాస్తులు పెరిగాయి. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ, జేఎన్టీయూహెచ్) -
డిగ్రీకి డేంజర్ బెల్స్!
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసులతో పాటు గ్రూప్–1 వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం విద్యార్థులు ఒకప్పుడు బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి కోర్సుల్లోనే ఎక్కువగా చేరేవారు. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, ఫిజిక్స్, జువాలజీ, కామర్స్ వంటి సబ్జెక్టులను ఆప్షన్లుగా ఎంచుకుని అభ్యర్థులు ఉద్యోగాల వేటలో విజయం సాధించేవారు. ఇలాంటి సంప్రదాయ డిగ్రీ కోర్సులకు రానురాను ఆదరణ కరువవుతోంది. కంప్యూటర్ కోర్సులపై ఏర్పడిన క్రేజ్‌తో భవిష్యత్తులో వాటి మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంటోంది. వృత్తి విద్యా కోర్సులతో, ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులతోనే తక్షణ ఉపాధి సాధ్యమన్న విద్యార్థుల భావనే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు సాధారణ బీఏ, బీకాం,బీఎస్సీ కోర్సులు కన్పించకుండా పోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. గత కొన్నేళ్ళుగా డిగ్రీ కోర్సుల్లో తగ్గుతున్న ప్రవేశాలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 1,080 డిగ్రీ కాలేజీలుంటే, వాటిల్లో వివిధ కోర్సులకు సంబంధించిన 4.68 లక్షల సీట్లున్నాయి. అయితే గత ఐదేళ్ళుగా 2 లక్షలకు పైగా సీట్లు భర్తీ కావడం లేదు. కాగా ఇంజనీరింగ్ కాలేజీల్లో సైతం సంప్రదాయ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు గణనీయంగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికి 1.75 లక్షల సీట్లే భర్తీ.. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన దోస్త్ కౌన్సెలింగ్ ద్వారా 1.75 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో రెండురోజుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి కూడా 2 లక్షల సీట్ల కంటే ఎక్కువ భర్తీ కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 53 కాలేజీల్లో కనీసం ఒక్క విద్యార్థి కూడా చేరలేదంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతోంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఏటా ఇంటర్ పాసయ్యే విద్యార్థులు 3.20 లక్షల మంది వరకు ఉంటున్నారు. 75 వేల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. కొందరు ఇతర కోర్సుల వైపు వెళ్తున్నారు. ఏతావాతా 2 లక్షల మంది డిగ్రీలో చేరే వాళ్ళుంటే, సీట్లు మాత్రం అంతకు రెట్టింపు ఉన్నాయి. అంటే సగం సీట్లు ఖాళీగానే ఉండిపోతున్నాయన్న మాట. ఇక భర్తీ అవుతున్న సీట్లలో అత్యధిక శాతం కంప్యూటర్ సంబంధిత కోర్సులవే కావడం గమనార్హం. ఈ పరిస్థితికి కారణమేంటి? దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల ట్రెండ్ మారింది. ఏ కోర్సులోనైనా కంప్యూటర్ అనుసంధాన సబ్జెక్టులు ఉంటేనే డిగ్రీకి విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ డిగ్రీ స్వరూపమే మారిపోతోంది. విద్యామండళ్లు విభిన్న రకాల కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. బీఏలో గతంలో ఐదారు రకాల కోర్సులు మాత్రమే ఉండగా ప్రస్తుతం 68 రకాల కోర్సులొచ్చాయి. అలాగే బీఎస్సీలో 73 రకాలు, బీకాంలో 13 రకాల కాంబినేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా బీబీఎం, బీబీఏ, బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, బ్యాచులర్ ఆఫ్ ఒకేషన్ (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ టూరిజం పరిపాలన) వంటి కోర్సులు విస్తరించాయి. బీకాంలో మారిన ట్రెండ్‌కు అనుగుణంగా అప్లికేషన్ కోర్సులు తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ చాలావరకు హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమయ్యాయి. ఇంజనీరింగ్‌తో సమానంగా ఉండే డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులు కూడా కేవలం నగరంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దాదాపు 70 కాలేజీల్లో బీఏ కోర్సుల్లో కనీసం 15 శాతం విద్యార్థులు కూడా చేరకపోవడాన్ని గమనిస్తే గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల పరిస్థితి అర్ధమవుతోంది. హేతుబద్ధీకరణ తప్పదు డిగ్రీ ట్రెండ్ మారుతోంది. ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు ఉపాధి కోసం వృత్తి విద్య కోర్సుల వైపు వెళ్తున్నారు. కోవిడ్ వల్ల ఇంటర్లో అందరినీ పాస్ చేయడం వల్ల గతేడాది 2.50 లక్షల ప్రవేశాలు దాటాయి. కానీ ఈ ఏడాది ఇంటర్ ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఈ ప్రభావం డిగ్రీ ప్రవేశాలపై కన్పిస్తోంది. 15% ప్రవేశాలు లేని కాలేజీల జాబితా తయారు చేస్తున్నాం. ఇప్పటికే జీరో అడ్మిషన్లున్న 53 కాలేజీలను మూత వేయాలని ఆదేశించాం. ఏదేమైనా డిగ్రీలో హేతుబద్ధీకరణ తప్పదు. డిమాండ్ లేని కోర్సులను తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సులనే నడపాలని చెబుతున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్) సాంకేతిక కోర్సులకే డిమాండ్ డిగ్రీలో సాంకేతికత ఉన్న కంప్యూటర్ కోర్సులనే విద్యార్థులు అడుగుతున్నారు. ఈ కారణంగానే ఆ తరహా కాంబినేషన్ కోర్సుల్లో సీట్లు పెంచాల్సి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా డిగ్రీ కోర్సుల స్వరూపం మారుతోంది. ఈ మార్పును అందిపుచ్చుకోవడం ప్రస్తుతం కాలేజీలకు ఒక సవాలే. – ఎకల్దేవి పరమేశ్వర్ (పైవేటు డిగ్రీ కాలేజీల సంఘం) -
కంప్యూటర్ కోర్సుల వైపే చూపు!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ఆప్షన్ల ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటోంది. బుధవారం రాత్రివరకు 58,807 మందికిపైగా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3 లక్షలకుపైగా ఆప్షన్లను ఎంపిక చేసుకున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్య విభాగం పేర్కొంది. ఒక విద్యార్థి గరిష్టంగా 1,013 ఆప్షన్లు ఇచ్చినట్టు తెలిపింది. సెప్టెంబర్ 2తో కౌన్సెలింగ్ గడువు ముగుస్తుంది. తొలిదశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 6న ఉంటుంది. మరోవైపు 8 వేల మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. చాలా మంది కుల, ఆదాయ ధ్రువపత్రాలు తెచ్చుకునే పనిలో ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తొలి ప్రాధాన్యత కంప్యూటర్ సైన్స్‌కే.. మొదటి విడత కౌన్సెలింగ్ మొదలయ్యే సమయానికి యూనివర్సిటీల నుంచి కాలేజీల అనుబంధ గుర్తింపు జాబితా అందలేదు. దీంతో గతే డాది కౌన్సెలింగ్‌లో పెట్టిన 175 కాలేజీలనే ఈసారి అప్లోడ్ చేశారు. వాటిలో 65,633 సీట్లు ఉన్నట్టు చూపారు. ఈ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులుండే వీలుందని అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టి ఫిషియల్ ఇంటెలి జెన్స్, సైబర్ సెక్యూ రిటీ, డేటా సైన్స్ వంటి కంప్యూటర్ కోర్సులకే ఎక్కువగా ఆప్షన్లు ఇస్తున్నట్టు అధికారులు తెలిపా రు. 90% మంది తొలి ప్రాధాన్యతగా సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులనే ఎంచుకున్నారని.. తర్వాత ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ కోర్సులు ఉన్నాయని వివ రించారు. ఈసారి సీట్లు కూడా కంప్యూట ర్ కోర్సుల్లో పెరిగి, సివిల్, మెకానికల్ విభాగంలో తగ్గే అవకాశం ఉందని సమాచారం. -
బూమ్.. బూమ్ సాఫ్ట్వేర్.. కంప్యూటర్ కోర్సులదే హవా..
మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ఒకప్పుడు ఎవర్‌గ్రీన్‌గా వెలుగొందిన మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణ నేడు ప్రశ్నార్థకమవుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాఫ్ట్వేర్ బూమ్‌తో ఇంజినీరింగ్ విద్యలో కంప్యూటర్ కోర్సుల హవా కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి కంప్యూటర్ కోర్సునకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఇదే క్రమంలో కోర్ బ్రాంచ్‌లుగా పేరున్న మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లకు ఆదరణ తగ్గుతోంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కాలేజీల యాజమాన్యాలు సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తు చేస్తున్నాయి. చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే! ఇదే సాక్ష్యం.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 30 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 2021–22 విద్యా సంవత్సరంలో అన్ని కాలేజీల్లో కలిపి 13,283 సీట్లు భర్తీకి సాంకేతిక విద్యాశాఖ నుంచి అనుమతులు ఉన్నాయి. మూడు విడతలుగా జరిగిన కౌన్సెలింగ్, అదే విధంగా మేనేజ్మెంట్ కోటాతో కలుపుకొని 9,396 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో కంప్యూటర్స్, దీనికి అనుబంధ కోర్సులకు 95 నుంచి 100 శాతం డిమాండ్ ఉంటే.. మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో 30 శాతం మాత్రమే నిండాయి. ఈ రెండు బ్రాంచ్‌ల్లో ఏడు కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాకపోగా, మరో 13 కాలేజీల్లో పది లోపే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఎందుకిలా.. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం రాజ్యమేలుతోంది. కంప్యూటర్ కోర్సులు చేసిన వారికే వీటిలో అవకాశాలు దక్కుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలో కంప్యూటర్ ఇంజినీర్లదే పైచేయిగా నిలుస్తోంది. కోర్ బ్రాంచ్‌లు చదువుకుని అటువైపు వెళ్లిన విద్యార్థులకు మళ్లీ కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యంపై పరీక్ష పెడుతున్నారు. దీంతో మెకానికల్, సివిల్ ఇంజినీర్లు చాలా మంది ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సి వస్తోంది. కొత్త కంప్యూటర్ కోర్సుల కోసం.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్ఈ) కోర్సుకు ఉన్న డిమాండ్‌తో దీనికి అనుబంధంగా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిజినెస్ సిస్టమ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, ఐవోటీ, ఆటోమేషన్ ఇలా వివిధ రకాల కోర్సుల కోసమని కాలేజీల నుంచి సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. పూర్వవైభవం తీసుకొచ్చేలా.. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాంకేతిక కోర్సుల నిర్వహణపై కూడా దృష్టి సారించింది. కోర్సు ఏదైనా నైపుణ్యానికి పెద్ద పీట వేసేలా మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపడుతున్న కార్యక్రమాలతో నిర్మాణ, పారిశ్రామిక రంగాలు మళ్లీ పుంజుకుంటుండటంతో మెకానికల్, సివిల్ ఇంజినీర్లకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇదే ఊపును కొనసాగించేలా కోర్ బ్రాంచ్‌లకు కొత్తరూపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. నైపుణ్యం అవసరం.. ఉన్నత విద్యలో ఏ కోర్సు ఎంచుకున్నా, దానిలో నైపుణ్యం ఉన్న వారికే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకనే ఉన్నత విద్యలో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్స్, సివిల్, మెకానికల్‌లో దేని ప్రాముఖ్యత దానిదే. – డాక్టర్ ఎం. రామిరెడ్డి, రిజిస్ట్రార్, కృష్ణావర్సిటీ అవి ఎప్పటికీ ఎవర్గ్రీన్ కోర్ బ్రాంచ్‌లైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. ఏ రంగమైనా యంత్రాలు లేకుండా ముందుకెలా నడుస్తుంది. ఈ కోర్ సబ్జెక్టుల ప్రాధాన్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అయితే విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌పైనే మక్కవ పెంచుకుంటున్నారు. -డాక్టర్ జ్యోతిలాల్, ఇంజినీరింగ్ అధ్యాపకుడు, నూజివీడు మెకానికల్ మంచిదే.. ఆటోమేషన్ వల్ల ఇంజినీర్లకు పనితగ్గింది. అయినప్పటికీ గుండు సూది నుంచి రైలు ఇంజిన్ వరకు తయారీలో మెకానికల్ ఇంజినీర్ ఉండాల్సిందే. కంప్యూటర్ సైన్స్‌కు ఎంత డిమాండ్ ఉన్నా అన్ని వ్యవస్థలకు ఆధారం మెకానికల్. -వి. ఎలీషా దేవసహాయం, సీనియర్ మెకానికల్ ఇంజినీర్, సాంకేతిక విద్యాశాఖ -
నో సి‘విల్’ .. మెకాని‘కిల్’!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లనుందా? డిమాండ్ లేని కోర్సులను ఎత్తేసి, విద్యార్థులు కోరుకునే కోర్సులు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించడం ఈ అనుమానాలకు తావిస్తోంది. గత మూడేళ్లుగా కంప్యూటర్ కోర్సుల్లో వచ్చిన ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీతో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీంతో 95 శాతం సీట్లు ఈ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. మరోవైపు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు వందకుపైగా కాలేజీలు తమ సంస్థల్లో సివిల్, మెకానికల్ కోర్సులను ఎత్తివేసేందుకు హైదరాబాద్ జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు సోమవారం నుంచి విచారణ జరపనున్నారు. మూడేళ్లుగా 30 శాతం సీట్లు భర్తీ కాలేదని కాలేజీలు సరైన ఆధారాలు చూపిస్తే జేఎన్టీయూహెచ్ ఆ కోర్సులు ఎత్తివేసేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇస్తుంది. దీని ఆధారంగా కాలేజీలు సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్, కంప్యూటర్ సంబంధిత సీట్లు తెచ్చుకునే వీలుంది. 10 వేలకు పైగా సీట్లకు ఎసరు రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 79 వేల సీట్లు ఉంటాయి. వీటిల్లో కూడా 38,796 సీట్లు కంప్యూటర్, దాని అనుబంధ కోర్సులే ఉన్నాయి. ఈసీఈ 13,935, ఈఈఈ 7,019 ఉంటే, సివిల్ 6,221, మెకానికల్ 5,881 సీట్లున్నాయి. ఇతర కోర్సుల సీట్లు మరికొన్ని ఉన్నాయి. అయితే ఇంజనీరింగ్ డిగ్రీ ముగిసిన వెంటనే తక్షణ ఉపాధి పొందవచ్చనే ఉద్దేశంతో విద్యార్థులు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఫీల్డ్‌ను ఎంచుకుంటున్నారు. కొంతమంది అమెరికా వంటి విదేశాలకు వెళ్లేందుకు కూడా కంప్యూటర్ కోర్సుల బాట పడుతున్నారు. కంప్యూటర్ కోర్సులకు సంబంధించి కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేకున్నా విద్యార్థులు ఇదే దారిలో పయనిస్తున్నారు. వాస్తవానికి ఈ కోర్సులు చేసినప్పటికీ కేవలం 8 శాతం మాత్రమే స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్నట్టు ఇటీవల సర్వేలో వెల్లడైంది. కానీ విద్యార్థుల డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు కాలేజీలు కంప్యూటర్ కోర్సుల సీట్లు వీలైనంత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో డిమాండ్ లేని మెకానికల్, సివిల్ కోర్సుల ఎత్తివేతకు రంగం సిద్ధం చేశాయి. వర్సిటీ ఎన్వోసీ ఇస్తే వందకుపైగా కాలేజీల్లో 10 వేలకు పైగా మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ సీట్లు లేకుండా పోయే అవకాశం ఉంది. 2021లో ఈ రెండు కోర్సుల్లోనూ సగటున 30 శాతానికి పైగానే సీట్లు భర్తీ కావడం గమనార్హం. పాలిటెక్నిక్ విద్యార్థుల మాటేమిటి? సంప్రదాయ కోర్సులు కనుమరుగు కావడం భవిష్యత్‌లో దుష్పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందే వీలుంది. సంప్రదాయ కోర్సుల్లో సీట్లన్నీ ఎత్తేస్తే వాళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తోంది. పాలిటెక్నిక్‌లో కేవలం సివిల్, మెకానికల్ వంటి కోర్సులు మినహా కంప్యూటర్ కోర్సులు లేకపోవడం గమనార్హం. అలాగే రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో సివిల్, మెకానికల్ కోర్సుల ఎత్తివేత వల్ల భవిష్యత్తులో సంబంధిత నిపుణుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం. ముఖ్యంగా పాలి టెక్నిక్ విద్యార్థులకు భవిష్యత్ ఉండదు. అందువల్ల సంప్రదాయ కోర్సు లు వందకు వంద శాతం రద్దుకు అనుమతించే ప్రసక్తే లేదు. కాలేజీలతో సంప్రదింపులు జరిపి సా ధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు రద్దవ్వకుండా చూస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ఆ కోర్సుల రద్దుకు అనుమతించకూడదు సంప్రదాయ కోర్సుల రద్దుకు యూనివర్సిటీ అనుమతించకూడదు. కంప్యూటర్ కోర్సులు చేసిన వారందరికీ ఉపాధి లభిస్తోందనేది అవాస్తవం. కంప్యూటర్ సీట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాలేజీలు అనేకం ఆయా కోర్సులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కంప్యూటర్ కోర్సుల కోసం ఎగబాకే ప్రైవేటు కాలేజీలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఎంటెక్ చేసిన వాళ్లకు నెలకు కేవలం రూ.35 వేల వేతనం ఇస్తూ నాణ్యతలేని విద్యను అందిస్తున్నాయి. ఇవన్నీ విద్యార్థులు గ్రహించాలి. – డాక్టర్ బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
తెలుపనా తెలుగు మాట..
ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి సంపాదన.. అంతకు మించి అందమైన ఫ్యామిలీ. ఇన్ని వసతులు ఉన్న వ్యక్తి డాలర్లను రూపాయలుగా మార్చే పనిలో బిజీగా ఉంటారు. కానీ.. ఆయన మాత్రం ఖండాతరాన తెలుపనా తెలుగు మాట అని తన వాణి వినిపిస్తున్నారు. తెలుగు భాషాసంస్కృతుల వ్యాప్తి కోసం కృషి చేస్తున్న ప్రవాసాంధ్రుడు కొంచాడ మల్లికేశ్వరరావు. తన ప్రయత్నాల్లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ , తెలుగు వర్సిటీ అధికారులతో సమావేశం అయ్యేందుకు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆయనను సిటీప్లస్ పలకరించింది. ఆస్ట్రేలియాలో ఆయన చేస్తున్న తెలుగు సేద్యం గురించి వివరించారు. 1982లో హైదరాబాద్‌కు వచ్చాను. మా సొంతూరు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. హౌసింగ్ బోర్డులో జూనియర్ ఇంజినీర్‌గా 13 ఏళ్లు పని చేశాను. తర్వాత హడ్కోలో ఉద్యోగం చేశాను. ఆపై కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని న్యూజిలాండ్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరాను. తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డాను. తెలుగుమల్లి ఆస్ట్రేలియాలో వేలాది మంది తెలుగువారున్నారు. వీరి కోసం స్రవంతి అనే న్యూస్ లెటర్ నడిపాను. మూడు వారాలకోసారి వచ్చేది. ఇలా ఐదేళ్లు నడిపాను. తర్వాత నా భార్య, కొడుకు సహకారంతో ప్రవాస భారతి మ్యాగజైన్ తీసుకువచ్చాను. కాస్ట్ పెరిగిపోవడంతో.. తెలుగుమల్లి వెబ్సైట్ పారరంభించాను. వార్తలు, ఈవెంట్స్, వంటలు, సినిమా విశేషాలు అందులో పొందుపరుస్తున్నాం. సాహిత్య సమాచారం, కవితలు, కథలు, చారిత్రక విషయాలు వెబ్సైట్లో ఉంచుతున్నాం. నోటీస్ బోర్డ్ పేరుతో పెళ్లి సంబంధాల సమాచారం కూడా ఉంటుంది. తెలుగుమల్లి పేరుతో ఫేస్బుక్ పేజీ కూడా ఉంది. కమ్యూనిటీ భాషగా.. ఆస్ట్రేలియాలో ఏ దేశస్తులైనా వారి భాష కోసం పని చేసేందుకు ముందుకు వస్తే.. అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలోని మల్లీకల్చరల్ మినిస్ట్రీ ప్రోత్సాహం అందిస్తుంది. మూడు వేల నుంచి నాలుగు వేల డాలర్లు గ్రాంట్ కూడా ఇస్తుంది. తెలుగు భాష గురించి తాను చేస్తున్న కృషికి విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం ‘విక్టోరియన్ మల్టీ కల్చరల్ ఫంక్షన్’ సర్వీస్ ఎక్స్‌లెన్సీ అవార్డు అందజేసింది. తెలుగును కమ్యూనిటీ లాంగ్వేజ్‌గా గుర్తించాలని ప్రభుత్వానికి విన్నవించాం. దీనికి సూచనప్రాయంగా అంగీకరించింది కూడా. ఉగాది నాటికి నిర్ణయం వెలువడవచ్చు. ఉగాది కోసం.. అస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో ఉగాదికి పెద్దగా సంబరాలు నిర్వహిస్తారు. జానపద కళాకారులను ఇక్కడి నుంచి తీసుకెళ్లి యక్షగానాలు, బుర్రకథ వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. కళాకారులను పంపేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. అలాగే ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు వర్సిటీ అధికారులను కలుస్తున్నాం. ఆస్ట్రేలియాలో తెలుగు వ్యాప్తికి ఓ 15 మంది కోర్ కమిటీగా ఏర్పడి సొంత ఖర్చులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తెలుగు భాషాను ఈ తరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో మెల్బోర్న్లో ప్రతి శనివారం తెలుగు యువత కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. భాషావికాసానికి దీర్ఘకాలిక ప్రణాళిక అమలుకు కసరత్తు చేస్తున్నాం. దీనికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నాను. తెలుగు సులువుగా నేర్చుకునే పుస్తకాలను తెలుగు వర్సిటీ అందజేస్తే బాగుంటుంది. - కోన సుధాకర్‌రెడ్డి -
ఆన్లైన్.. భానుడు
అతడు కంప్యూటర్ కోర్సులు చేయలేదు..ఇంజనీరింగ్ చదవలేదు.. కానీ కంప్యూటర్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. ఒక గంట దృష్టి సారించి కంప్యూటర్‌పై కూర్చుంటే ఓ నూతన వెబ్ సైట్ తయారైనట్లే.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న బనిగండ్లపాటి భానుమూర్తి.. ఆయన గురించి ‘సాక్షి’ పాఠకుల కోసం.. వైరా పట్టణానికి చెందిన బనిగండ్లపాటి భానుమూర్తి చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చింతకాని మండల పరిధిలోని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే విధంగా ఒక వెబ్సైట్ రూపొందించాడు. ఈ సమాచారం తెలుసుకోవాలనుకునే వారు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.చింతకాని.కామ్’ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్లో మండలానికి సంబంధించిన ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు, మరుగుదొడ్లు, జనరల్‌బాడీ మీటింగ్‌ల సమాచారం, ఎంపీటీసీ, వార్డు సభ్యుల వివరాలు పొందుపరిచాడు. బీఆర్జీఎఫ్ వెబ్సైట్.. మండల స్థాయిలో బీఆర్జీఎఫ్ నిధుల వ్యయానికి సంబంధించి, మండలపరిషత్ ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు ‘డబ్ల్యూడబ్ల్యూ.కెఎంఎం.కో.ఇన్’ అనే వెబ్‌సైట్‌ను కూడా రూపొదించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో బీఆర్జీఎఫ్ పథకం వెబ్‌సైట్‌ను అప్పట్లో భానుమూర్తి రూపొం దించారు. ఈ వెబ్‌సైట్‌ను అప్పటి కలెక్టర్ ఉషారాణి ప్రారంభించారు. అప్పట్లో ఈ వెబ్సైట్ ద్వారా మండల స్థాయిలోని అధికారులు బీఆర్జీఎఫ్ వివరాలను అప్లోడ్ చేయడం వల్ల రాష్ట్రస్థాయి అధికారులు సైతం వివరాలను తెలుసుకొనే వెసులుబాటు కలిగింది. పంచాయతీరాజ్ వెబ్సైట్.. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగాల కో సం ఒక్క క్లిక్‌తో ఆశాఖ పూర్తిసమాచారం తెలుసుకొనేందుకు నూతన వెబ్‌సైట్‌ను రూపొం దించి ఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్న భానుమూర్తి టీపీఆర్ఎంఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. దీంతో ఆయన సొంత శాఖకు సంబంధించిన(పంచాయతీ రాజ్) ఉద్యోగులకు అవసరమైన కొత్త వెబ్‌సైట్‌ను తయారు చేశారు. ‘డబ్ల్యూడబ్ల్యూ.టీపీఆర్ఎంఈఓ.కామ్’ ద్వారా రాష్ట్రంలోని పది జిల్లాల్లోని పీఆర్ ఉద్యోగులకు కీలకమైన జీఓలు, సర్వీస్ సేవల వివరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, సెలవుల నిబంధనలు, ఆర్ధికపరమైన పూర్తిసమాచారాన్ని పొందుపర్చాడు. వీటితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వివరాలను కూడా ఈ వె బ్‌సైట్‌లో పొందుపర్చాడు. గతంలో సైతం ఏపీపీఆర్ ఎంఈఏ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేతులుమీదుగా ప్రారంభించారు. బ్రాహ్మణ పరిషత్ కోసం వెబ్సైట్ రూపకల్పన.. బ్రాహ్మణ కులస్తులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. అలాగే వివిధ ఛానెల్స్‌కు సంబంధించిన ఆన్లైన్ న్యూస్ కోసం ప్రత్యేక సైట్లు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టేందుకు ఆన్లైన్ ఖమ్మం వెబ్‌సైట్‌ను ఇలా అనేక వెబ్సైట్లను రూపొందించారు. భానుమూర్తికి ఈ వెబ్సైట్ల రూపకల్పనల్లో ప్రతిభను చూసి పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ కలెక్టర్ ఉషారాణి, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నడింపల్లి వెంకటపతిరాజు,రాష్ర్టనేత మల్లెలరవీంద్రప్రసాద్ ఇలా అనేక మంది భానుమూర్తిని అభినందించారు. డొమైన్స్ కమిటీ సభ్యునిగా.. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన డొమైన్స్ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యునిగా భానుమూర్తి కొనసాగారు. కంప్యూటర్ నాలెడ్జ్ అధికంగా ఉన్న ఉద్యోగిగా అప్పుడు రాష్ట్ర స్థాయిలో భానుమూర్తి ఎంపికయ్యారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరీకరించేందుకు అప్పట్లో ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో సమాచారాన్ని కంప్యూటరీకరించారు. ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తుల సలహాల కోసం ఆయన్ను ఎంపిక చేశారు.