Allotment Of First Batch Seats In Engineering - Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ కోర్సులు ‘కేక’

Published Mon, Jul 17 2023 1:08 AM | Last Updated on Tue, Jul 18 2023 3:52 PM

Allotment of first batch seats in Engineering - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొలి విడత ఇంజనీరింగ్‌ సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం 82,666 సీట్లు అందుబాటులో ఉంటే, 70,665 భర్తీ చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ వెల్లడించారు. 12,001 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నట్టు తెలిపారు.

ఈ ఏడాది ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 1,56,879 మంది అర్హత సాధించారు. 76,821 మంది ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 75,708 మంది వివిధ కాలేజీలు, వివిధ బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చారు. మొత్తం 50,44,634 ఆప్షన్లు అందాయి. 5,043 మంది ఎలాంటి ఆప్షన్లు ఇవ్వలేదు. 5,576 మందికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాలో సీట్లు వచ్చాయి. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 173 పాల్గొన్నాయి. 

28 కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు 
మూడు యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు జరిగినట్టు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్‌ రిపోరి్టంగ్‌ చేయాలని ఎంసెట్‌ క్యాంప్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. 

సగానికిపైగా కంప్యూటర్‌ కోర్సులే 
మొదటి దశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఎక్కువగా కంప్యూటర్‌ కోర్సులనే విద్యార్థులు కోరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రాంచీల్లో కలిపి 82,666 సీట్లుంటే, కంప్యూటర్‌ కోర్సుల్లోనే 55,876 సీట్లున్నాయి. వీటిల్లో భర్తీ అయిన సీట్లు 52,637. అన్ని బ్రాంచీలకు కలిపి ఉన్న సీట్లలో 67.5 శాతం కంప్యూటర్‌ కోర్సులవైతే, 32.5 శాతం ఇతర బ్రాంచీలకు చెందినవి ఉన్నాయి.

కంప్యూటర్‌ కోర్సుల్లో సీఎస్‌సీ, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్, డేటాసైన్స్, ఐటీతో కలుపుకుని మొత్తం 18 రకాల కోర్సులున్నాయి. ఎక్కువ మంది ఈ కోర్సులకే ఆప్షన్లు ఇవ్వడంతో 94.20 శాతం సీట్లు భర్తీ చేశారు. మిగిలిపోయిన సీట్లు 3,239 ఉన్నాయి. ఇవి కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలకు సంబంధించినవే. 

ఈ కోర్సుల్లో వందశాతం భర్తీ 
ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్‌ కోర్సులో 137సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయ్యాయి.  కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో 91,  కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టంలో 318, సీఎస్‌సీ (సైబర్‌ సెక్యూరిటీ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ)లో 133, సీఎస్‌సీ (నెట్‌వర్క్‌)లో 91, సీఎస్‌సీ (ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్‌)లో 870 సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయినట్టు అధికారులు  వెల్లడించారు. 

భారీగా సీట్లు మిగిలిన సివిల్, మెకానికల్, ఈఈఈ 
కౌన్సెలింగ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సుల పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత ఏడాది కూడా ఇదే విధంగా ఉండటంతో చాలా కాలేజీలు ఈ బ్రాంచీల్లో సీట్లు రద్దు చేసుకోవడంతో 7 వేల సీట్లు తగ్గాయి. అయినప్పటికీ ఈ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి.

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ వాటి అనుబంధ బ్రాంచీల్లో 17,274 సీట్లు అందుబాటులో ఉంటే, 13,595 సీట్లు మాత్రమే కేటాయించారు. 3,679 సీట్లు మిగిలిపోయాయి. మెకానికల్, సివిల్‌ సహా వాటి అనుబంధ బ్రాంచీల్లోనూ 3,642 సీట్లు మిగిలిపోయాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 44.76 శాతం, మెకానికల్‌ 38.50 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ఈఈఈలోనూ 58.38 శాతం సీట్లు భర్తీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement