సగం కోర్సు ఇంటర్న్ షిప్ లే | Practical thinking in engineering | Sakshi
Sakshi News home page

సగం కోర్సు ఇంటర్న్ షిప్ లే

Published Fri, Dec 6 2024 6:06 AM | Last Updated on Fri, Dec 6 2024 6:06 AM

Practical thinking in engineering

ఇంజనీరింగ్‌లో ప్రాక్టికల్‌ థింకింగ్‌

క్లాస్‌ రూం పాఠాలు 50 శాతమే

డిగ్రీ కోర్సుల్లోనూ సమూల మార్పులు

బీకాంలో సైబర్‌ నేరాలపై పాఠాలు

సిలబస్‌ మార్పులపై కసరత్తు వేగవంతం

వచ్చే ఏడాది నుంచే అమలుకు సన్నాహాలు

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలు పెట్టింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ద డమే లక్ష్యంగా సిలబస్‌లో మార్పులు చేయాలని సంకల్పించింది. డిగ్రీ కోర్సుల్లోనూ మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా కొత్త సిలబస్‌ రూపకల్పనకు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసింది. కొత్త సిలబస్‌లో ఫీల్డ్‌ అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

తరగతి గది బోధనను 50 శాతానికే పరిమితం చేసి.. మిగతా 50 శాతం కోర్సు కాలమంతా ఇంటర్స్‌షిప్‌లకు కేటాయించాలని భావిస్తున్నారు. ఇంటర్న్‌షిప్‌లు కూడా పేరెన్నికగన్న సంస్థల్లోనే చేయాలన్న నిబంధన తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. సామాజిక అవగాహనకు కూడా కొత్త సిల బస్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్టిఫిషి యల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా సైన్స్‌ కోర్సు ల్లో సీట్లు పెరుగుతుండటంతో ఐటీ కంపెనీల్లో వృత్తి పరమైన అనుభవానికి పెద్ద పీట వేయా లని భావిస్తున్నారు.

ఆయా సంస్థలతో కాలేజీ లు అవగాహన ఒప్పందాలు చేసుకోవడం తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బోధనా ప్రణాళికను సమగ్రంగా మార్చాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. 

పోటీకి తగ్గట్టుగా డిగ్రీ కోర్సులు
సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో కాంబినేషన్‌ కోర్సులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిలబస్‌పై అధ్యయనానికి నియమించిన కమిటీలకు మండలి సూచించింది. ప్రస్తుతం డిగ్రీ ఆర్ట్స్‌ కోర్సుల్లో 30 శాతం, సైన్స్‌ కోర్సుల్లో 20 శాతం సిలబస్‌ను మార్చాలని నిర్ణయించారు. ఏటా అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా కొత్త సిలబస్‌ను పరిచయం చేయాలని భావిస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సిలబస్‌ను రూపొందిస్తున్నారు.

డిగ్రీ విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటనలు (ఫీల్డ్‌ వర్క్స్‌), ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించడాన్ని తప్పనిసరి చేయాలని మండలి నిర్ణయించింది. ఆర్థిక రంగంలో ఈ–కామర్స్‌ శరవేగంగా దూసుకుపోతుండటంతో సైబర్‌ నేరాలు కూడా పెరుగుతున్నాయి. వీటిని గుర్తించి, నివారణ మార్గాలను కనుగొనేటమే లక్ష్యంగా డిగ్రీ బీకాం కోర్సుల్లో సైబర్‌ నేరాలపై పాఠ్యాంశాలను చేర్చబోతున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో రాణించే విధంగా డిగ్రీ కోర్సులు రూపొందించాలని భావిస్తున్నారు.

మార్చి నాటికి సిలబస్‌పై సమగ్ర అధ్యయనం
ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల సిలబస్‌ మార్పు ను వేగంగా పూర్తి చేయా లని కమిటీలను కోరాం. 2025 మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అమల్లోకి తేవాలన్నది లక్ష్యం.  – ప్రొఫెసర్‌ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement