ఆన్‌లైన్.. భానుడు
అతడు కంప్యూటర్ కోర్సులు చేయలేదు..ఇంజనీరింగ్ చదవలేదు.. కానీ కంప్యూటర్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. ఒక గంట దృష్టి సారించి కంప్యూటర్‌పై కూర్చుంటే ఓ నూతన వెబ్ సైట్ తయారైనట్లే.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న బనిగండ్లపాటి భానుమూర్తి.. ఆయన గురించి ‘సాక్షి’ పాఠకుల కోసం..
వైరా పట్టణానికి చెందిన బనిగండ్లపాటి భానుమూర్తి చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చింతకాని మండల పరిధిలోని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండే విధంగా ఒక వెబ్‌సైట్ రూపొందించాడు. ఈ సమాచారం తెలుసుకోవాలనుకునే వారు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.చింతకాని.కామ్’ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్‌సైట్‌లో మండలానికి సంబంధించిన ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు, మరుగుదొడ్లు, జనరల్‌బాడీ మీటింగ్‌ల సమాచారం, ఎంపీటీసీ, వార్డు సభ్యుల వివరాలు పొందుపరిచాడు.
బీఆర్‌జీఎఫ్ వెబ్‌సైట్..
మండల స్థాయిలో బీఆర్‌జీఎఫ్ నిధుల వ్యయానికి సంబంధించి, మండలపరిషత్ ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేందుకు ‘డబ్ల్యూడబ్ల్యూ.కెఎంఎం.కో.ఇన్’ అనే వెబ్‌సైట్‌ను కూడా రూపొదించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మంలో బీఆర్‌జీఎఫ్ పథకం వెబ్‌సైట్‌ను అప్పట్లో భానుమూర్తి రూపొం దించారు. ఈ వెబ్‌సైట్‌ను అప్పటి కలెక్టర్ ఉషారాణి ప్రారంభించారు. అప్పట్లో ఈ వెబ్‌సైట్ ద్వారా మండల స్థాయిలోని అధికారులు బీఆర్‌జీఎఫ్ వివరాలను అప్‌లోడ్ చేయడం వల్ల రాష్ట్రస్థాయి అధికారులు సైతం వివరాలను తెలుసుకొనే వెసులుబాటు కలిగింది.
పంచాయతీరాజ్ వెబ్‌సైట్..
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగాల కో సం ఒక్క క్లిక్‌తో ఆశాఖ పూర్తిసమాచారం తెలుసుకొనేందుకు నూతన వెబ్‌సైట్‌ను రూపొం దించి ఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్న భానుమూర్తి టీపీఆర్‌ఎంఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. దీంతో ఆయన సొంత శాఖకు సంబంధించిన(పంచాయతీ రాజ్) ఉద్యోగులకు అవసరమైన కొత్త వెబ్‌సైట్‌ను తయారు చేశారు.
‘డబ్ల్యూడబ్ల్యూ.టీపీఆర్‌ఎంఈఓ.కామ్’ ద్వారా రాష్ట్రంలోని పది జిల్లాల్లోని పీఆర్ ఉద్యోగులకు కీలకమైన జీఓలు, సర్వీస్ సేవల వివరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, సెలవుల నిబంధనలు, ఆర్ధికపరమైన పూర్తిసమాచారాన్ని పొందుపర్చాడు. వీటితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వివరాలను కూడా ఈ వె బ్‌సైట్‌లో పొందుపర్చాడు. గతంలో సైతం ఏపీపీఆర్ ఎంఈఏ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేతులుమీదుగా ప్రారంభించారు.
బ్రాహ్మణ పరిషత్ కోసం వెబ్‌సైట్ రూపకల్పన..
బ్రాహ్మణ కులస్తులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. అలాగే వివిధ ఛానెల్స్‌కు సంబంధించిన ఆన్‌లైన్ న్యూస్ కోసం ప్రత్యేక సైట్లు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెట్టేందుకు ఆన్‌లైన్ ఖమ్మం వెబ్‌సైట్‌ను ఇలా అనేక వెబ్‌సైట్‌లను రూపొందించారు. భానుమూర్తికి ఈ వెబ్‌సైట్ల రూపకల్పనల్లో ప్రతిభను చూసి పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ కలెక్టర్ ఉషారాణి, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నడింపల్లి వెంకటపతిరాజు,రాష్ర్టనేత మల్లెలరవీంద్రప్రసాద్ ఇలా అనేక మంది భానుమూర్తిని అభినందించారు.
డొమైన్స్ కమిటీ సభ్యునిగా..
రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన డొమైన్స్ ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యునిగా భానుమూర్తి కొనసాగారు. కంప్యూటర్ నాలెడ్జ్ అధికంగా ఉన్న ఉద్యోగిగా అప్పుడు రాష్ట్ర స్థాయిలో భానుమూర్తి ఎంపికయ్యారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరీకరించేందుకు అప్పట్లో ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో సమాచారాన్ని కంప్యూటరీకరించారు. ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తుల సలహాల కోసం ఆయన్ను ఎంపిక చేశారు.