సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు ఈసారి భారీగా దరఖాస్తులొచ్చాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌లో నూ ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. ఇప్పటివరకూ రెండు విభాగాలకు కలిపి 3,20,310 అప్లికేషన్లు అందాయి. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీవి 72,164 ఉన్నాయి. గత సంవత్సరం (2022) మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూ హ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరగడంతో ఆ మేరకు పరీ క్ష కేంద్రాల పెంపుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
దేశవ్యాప్తంగా 2019 చివరలో కోవిడ్ విజృంభించడం, రెండేళ్ళ పాటు విద్యా సంస్థలు సరిగా నడవకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021లో టెన్త్ వార్షిక పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పాస్ చేశారు. ఎప్పటిలాగే పరీక్షలు జరిగితే 20 శాతం వడపోత అక్కడే జరిగేది. కానీ పరీ క్షలు లేకపోవడంతో విద్యార్థులు చాలావరకు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు తీసుకున్నా రు. వీళ్ళే ఇంటర్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఎంసెట్ రాస్తున్నారు. అంటే ఎంసెట్ దరఖాస్తులు పెరగడానికి ‘అంతా పాస్’దోహదపడిందన్న మాట.
‘కంప్యూటర్’ క్రేజ్ కూడా కారణమే..
జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఈఈ రాయాల్సి ఉంటుంది. ఇందులో ర్యాంకు రావాలంటే బాగానే కష్టపడాలి. ముమ్మర కోచింగ్ తీసుకోవాలి. ఇంతా చేసి సాధారణ ర్యాంకు వస్తే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు లభించడం కష్టం. ఈ కారణంగానే ఇంటర్ ఉత్తీర్ణుల్లో సగానికిపైగా జేఈఈ వైపు వెళ్ళడం లేదు. ఎలాగైనా కంప్యూటర్ సంబంధిత ఇంజనీరింగ్ కోర్సు చేయాలనుకుంటున్న వారు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎంసెట్‌కు 3 లక్షల మంది దరఖాస్తు చేస్తే, జేఈఈకి 1.40 లక్షల మందే దరఖాస్తు చేయడం గమనార్హం.
మరోవైపు విద్యార్థుల అభిమతానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ట్రెండ్ మార్చాయి. సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుంటున్నాయి. వీటి స్థానంలో సీఎస్‌సీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకుంటున్నాయి. దీంతో ఎంసెట్‌లో అర్హత సాధిస్తే ఏదో ఒక కాలేజీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు అనువైన కంప్యూటర్ కోర్సు సీటు వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు.ఎంసెట్‌కు దరఖాస్తులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రాజధాని చుట్టే ఎంసెట్
ఎంసెట్ కోసం మొత్తం 21 జోన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 16 జోన్లు తెలంగాణలో, 5 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న జోన్లలో ఐదు హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,48,146 ఎంసెట్ దరఖాస్తులొస్తే, హైదరాబాద్ కేంద్రంగానే 1,71,300 అప్లికేషన్లు వచ్చాయి.
హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లోనే జూనియర్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీల దృష్టీ ఇక్కడే ఉంటోంది. టెన్త్ పూర్తవ్వగానే ఇంటర్ విద్యాభ్యాసానికి, ఎంసెట్ శిక్షణకు హైదరాబాదే సరైన కేంద్రమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ కారణంగానే పిల్లల్ని హాస్టళ్ళలో ఉంచి మరీ చదివిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ కేంద్రంగానే ఎంసెట్ రాసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
రెండు రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాల పెంపు!
ఎంసెట్ దరఖాస్తులు అనూహ్యంగా పెరగడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల్లోనూ పరీక్ష కేంద్రాలు పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష నిర్వహించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. తెలంగాణలో ఇంటర్ వెయిటేజ్ ఎత్తివేయడంతో ఈసారి ఏపీ నుంచి దరఖాస్తులు పెరిగాయి. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ, జేఎన్‌టీయూహెచ్)
Comments
Please login to add a commentAdd a comment