మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ఒకప్పుడు ఎవర్‌గ్రీన్‌గా వెలుగొందిన మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణ నేడు ప్రశ్నార్థకమవుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ బూమ్‌తో ఇంజినీరింగ్ విద్యలో కంప్యూటర్ కోర్సుల హవా కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి కంప్యూటర్ కోర్సునకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఇదే క్రమంలో కోర్ బ్రాంచ్‌లుగా పేరున్న మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లకు ఆదరణ తగ్గుతోంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కాలేజీల యాజమాన్యాలు సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తు చేస్తున్నాయి.
చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్‌లో పడ్డట్టే!
ఇదే సాక్ష్యం..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 30 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 2021–22 విద్యా సంవత్సరంలో అన్ని కాలేజీల్లో కలిపి 13,283 సీట్లు భర్తీకి సాంకేతిక విద్యాశాఖ నుంచి అనుమతులు ఉన్నాయి. మూడు విడతలుగా జరిగిన కౌన్సెలింగ్, అదే విధంగా మేనేజ్‌మెంట్ కోటాతో కలుపుకొని 9,396 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో కంప్యూటర్స్, దీనికి అనుబంధ కోర్సులకు 95 నుంచి 100 శాతం డిమాండ్ ఉంటే.. మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో 30 శాతం మాత్రమే నిండాయి. ఈ రెండు బ్రాంచ్‌ల్లో ఏడు కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాకపోగా, మరో 13 కాలేజీల్లో పది లోపే విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
ఎందుకిలా..
ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగం రాజ్యమేలుతోంది. కంప్యూటర్ కోర్సులు చేసిన వారికే వీటిలో అవకాశాలు దక్కుతున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో కంప్యూటర్ ఇంజినీర్లదే పైచేయిగా నిలుస్తోంది. కోర్ బ్రాంచ్‌లు చదువుకుని అటువైపు వెళ్లిన విద్యార్థులకు మళ్లీ కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యంపై పరీక్ష పెడుతున్నారు. దీంతో మెకానికల్, సివిల్ ఇంజినీర్లు చాలా మంది ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సి వస్తోంది.
కొత్త కంప్యూటర్ కోర్సుల కోసం..
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్‌ఈ) కోర్సుకు ఉన్న డిమాండ్‌తో దీనికి అనుబంధంగా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిజినెస్ సిస్టమ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, ఐవోటీ, ఆటోమేషన్ ఇలా వివిధ రకాల కోర్సుల కోసమని కాలేజీల నుంచి సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి.
పూర్వవైభవం తీసుకొచ్చేలా..
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాంకేతిక కోర్సుల నిర్వహణపై కూడా దృష్టి సారించింది. కోర్సు ఏదైనా నైపుణ్యానికి పెద్ద పీట వేసేలా మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపడుతున్న కార్యక్రమాలతో నిర్మాణ, పారిశ్రామిక రంగాలు మళ్లీ పుంజుకుంటుండటంతో మెకానికల్, సివిల్ ఇంజినీర్లకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇదే ఊపును కొనసాగించేలా కోర్ బ్రాంచ్‌లకు కొత్తరూపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
నైపుణ్యం అవసరం..
ఉన్నత విద్యలో ఏ కోర్సు ఎంచుకున్నా, దానిలో నైపుణ్యం ఉన్న వారికే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకనే ఉన్నత విద్యలో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్స్, సివిల్, మెకానికల్‌లో దేని ప్రాముఖ్యత దానిదే.
– డాక్టర్ ఎం. రామిరెడ్డి, రిజిస్ట్రార్, కృష్ణావర్సిటీ
అవి ఎప్పటికీ ఎవర్‌గ్రీన్
కోర్ బ్రాంచ్‌లైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. ఏ రంగమైనా యంత్రాలు లేకుండా ముందుకెలా నడుస్తుంది. ఈ కోర్ సబ్జెక్టుల ప్రాధాన్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అయితే విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌పైనే మక్కవ పెంచుకుంటున్నారు.
-డాక్టర్ జ్యోతిలాల్, ఇంజినీరింగ్ అధ్యాపకుడు, నూజివీడు
మెకానికల్ మంచిదే..
ఆటోమేషన్ వల్ల ఇంజినీర్లకు పనితగ్గింది. అయినప్పటికీ గుండు సూది నుంచి రైలు ఇంజిన్ వరకు తయారీలో మెకానికల్ ఇంజినీర్ ఉండాల్సిందే. కంప్యూటర్ సైన్స్‌కు ఎంత డిమాండ్ ఉన్నా అన్ని వ్యవస్థలకు ఆధారం మెకానికల్.
-వి. ఎలీషా దేవసహాయం, సీనియర్ మెకానికల్ ఇంజినీర్, సాంకేతిక విద్యాశాఖ
Comments
Please login to add a commentAdd a comment