వారాంతపు సెలవుల్లో సైతం బిజీ లైఫ్
మానసిక ఒత్తిడి, వెన్నెముక సమస్యలతో సతమతం
వీరి కోసమే వెలుస్తున్న వెల్‌నెస్ సెంటర్లు
విశ్రాంతి, ఆరోగ్య సంరక్షణ తప్పదంటున్న నిపుణులు
సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఈ తరానికి ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్.. మారుతున్న అధునాతన సాంకేతికత, మోడ్రన్ లైఫ్ స్టైల్‌లో తాము కూడా భాగస్వాములు కావాలనే ఆశయంతో టెకీలుగా మారుతున్న యువకులెందరో.. ఐదంకెల జీతం, ఐదు రోజులు మాత్రమే పని, సామాజిక హోదా, గుర్తింపు, గౌరవం.. ఇలా ఎన్నెన్నో ఆశలతో అక్షయపాత్ర వంటి సాఫ్ట్‌వేర్ పల్లకీలోకి అడుగెడుతున్నారు. కానీ.. ఒక్కసారి ఈ రంగంలోకి వచ్చాక వారి జీవన శైలి వారు అనుకున్నట్టుగానే ఉంటుందా..? సామాజికంగా, సౌకర్యాల పరంగా వైరల్ అవుతున్న రీల్స్‌లా ఉన్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం ఆ రీల్స్‌కు వచ్చే కామెంట్ల మాదిరిగా మారింది. మానసిక ఒత్తిడి, శారీరక అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఆర్భాటాలు..! నాణానికి మరో కోణం వంటి ఈ అవస్థల పరిష్కారానికి నగరంలో వెల్‌నెస్ సెంటర్లు సైతం వెలుస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ లేకుండా సాఫ్ట్‌గా కొనసాగుతున్నప్పటికీ.. మానసికంగా ఒత్తిడి మాత్రం పీక్స్‌లో ఉంటుందని టెకీల మాట. సాఫ్ట్‌వేర్లు, ఐటీ ఉద్యోగుల దైనందిన జీవితం.. కొత్త ప్రాజెక్ట్‌లు, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్లు, పైప్‌లైన్ ప్రాసెస్, డిప్లాయిమెంట్, అజైల్ ప్రాసెస్, బెంచ్, టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్ తదితర నైపుణ్యాల మధ్య అందమైన దయనీయంగా కొనసాగుతుంది. ఐదు రోజుల పని, వారానికి రెండు రోజులు సెలవులు. ఇంకేం.. హాయిగా ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటాం.. కానీ క్రెడిట్ బిల్లులు, ఈఎంఐ పేమెంట్స్, రీఫండబుల్ అకౌంట్స్ చెక్ చేసుకుని, సెట్ చేసుకునేలోపు సోమవారం వస్తుందని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తెలిపారు. ఆఫీసులోనైనా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఐనా, హైబ్రిడ్ ఐనా.. ఒత్తడి మాత్రం తప్పదంటున్నారు గచ్చిబౌలికి చెందిన ఐటీ ప్రొఫేషనల్ గౌతమీ. జాబ్ రాక ముందు ఒక అవస్థ, వచ్చాక దానిని కాపాడుకోవడానికి మరో అవస్థ.. వీటి మధ్య టార్గెట్ రీచ్ కావడానికి, సొల్యూషన్స్ క్లియర్ చేయడానికి ల్యాప్‌ట్యాప్ పైన చేసే యుద్ధం మరో ప్రపంచ యుద్ధాన్ని గుర్తు చేస్తుందని యువ సాఫ్ట్‌వేర్ నరేష్ తెలిపారు. ఇక బెంచ్‌పై ఉన్న వారి పరిస్థితి వివరించడానికి మరో జావా లాంగ్వేజ్ తయారు చేయాలని స్టీఫెన్ మాట.
అసహజ జీవనానికి వేదికలుగా..
అందమైన అద్దాల గ్లోబల్ భవనాల్లోని ఈ సాఫ్ట్‌వేర్ల ఒత్తిడి వారి జీవితాల పైన పెద్ద ప్రభావమే చూపిస్తుందని ఆరోగ్య నిపుణలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వారి హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్‌ను విపరీతంగా పెంచుతుంది. విభిన్న ఆరోగ్య సమస్యలకు ఇది మూల కారణమని నిపుణుల మాట. పనివేళల్లో దాదాపుగా కూర్చొనే ఉండటంతో ఉబకాయం, మధుమేహం పక్క సీట్లోనే ఎదురు చూస్తుంది. వెన్ను నొప్పులు, నరాల బలహీనత ఇలా తదితర సమస్యలకు ఈ హైటీ ఒత్తిడి కారణమవుతోంది. దీనికి తోడు నైట్ డ్యూటీలు సహజ జీవన విధానానికి ఆటంకంగా మారిందిన అంతర్జాతీయ ఆరోగ్య సర్వేలు, అధ్యయనాలు వెల్లడించాయి. ఇలాంటి సమస్యలు పెరుగుతున్న సమయంలో వీరికి సాంత్వన, సహకారం అందించడానికి విభిన్న రకాల వెల్‌నెస్ సెంటర్లు ఆవిష్కృతమైతున్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, అంతర్గత స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవడానికి మెడిటెషనల్ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి.
యోగా, మ్యూజిక్, ధ్యానం..
మీరు సాఫట్‌వేర్ ఉద్యోగా..?! ఐతే మీ కోసమే మా ఈ సెషన్ అంటూ సోషల్ మీడియా యాడ్. ధ్యానం, యోగా సమ్మిళితంగా వినూత్న కోర్స్ అది. ఒత్తిడిమయమైన యువకులకు ఇదో ఉపశమనం. నగర శివార్లలో పచ్చని పారవశ్యంలో ఏర్పాటు చేసిన మరో బైండ్ మ్యాజిక్ సెంటర్. ఇక్కడ వారు నిర్వహించే సైకలాజికల్ సెషన్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మరింత చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ఇలాంటి వారికి స్పిర్చువల్ మ్యూజిక్ హీలింగ్ సెంటర్లు కూడా ఎంతో మేలు చేస్తున్నాయి. ఏరోబిక్స్, జుంబా వంటి ఫిట్నెస్ సెంటర్లు సైతం ఈ అవస్థలకు కాసింత చెక్ పెడుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంగంలోని అనారోగ్య సమస్యలకు ఎర్గనామిక్స్ అనే ప్రత్యేక మెడికల్ సేవలు సైతం ఉన్నాయి. ఈ మధ్య ఈ సేవలు మరింత ఆదరణ పొందుతున్నాయి.
ఎన్‌షూర్ ఫర్ క్యూర్..
సాఫ్ట్‌వేర్ రంగంలోని ఉద్యోగులు అధిక సమయం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చునే పని చేయాలి. నగరంతో పాటు దేశంలోని ఈ రంగంలో దాదాపు 64 శాతం మంది సెడెంటరీ డెస్క్ జాబ్‌లలో ఉన్నవారే. ఇటీవలి ప్రముఖ అధ్యయనం ప్రకారం ఇలాంటి ఉద్యోగాల వలన ప్రపంచవ్యాప్తంగా 540 మిలియన్లకు పైగా ప్రజలను నడుము నొప్పి ప్రభావితం చేస్తుంది. 25 సంవత్సరాల్లో ఈ పరిస్థితి రెట్టింపు అయ్యింది. శరీరానికి మూలస్థంభమైన వెన్నెముక ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక ఒత్తిడిని, భారాన్ని భరిస్తోంది. ఈ సమస్య అనతికాలంలోనే విభిన్న ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈ తరుణంలో సంరక్షణ కోసం ఎన్‌షూర్ హెల్తీ స్పైన్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టాం. ఈ అవస్థలు ఎదుర్కొంటున్న వారికి ప్రివెంటివ్ స్పైన్, స్పోర్ట్స్ హెల్త్ సెంటర్‌గా సాధారణ, సరళమైన పద్ధతులు రూపొందించాం. కోర్ కండరాలను బలోపేతం చేయడానికి ప్లాంక్స్, బ్రిడ్జెస్ వంటి వంటి వ్యాయామాలు.. ఫ్లెక్సిబుల్, బ్యాలెన్స్ కోసం మైండ్‌ఫుల్ మూవ్‌మెంట్స్ పద్ధతులు నిర్వహిస్తున్నాం. వెన్నుముక అవస్థలకు ఎర్గోనామిక్ వర్క్‌స్పేస్‌తో చెక్ పెట్టవచ్చు.
– నరేష్ పగిడిమర్రి, ఎన్‌షూర్ హెల్తీ స్పైన్ సీఈఓ.
Comments
Please login to add a commentAdd a comment