wellness centres
-
ఐటీ జాబ్స్.. పిటీ లైఫ్
సాఫ్ట్వేర్ జాబ్స్ ఈ తరానికి ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్.. మారుతున్న అధునాతన సాంకేతికత, మోడ్రన్ లైఫ్ స్టైల్లో తాము కూడా భాగస్వాములు కావాలనే ఆశయంతో టెకీలుగా మారుతున్న యువకులెందరో.. ఐదంకెల జీతం, ఐదు రోజులు మాత్రమే పని, సామాజిక హోదా, గుర్తింపు, గౌరవం.. ఇలా ఎన్నెన్నో ఆశలతో అక్షయపాత్ర వంటి సాఫ్ట్వేర్ పల్లకీలోకి అడుగెడుతున్నారు. కానీ.. ఒక్కసారి ఈ రంగంలోకి వచ్చాక వారి జీవన శైలి వారు అనుకున్నట్టుగానే ఉంటుందా..? సామాజికంగా, సౌకర్యాల పరంగా వైరల్ అవుతున్న రీల్స్‌లా ఉన్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం ఆ రీల్స్‌కు వచ్చే కామెంట్ల మాదిరిగా మారింది. మానసిక ఒత్తిడి, శారీరక అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఆర్భాటాలు..! నాణానికి మరో కోణం వంటి ఈ అవస్థల పరిష్కారానికి నగరంలో వెల్నెస్ సెంటర్లు సైతం వెలుస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ లేకుండా సాఫ్ట్‌గా కొనసాగుతున్నప్పటికీ.. మానసికంగా ఒత్తిడి మాత్రం పీక్స్‌లో ఉంటుందని టెకీల మాట. సాఫ్ట్వేర్లు, ఐటీ ఉద్యోగుల దైనందిన జీవితం.. కొత్త ప్రాజెక్ట్‌లు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్లు, పైప్‌లైన్ ప్రాసెస్, డిప్లాయిమెంట్, అజైల్ ప్రాసెస్, బెంచ్, టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్ తదితర నైపుణ్యాల మధ్య అందమైన దయనీయంగా కొనసాగుతుంది. ఐదు రోజుల పని, వారానికి రెండు రోజులు సెలవులు. ఇంకేం.. హాయిగా ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటాం.. కానీ క్రెడిట్ బిల్లులు, ఈఎంఐ పేమెంట్స్, రీఫండబుల్ అకౌంట్స్ చెక్ చేసుకుని, సెట్ చేసుకునేలోపు సోమవారం వస్తుందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారు. ఆఫీసులోనైనా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఐనా, హైబ్రిడ్ ఐనా.. ఒత్తడి మాత్రం తప్పదంటున్నారు గచ్చిబౌలికి చెందిన ఐటీ ప్రొఫేషనల్ గౌతమీ. జాబ్ రాక ముందు ఒక అవస్థ, వచ్చాక దానిని కాపాడుకోవడానికి మరో అవస్థ.. వీటి మధ్య టార్గెట్ రీచ్ కావడానికి, సొల్యూషన్స్ క్లియర్ చేయడానికి ల్యాప్‌ట్యాప్ పైన చేసే యుద్ధం మరో ప్రపంచ యుద్ధాన్ని గుర్తు చేస్తుందని యువ సాఫ్ట్వేర్ నరేష్ తెలిపారు. ఇక బెంచ్‌పై ఉన్న వారి పరిస్థితి వివరించడానికి మరో జావా లాంగ్వేజ్ తయారు చేయాలని స్టీఫెన్ మాట. అసహజ జీవనానికి వేదికలుగా.. అందమైన అద్దాల గ్లోబల్ భవనాల్లోని ఈ సాఫ్ట్వేర్ల ఒత్తిడి వారి జీవితాల పైన పెద్ద ప్రభావమే చూపిస్తుందని ఆరోగ్య నిపుణలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వారి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ను విపరీతంగా పెంచుతుంది. విభిన్న ఆరోగ్య సమస్యలకు ఇది మూల కారణమని నిపుణుల మాట. పనివేళల్లో దాదాపుగా కూర్చొనే ఉండటంతో ఉబకాయం, మధుమేహం పక్క సీట్లోనే ఎదురు చూస్తుంది. వెన్ను నొప్పులు, నరాల బలహీనత ఇలా తదితర సమస్యలకు ఈ హైటీ ఒత్తిడి కారణమవుతోంది. దీనికి తోడు నైట్ డ్యూటీలు సహజ జీవన విధానానికి ఆటంకంగా మారిందిన అంతర్జాతీయ ఆరోగ్య సర్వేలు, అధ్యయనాలు వెల్లడించాయి. ఇలాంటి సమస్యలు పెరుగుతున్న సమయంలో వీరికి సాంత్వన, సహకారం అందించడానికి విభిన్న రకాల వెల్నెస్ సెంటర్లు ఆవిష్కృతమైతున్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, అంతర్గత స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవడానికి మెడిటెషనల్ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. యోగా, మ్యూజిక్, ధ్యానం.. మీరు సాఫట్వేర్ ఉద్యోగా..?! ఐతే మీ కోసమే మా ఈ సెషన్ అంటూ సోషల్ మీడియా యాడ్. ధ్యానం, యోగా సమ్మిళితంగా వినూత్న కోర్స్ అది. ఒత్తిడిమయమైన యువకులకు ఇదో ఉపశమనం. నగర శివార్లలో పచ్చని పారవశ్యంలో ఏర్పాటు చేసిన మరో బైండ్ మ్యాజిక్ సెంటర్. ఇక్కడ వారు నిర్వహించే సైకలాజికల్ సెషన్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మరింత చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ఇలాంటి వారికి స్పిర్చువల్ మ్యూజిక్ హీలింగ్ సెంటర్లు కూడా ఎంతో మేలు చేస్తున్నాయి. ఏరోబిక్స్, జుంబా వంటి ఫిట్నెస్ సెంటర్లు సైతం ఈ అవస్థలకు కాసింత చెక్ పెడుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంగంలోని అనారోగ్య సమస్యలకు ఎర్గనామిక్స్ అనే ప్రత్యేక మెడికల్ సేవలు సైతం ఉన్నాయి. ఈ మధ్య ఈ సేవలు మరింత ఆదరణ పొందుతున్నాయి. ఎన్షూర్ ఫర్ క్యూర్.. సాఫ్ట్వేర్ రంగంలోని ఉద్యోగులు అధిక సమయం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చునే పని చేయాలి. నగరంతో పాటు దేశంలోని ఈ రంగంలో దాదాపు 64 శాతం మంది సెడెంటరీ డెస్క్ జాబ్‌లలో ఉన్నవారే. ఇటీవలి ప్రముఖ అధ్యయనం ప్రకారం ఇలాంటి ఉద్యోగాల వలన ప్రపంచవ్యాప్తంగా 540 మిలియన్లకు పైగా ప్రజలను నడుము నొప్పి ప్రభావితం చేస్తుంది. 25 సంవత్సరాల్లో ఈ పరిస్థితి రెట్టింపు అయ్యింది. శరీరానికి మూలస్థంభమైన వెన్నెముక ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక ఒత్తిడిని, భారాన్ని భరిస్తోంది. ఈ సమస్య అనతికాలంలోనే విభిన్న ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈ తరుణంలో సంరక్షణ కోసం ఎన్షూర్ హెల్తీ స్పైన్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టాం. ఈ అవస్థలు ఎదుర్కొంటున్న వారికి ప్రివెంటివ్ స్పైన్, స్పోర్ట్స్ హెల్త్ సెంటర్‌గా సాధారణ, సరళమైన పద్ధతులు రూపొందించాం. కోర్ కండరాలను బలోపేతం చేయడానికి ప్లాంక్స్, బ్రిడ్జెస్ వంటి వంటి వ్యాయామాలు.. ఫ్లెక్సిబుల్, బ్యాలెన్స్ కోసం మైండ్‌ఫుల్ మూవ్మెంట్స్ పద్ధతులు నిర్వహిస్తున్నాం. వెన్నుముక అవస్థలకు ఎర్గోనామిక్ వర్క్స్పేస్తో చెక్ పెట్టవచ్చు. – నరేష్ పగిడిమర్రి, ఎన్షూర్ హెల్తీ స్పైన్ సీఈఓ. -
200 కోట్లతో జీనోమ్‌ల్యాబ్స్ ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: న్యూట్రాస్యూటికల్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ జీనోమ్‌ల్యాబ్స్ రెండు ప్లాంట్లను నెలకొల్పుతోంది. భాగ్యనగరి సమీపంలోని జీనోమ్‌వ్యాలీలో 9 ఎకరాల విస్తీర్ణంలో తయారీ కేంద్రం ఏడాదిలో సిద్ధం కానుంది. ఇక్కడే కంపెనీకి ఆర్అండ్డీ సెంటర్ ఉంది. వైజాగ్ వద్ద ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లో మూడు ఎకరాల్లో వచ్చే ఏడాదికల్లా ప్లాంటు పూర్తి కానుంది. ఇప్పటికే రూ.50 కోట్లు వెచ్చించామని జీనోమ్‌ల్యాబ్స్ బయో సీఎండీ పి.నాగరాజు వెల్లడించారు. కంపెనీ రూపొందించిన పలు ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా సంస్థ ఈడీ అశోక్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తయారీ కేంద్రాలకు మొత్తం రూ.200 కోట్ల సొంత నిధులను ఖర్చు చేస్తామన్నారు. ప్రస్తుతం థర్డ్ పార్టీ ప్లాంట్లలో ఉత్పత్తుల తయారీ చేపట్టామని చెప్పారు. దేశవ్యాప్తంగా వెల్నెస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని ఆయన పేర్కొన్నారు. వందకుపైగా విభిన్న ఉత్పత్తులు.. జీనోమ్‌ల్యాబ్స్ 2015లో ఏర్పాటైంది. నాలుగేళ్ల పరిశోధన అనంతరం సహజసిద్ధ వనమూలికలతో ప్రొడక్టులను తయారు చేసింది. సూపర్ మార్కెట్లతోపాటు కంపెనీకి చెందిన ఫిట్డే.ఇన్ ద్వారా ఇవి లభిస్తాయి. కొరియాకు చెందిన ఇల్వా కంపెనీ సహకారంతో రూపొందించిన జిన్ సెంగ్ ఆధారిత ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి. మార్కెట్లో ఉన్న జిన్ సెంగ్ ప్రొడక్టులతో పోలిస్తే ఇది 15 రెట్లు మెరుగ్గా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. రోగ నిరోధక శక్తి పెంచే అశ్వగంధ, జిన్ సెంగ్, జింకో బిలోబా, ఎల్–ఆర్జినైన్‌తో గ్రీన్ టీ, క్యాప్యూల్స్, చూయింగ్ గమ్స్‌ను సూపర్ హెర్బ్ పేరుతో విడుదల చేసింది. సూపర్ డైట్ శ్రేణిలో ఆర్గానిక్ సీడ్స్, ఆయిల్స్‌ను, ఫ్లోనీ పేరుతో న్యూజీలాండ్, హంగేరీ నుంచి సేకరించిన ప్రపంచంలో అరుదైన తేనె రకాలను, జిమ్ చేసేవారి కోసం హైవోల్ట్ పేరుతో వే, చాకొలేట్ బార్స్‌ను విడుదల చేసింది. -
అందుబాటులోకి ‘వెల్నెస్’
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులు, జర్నలిస్టులకు ఉచితంగా వైద్య ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బురుజు దగ్గర్లో గల పాత మాతా శిశుసంరక్షణ (ఎంసీహెచ్) సేవలు అందించే భవనంలో వెల్నెస్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని శనివారం (నేడు) జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించనున్నారని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే విషయాన్ని ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావ్ వారం రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని ఏంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై త్వరలోనే వెల్నెస్ సేవలు అందుబాటులోకి వస్తాయని గుర్తు చేసిన విషయం విదితమే. సిద్దిపేటకమాన్ (సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులను జారీ చేసింది. ఈ ఆరోగ్య కార్డులున్న వారితోపాటు వారి కుటుంబానికి అవసరమైన వైద్యసేవలు ఉచితంగా అందిస్తుంది. ఒక కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచితంగా సేవలందిస్తారు. పరిమితి దాటితే ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఆరోగ్య కార్డులు ఉన్న వారు వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లి రావాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో వీరికి ఇబ్బందులు తప్పనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఐదు ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య కార్డులున్న వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. ఏడాది కిందటే మంజూరు సంవత్సరం కిందటే సిద్దిపేటకు వెల్నెస్ సెంటర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. సిద్దిపేటకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడం, జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా నూతనంగా 300 పడకల ఆస్పత్రిని నిర్మించడంతో సిద్దిపేటలోని ఏంసీహెచ్ విభాగాన్ని నూతన జిల్లా ఆస్పత్రి భవనంలోకి తరలించడం జరిగింది. దీంతో పాత ఎంసీహెచ్ భవనం ఖాళీ అయ్యింది. దీంతో పాత ఎంసీహెచ్ భవనంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పుర్తి చేశారు. సుమారు రూ. పది లక్షల వ్యయంతో అన్ని వసతులను ఏర్పాటు చేసి సెంటర్ ప్రారంభానికి సిద్ధం చేశారు. వెల్నెస్ సెంటర్లో ఓపీ సేవలతో పాటు, జనరల్ సర్జరీ, ఆప్థాల్మిక్ సేవలు, దంత వైద్యం, గైనకాలజీ సేవలు అందించనున్నారు. ఇక్కడ వైద్య సేవలకు అవసరమైన యంత్ర పరికరాలు, మందులు, సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని వసతుల ఏర్పాటు.. వెల్నెస్ కేంద్రంలోని భవనంలో ఓపీ సేవల కోసం గదులు, ఈసీజీ, ఎక్స్‌రే, దంత పరీక్షలు, డయాగ్నస్టిక్ పరీక్షల కోసం గదులను ఏర్పాటు చేశారు. ఇందుకు కావాల్సిన యంత్ర పరికరాలు, ఫర్నీచర్, సిబ్బందిని సిద్దం చేశారు. కార్పొరేటు ఆస్పత్రులకు దీటుగా ఇక్కడ వైద్య సేవలు అందనున్నాయి. ఇప్పటికే ఒక వైద్యుడితో పాటు సెంటర్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. వెల్నెస్ సెంటర్‌ను శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అమర్‌సింగ్ నాయక్, వెల్నెస్ సెంటర్ సిబ్బంది పాల్గొంటారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జర్నలిస్టులు, ఉద్యోగుల సంక్షేమం కోసం.. జిల్లాలోని జర్నలిస్టులు ప్రతి నిత్యం పని ఒత్తిడితో సతమతం అవుతూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వారి సంక్షేమం కోసం జిల్లాలోని జర్నలిస్టులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ, ఉచితంగా మందులను అందివ్వడానికి దోహదపడుతుంది. జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయం. ఈ వెల్నెస్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావ్ -
బీజాపూర్‌లో మోదీ కేర్‌కు బీజం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక పథకం మోదీ కేర్‌గా పిలిచే ఆయుష్మాన్ భారత్‌ను ఈనెల 14న చత్తీస్‌ఘర్‌లోని బీజాపూర్‌లో ఆయన ప్రారంభించనున్నారు. పథకం కింద దేశంలోనే తొలి వెల్నెస్ సెంటర్‌ను మోదీ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 115 జిల్లాలను ఈ పథకం కిందకు తీసుకువస్తూ రియల్‌టైమ్ పర్యవేక్షణ చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య బీమా పథకాలను మిళితం చేయడం, ప్రజా ఉద్యమం ద్వారా జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రేరేపించడం వంటి చర్యలను చేపడతారు. మెరుగైన ఫలితాలను సాధించిన జిల్లాలకు ర్యాంకులు కేటాయిస్తారు. ఆయుష్మాన్ భారత్ కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. వ్యాధుల నియంత్రణ, నివారణ, ముందస్తు జాగ్రత్తలే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తారు.దేశంలోని పేద కుటుంబాలకు రూ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
పాత్రికేయులకు పెన్నిధి
సాక్షి,సిటీబ్యూరో: జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా , ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన జర్నలిస్ట్‌ల హెల్త్‌స్కీమ్(జేహెచ్ఎస్) పాత్రికేయులకు వరంగా మారిందని సీఈవో కె. పద్మ తెలిపారు. ఈ పథకాన్ని ప్రారంభించి 13 నెలలు గడిచిన సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అర్హులైన జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగదు రహిత వైద్యం వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ‘ క్యాస్‌లెస్ ట్రీట్మెంట్’ అందించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 2015 జూలై 22న జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద పాత్రికేయులకు వెల్నెస్ సెంటర్ల ద్వారా ఔట్ పేషెంట్ చికిత్స, నెట్ వర్క్ హాస్పిటల్స్ ద్వారా ఇన్ పేషెంట్ చికిత్స అందజేస్తున్నాం, ఉచితంగా మందులను, వైద్య పరీక్షలు, వైద్యానికి సంబంధించి సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 8,100 మంది జర్నలిస్టులు, 25869 మంది జర్నలిస్టుల కుటుంబసభ్యులు ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోగా వారందరికీ హెల్త్‌కార్డులు పంపిణీ చేశాం. ‘వెల్నెస్’ సేవలివీ... వెల్నెస్ సెంటర్లల్లో ల్యాబ్లెటరీ తదితర అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాం. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. 2016 డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు 42,252 మంది ఉద్యోగులు, 44128 మంది పెన్షనర్లు, 1778 మంది జర్నలిస్టులు ఈ పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్నారు 22 వేలకుగాను 6 వేల మంది... రాష్ట్రంలో 22 వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉండగా అందులో 6 వేల మంది మాత్రమే హెల్త్‌కార్డులు పొందారు. కార్డులు పొందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 వేల హెల్త్‌కార్డులు జారీ చేశాం. జర్నలిస్టులంతా హెల్త్‌కార్డులు తీసుకొంటే వారి కుటుంబసభ్యులతో కలుపుకొంటే 50 వేల మందిపైగా ప్రయోజనం కలుగుతుంది. అన్ని రకాల వ్యాధులకూ వర్తింపు.. అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స అందజేస్తున్నాం. జనరల్ చికిత్స, కార్డియాలజీ, చెస్ట్, నెఫ్రాలాజీ, న్యూరో సర్జరీ, కేన్సర్, మెదడుకు సంబంధించిన సమస్యలతో పాటు మహిళలకు సంబంధించిన అన్ని రకాల జబ్బులకు, ముఖ్యంగా దంత సమస్యలకు అధునాతన చికిత్స లభిస్తుంది. ఫిజియోథెరఫీ సేవలు సైతం అందజేస్తున్నాం. వెల్నెస్ సెంటర్లలోనే ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రా స్కానింగ్‌తో పాటు అన్ని రకాల స్కానింగ్‌లు తీస్తారు. సీఎం ప్రత్యేక శ్రద్ధ: జర్నలిస్టుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏదైనా మీటింగ్‌లో తారసపడితే ముఖ్యమంత్రి జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు ఇచ్చారా.. వాటి పురోగతిపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి జర్నలిస్టులు ఎప్పుడు సమాజం గురించే ఆలోచిస్తూ, వారి కుటుంబం గురించి పట్టించుకోరు. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే వారికి హెల్త్‌కార్డు గుర్తుకు వస్తుంది. చివరి క్షణంలో మాపై హెల్త్‌కార్డుల కోసం ఒత్తిడి చేస్తారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు, ప్రెస్క్లబ్స్లు, ప్రెస్ అకాడమీతో చర్చించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందరూ కార్డులు పొంది ప్రాథమిక దశలోనే వ్యాధులకు చికిత్స చేయించుకుంటే మేలు. రూ. 500 కోట్లతో ప్రాజెక్టు అమలు... ఏ రాష్ట్రంలో కూడా జర్నలిస్టులకు, ఉద్యోగులు ఇలాంటి ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ప్రాజెక్ట్‌లు అమలు చేయడం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఇది విజయవంతమయ్యేందుకు జర్నలిస్టులు సహకరించాలి. అందుకే ‘ఓ జర్నలిస్టు ఆలోచించు... స్పందించు.. నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో’ అని కోరుతున్నాం. పత్రిక యాజమాన్యాలు కూడా అక్రిడిటేషన్లు లేని, హెల్త్‌కార్డులు పొందని వారిని గుర్తించాలి. హెల్త్‌కార్డులు ఉంటేనే ఉద్యోగులుగా కొనసాగిస్తామనే నిబంధన విధించాలి. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే 12 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్టుల కోసం... నాన్ అక్రిడిటేషన్ జర్నలస్టులకు కూడా జేహెచ్ఎస్ కింద హెల్త్‌కార్డులు జారీ చేయాల్సి ఉంది. డెస్కు జర్నలిస్టులు, కాపీ రైటర్స్, పేజ్ మేకర్స్ ఈ విభాగంలోకి వస్తారు. దాదాపు ఆరు వేల మందికి కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. వెల్నెస్ సెంటర్లు ఇవీ జర్నలిస్టులకు చికిత్స అందించేందుకు ఖైరతాబాద్, వనస్థలిపురం, ఏరియా ఆస్పత్రుల్లో, హన్మకొండ మెటర్నిటీ ఆస్పత్రిలో ఇప్పటికే వెల్నెస్ సెంటర్లు ప్రారంభించాం. సంగారెడ్డిలో అత్యాధునిక వసతులతో కొద్దిరోజుల క్రితమే వెల్నెస్ సెంటర్ ప్రారంభించాం. త్వరలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్ధిపేట్, ఖమ్మం, హైదరాబాద్‌లో మరో రెండు ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించబోతున్నాం. కూకట్‌పల్లిలో ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోజుకు 800 నుంచి 1000 వరకు, వనస్థలిపురంలో 500 నుంచి 600 వరకు ఓపీ వైద్యసేవలు పొందుతున్నారు. ‘సాక్షి’తో హెల్త్‌స్కీమ్ సీఈవో డాక్టర్ పద్మ -
రెడీ.. మనకో వెల్నెస్ సెంటర్
సంగారెడ్డి టౌన్: స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్‌ను సకల హంగులతో ప్రారంభానికి సిద్ధం చేశారు. దీన్ని ఈ నెల 8న (నేడు) వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిçస్టుల ఆరోగ్య పథకం కింద దీన్ని ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంట్రవెన్షన్ సెంటర్ కింద ఉన్న గదులను ఆధునీకరించి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు అత్యుత్తమ వైద్య సేవలు అందనున్నాయి. దీనికిగాను ప్రభుత్వం ప్రత్యేకంగా 25 మంది సిబ్బందిని నియమించింది. మరో 20 మంది సిబ్బందిని నియమించాల్సి ఉన్నట్లు వెల్నెస్ సెంటర్ అధికారులు తెలిపారు. ముగ్గురు ఎంబీబీఎస్, ఆర్థో, కార్డియాలజిస్టు, ముగ్గురు స్పెషలిస్టులు, ఒక గైనకాలజిస్టు, ఒక జనరల్ మెడిసిన్, ఒక డెంటల్, ఒక పిల్లల వైద్య నిపుణుడి తోపాటు డెంటల్, ఫిజియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ తదితర సేవలు అందనున్నాయి. జిల్లాలోని ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు ఈ ఆరోగ్య పథకం కింద సేవలు పొందాలంటే మొన్నటి వరకు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న వెల్నెస్ సెంటర్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకొని అక్కడి నుంచి ఇతర ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చేది. జిల్లా కేంద్రంలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో నిపుణులైన డాక్టర్ల సేవలు అందనున్నాయి. ఇక నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడదు. సర్జరీ అవసరమైన రోగులకు, ఇక్కడ అందుబాటులో లేని సేవల కోసం మాత్రమే హైదరాబాద్ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. గతంలో హైదరాబాద్‌లోని వెల్నెస్ సెంటర్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు. స్థానికంగానే జిల్లాలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కావడంతో ఇక్కడి నుంచే నేరుగా పెద్ద ఆస్పత్రులకు రెఫర్ చేయించుకొని అక్కడికి వెళ్లి వైద్య సేవలు నేరుగా పొందే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు దూరంగా ఉన్న కొన్ని కుటుంబాలు వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఉదయం 9 నుంచి ఓపీ సేవలు కార్పొరేట్ స్థాయిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు అవుతుండడంతో సంబంధిత ఆరోగ్య పథకం లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉదయం 9 గంటల నుండి ఐదున్నర గంటల వరకు, ఉదయం 8 గంటల నుండి డయాగ్నస్టిక్ పరీక్షల సేవలు అందుబాటులో ఉంటాయి. రోగులు ఇతర ఆస్పత్రులకు వెళ్లాలంటే ఈ వెల్నెస్ సెంటర్ నుంచి రెఫర్ చేయించుకొని వెళ్లవచ్చు. ఇక్కడ ఔట్ పేషెంట్ సేవలు మాత్ర మే అందుబాటులో ఉంటాయి. నగదు రహిత వైద్యం ఇక్కడ లభించనుంది. రోగులకు అయ్యే ఖర్చు ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. వైద్యంతోపాటు పరీక్షలు, మందులు ఉచితంగా అందించనున్నారు. వెల్నెస్ సెంటర్‌తోపాటు రాష్ట్రంలోని 14 కార్పొరేట్ ఆస్పత్రులు, మరో 200 ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా నగదు రహిత వైద్యం ఈ స్కీమ్ కింద చేయించుకోవచ్చు. సాధారణ జబ్బులకు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లోనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ వైద్యం లభించని పక్షంలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లగా చేరవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్లు, కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందవచ్చు. అలా చేరిన 48 గంటల్లోగా ఈజేహెచ్ఎస్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 1899 రకాల వ్యాధులకు ఈజేహెచ్ఎస్ కింద చికిత్స అందిస్తారు. వెల్నెస్ సెంటర్‌ను పరిశీలించిన సీఈఓ సంగారెడ్డి టౌన్: జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంట ర్ను ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సీఈఓ కె.పద్మజ బుధవారం పరిశీ లించారు. ఈ నెల 8న (నేడు) వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించి ప్రభుత్వ ఉద్యోగు లు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించనున్నట్లు ఆమె తెలిపారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో స్థానికంగానే మెరుగైన వైద్యం అందనుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు ధన్యవాదాలు సంగారెడ్డి టౌన్: జిల్లాలోని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినందుకుగాను మంత్రి హరీశ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ధన్యవాదా లు తెలుపుతున్నానని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యకాంత్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వెల్నెస్ కేంద్రాన్ని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు బాగున్నాయన్నారు. ఆయనతోపాటు సంఘం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సభ్యులు మనోజ్, రఘు, రవి, విఠల్‌రెడ్డి, రవిశంకర్, జమ్లా ఉన్నారు. -
ఉద్యోగుల కోసం 'వెల్నెస్' కేంద్రాలు
► రిఫరల్ క్లినిక్‌లు కాకుండా ఢిల్లీ తరహాలో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం ► ఉచిత ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, ఔషధాలు అన్నీ అక్కడే.. ► మంచి ఆరోగ్యం కోసం వైద్యుల సలహాలు కూడా తీసుకోవచ్చు ► ఇన్‌పేషెంట్ సేవలు మాత్రం కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో.. ► ముఖ్యమంత్రి వద్దకు ఫైలు పంపిన వైద్య ఆరోగ్యశాఖ ► ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఏదైనా అనారోగ్యం కలిగితేనే ఆస్పత్రులకు వెళుతుంటారు.. మరి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఆస్పత్రులకు వెళ్లి సలహాలు తీసుకునే విధంగా ‘ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని (ఈజేహెచ్ఎస్) తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ‘వెల్నెస్ కేంద్రాల’ను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయిం చింది. ఉచిత ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, ఔషధాలు అన్నింటినీ వెల్నెస్ కేంద్రాల్లోనే అందుబాటులో ఉంచుతారు. ఇప్పటివరకు వీటిని కేవలం అనారోగ్యం కలిగితే పరీక్షించే రిఫరల్ క్లినిక్‌లుగా తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం.. తాజాగా వెల్నెస్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారుల భేటీలో.. ‘ఈజేహెచ్ఎస్’ పథకంపై తుది నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ తరహాలో..: ఢిల్లీలో ఉద్యోగుల కోసం వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అదే తరహాలో ఇక్కడా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఆరు కేంద్రాల్లో, పాత జిల్లా కేంద్రాల్లో ఈ వెల్నెస్ కేంద్రాలను నెలకొల్పుతారు. వాటిలో డయాగ్నొస్టిక్ కేంద్రం కూడా ఉంటుంది. సాధారణ రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఈసీజీ వంటి ప్రాథమిక పరీక్షలు అందులో చేస్తారు. ఆ మేరకు జనరల్ సర్జన్ రాసిచ్చిన మందులను వెల్నెస్ కేంద్రాల్లోనే ఉచితంగా ఇస్తారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పెద్ద పరీక్షలను ఒప్పందం చేసుకున్న డయాగ్నస్టిక్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఏదైనా జబ్బున్నా, లేకున్నా కూడా హెల్త్ చెకప్ కోసం వెల్నెస్ కేంద్రాలకు వెళ్లవచ్చు. వైద్యుల సలహాలు తీసుకోవచ్చు. అవసరమైతే అందులోని వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకోవచ్చు. ఈ నెలాఖరు నుంచి ‘కార్పొరేట్’ సేవలు వెల్నెస్ కేంద్రాల్లో చికిత్స చేసే పరిస్థితి లేనప్పుడు అందులోని వైద్యుల రిఫరెన్స్ మేరకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇన్పేషెంట్లుగా చేరడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ఏ కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు. ఆయా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వివిధ చికిత్సలకు వసూలు చేసే ధరల్లో సగం ధరను చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఆయా ఆసుపత్రులు అంగీకరించాయి. దానినే ఫైనల్ చేశారు. ఈ పథకంలో రాష్ట్రంలో 12 కార్పొరేట్ ఆసుపత్రులు, 230 ఇతర ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఈ నెలాఖరు నుంచి వెల్నెస్ కేంద్రాలతోపాటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. వెల్నెస్ కేంద్రాల్లో ఓపీ సేవలు, ఉచిత పరీక్షలు, మందులు ఇచ్చే పరిస్థితి అమల్లోకి వచ్చాక.. కార్పొరేట్ ఆస్పత్రులు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాక... ప్రస్తుతం అమల్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేస్తారు. వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు, రీయింబర్స్మెంట్ రద్దుతో భారీగా ఖర్చు తగ్గుతుందని అంటున్నారు.