ఉద్యోగుల కోసం 'వెల్‌నెస్' కేంద్రాలు
► రిఫరల్ క్లినిక్‌లు కాకుండా ఢిల్లీ తరహాలో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం
► ఉచిత ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, ఔషధాలు అన్నీ అక్కడే..
► మంచి ఆరోగ్యం కోసం వైద్యుల సలహాలు కూడా తీసుకోవచ్చు
► ఇన్‌పేషెంట్ సేవలు మాత్రం కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో..
► ముఖ్యమంత్రి వద్దకు ఫైలు పంపిన వైద్య ఆరోగ్యశాఖ
► ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఏదైనా అనారోగ్యం కలిగితేనే ఆస్పత్రులకు వెళుతుంటారు.. మరి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఆస్పత్రులకు వెళ్లి సలహాలు తీసుకునే విధంగా ‘ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని (ఈజేహెచ్‌ఎస్) తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ‘వెల్‌నెస్ కేంద్రాల’ను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయిం చింది. ఉచిత ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, ఔషధాలు అన్నింటినీ వెల్‌నెస్ కేంద్రాల్లోనే అందుబాటులో ఉంచుతారు. ఇప్పటివరకు వీటిని కేవలం అనారోగ్యం కలిగితే పరీక్షించే రిఫరల్ క్లినిక్‌లుగా తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం.. తాజాగా వెల్‌నెస్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఇటీవల జరిగిన వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారుల భేటీలో.. ‘ఈజేహెచ్‌ఎస్’ పథకంపై తుది నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ తరహాలో..:
ఢిల్లీలో ఉద్యోగుల కోసం వెల్‌నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అదే తరహాలో ఇక్కడా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఆరు కేంద్రాల్లో, పాత జిల్లా కేంద్రాల్లో ఈ వెల్‌నెస్ కేంద్రాలను నెలకొల్పుతారు. వాటిలో డయాగ్నొస్టిక్ కేంద్రం కూడా ఉంటుంది. సాధారణ రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఈసీజీ వంటి ప్రాథమిక పరీక్షలు అందులో చేస్తారు. ఆ మేరకు జనరల్ సర్జన్ రాసిచ్చిన మందులను వెల్‌నెస్ కేంద్రాల్లోనే ఉచితంగా ఇస్తారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ వంటి పెద్ద పరీక్షలను ఒప్పందం చేసుకున్న డయాగ్నస్టిక్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఏదైనా జబ్బున్నా, లేకున్నా కూడా హెల్త్ చెకప్ కోసం వెల్‌నెస్ కేంద్రాలకు వెళ్లవచ్చు. వైద్యుల సలహాలు తీసుకోవచ్చు. అవసరమైతే అందులోని వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకోవచ్చు.
ఈ నెలాఖరు నుంచి ‘కార్పొరేట్’ సేవలు
వెల్‌నెస్ కేంద్రాల్లో చికిత్స చేసే పరిస్థితి లేనప్పుడు అందులోని వైద్యుల రిఫరెన్స్ మేరకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లుగా చేరడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ఏ కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు. ఆయా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వివిధ చికిత్సలకు వసూలు చేసే ధరల్లో సగం ధరను చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఆయా ఆసుపత్రులు అంగీకరించాయి. దానినే ఫైనల్ చేశారు. ఈ పథకంలో రాష్ట్రంలో 12 కార్పొరేట్ ఆసుపత్రులు, 230 ఇతర ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఈ నెలాఖరు నుంచి వెల్‌నెస్ కేంద్రాలతోపాటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వెల్‌నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. వెల్‌నెస్ కేంద్రాల్లో ఓపీ సేవలు, ఉచిత పరీక్షలు, మందులు ఇచ్చే పరిస్థితి అమల్లోకి వచ్చాక.. కార్పొరేట్ ఆస్పత్రులు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాక... ప్రస్తుతం అమల్లో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానాన్ని రద్దు చేస్తారు. వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు, రీయింబర్స్‌మెంట్ రద్దుతో భారీగా ఖర్చు తగ్గుతుందని అంటున్నారు.