కొత్తగూడెం : జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా చేపట్టిన ‘సాక్షరభారత్’ మిషన్ లక్ష్యం నెరవేరకుండానే సందిగ్ధంలో పడింది. గడువు ముగిసి 20 రోజులు గడిచినా ఇంకా అయోమయమే నెలకొంది. 2010 సెప్టెంబర్ 8న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్ మిషన్ గడువు 2017 డిసెంబర్ 31తో ముగిసింది. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన ఈ మిషన్.. మున్ముందు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేలా కొనసాగుతుందా.. లేక ప్రభుత్వం దీనికి ముగింపు పలుకుతుందా అనేది అంతుచిక్కడం లేదు. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా నడిచిన ఈ మిషన్‌లో పనిచేసిన గ్రామ, మండల కోఆర్డినేటర్లకు 15 నెలలుగా వేతనాలు అందడం లేదు. అంతేగాక ప్రభుత్వం కూడా దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పడుతూ.. లేస్తూ ముందుకు..
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన సాక్షరభారత్ మిషన్‌లో ప్రతి గ్రామపంచాయతీ కేంద్రంగా వయోజన విద్యా కేంద్రం ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభంలో 710 పంచాయతీల్లో ప్రారంభమై.. ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 631 గ్రామాల్లో నడుస్తోంది. మండలానికి ఒకరు, గ్రామానికి ఇద్దరు చొప్పున కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మిషన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5 దశలు పూర్తయ్యాయి. ఇందులో 1,09, 573 మంది నిరక్షరాసులు నమోదు కాగా, 66, 696 మంది పేర్లు రాయటం, తెలుగు చదవటం, రాయటం నేర్చుకుని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి గుర్తింపు పత్రాలను పొందారు. వీరిలో పురుషులు 13,770 మంది, మహిళలు 52,917 మంది ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులు అధికంగా ఉన్నప్పటికీ ఈ కేంద్రాలు మొక్కుబడిగా నడిచాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇదిలా ఉండగా జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ ఈ మిషన్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ పర్యవేక్షణలోనే కొనసాగుతోంది.
లక్ష్యం నెరవేరినట్లేనా..?
రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం, ప్రతి ఒక్కరూ కనీసం సంతకం పెట్టే వరకైనా అక్షరజ్ఞానం పొందాలనే లక్ష్యంతో ప్రారంభించిన సాక్షరభారత్ జిల్లాలో ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం 66.40 అక్షరాస్యత శాతంతో భద్రాద్రి జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో, 65.87 శాతంతో ఖమ్మం జిల్లా 7వ స్థానంలో నిలిచాయి. కాగా అధికారుల లెక్కల ప్రకారం 15 ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులు రెండు జిల్లాల్లో కలిపి ఇంకా 3, 99,153 మంది ఉండటం శోచనీయం.
మూడు నెలలు పొడిగించినా ఫలితం శూన్యమే..!
వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ 30తోనే సాక్షరభారత్ గడువు ముగిసింది. అయితే మిషన్ లక్ష్యం పూర్తి కాలేదనే ఉద్దేశ్యంతో మరో మూడు నెలలు (డిసెంబర్ 31 వరకు) గడువు పొడిగించారు. అయితే దీనికి సంబంధించిన కార్యకలాపాలు మాత్రం ఏమీ నడవలేదు. జిల్లాలో ఈ మూడు నెలల్లో వయోజన విద్యా కేంద్రాలు తెరుచుకోలేదు, నిరక్షరాస్యులకు పుస్తకాలు పంపిణీ చేయలేదు. కోఆర్డినేటర్లకు వేతనాలు అందకపోవడంతో కొంత మంది విధులకు హాజరు కావటం లేదు.
వేతనాల కోసం ఎదురుచూపులు...
జిల్లాలో మండల, గ్రామస్థాయిలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు నియమించిన మండల, గ్రామ కోఆర్డినేటర్ల వేతనాలు 15 నెలలుగా అందడం లేదు. మండల కోఆర్డినేటర్‌కు రూ.6 వేలు, గ్రామ కోఆర్డినేటర్లకు రూ. 2 వేల చొప్పున చెల్లించేవారు. తమకు వేతనాలు అందించాలని 18 వేల మంది కోఆర్డినేటర్లు ఇటీవల కరీంనగర్‌లో జరిగిన మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా.. సమస్య పరిష్కారం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment