ఫిట్‌మెంట్‌ పెరెగేది ఎంత? | Telangana Government Employees Waiting For PRC Recommendations | Sakshi
Sakshi News home page

ఫిట్‌మెంట్‌ పెరెగేది ఎంత?

Published Mon, Nov 18 2019 1:31 AM | Last Updated on Mon, Nov 18 2019 4:27 AM

Telangana Government Employees Waiting For PRC Recommendations - Sakshi

ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం పీఆర్‌సీని ఏర్పాటు చేసి దాని సిఫార్సుల ఆధారంగా ఫిట్‌మెంట్‌ను ఖరారు చేయడం ఆన వాయితీ. ఫిట్‌మెంట్‌ ఆధారంగానే వేతనాల పెరు గుదల ఉండనున్న నేపథ్యంలో పీఆర్‌సీ 25% వరకు ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వేతన సవరణ సంఘం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను స్వీకరించింది. గత పీఆర్‌సీ 29% ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయగా తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు ఇస్తున్న మొదటి వేతన సవరణ అయినందున సీఎం కేసీఆర్‌ 43% ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. అయితే ప్రస్తుత పీఆర్‌సీలో గత ఫిట్‌మెంట్‌కు అదనంగా 20% పెంచి 63% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పీఆర్‌సీ చైర్మన్‌కు నివేదికలు అందజేశాయి. పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా ఆ పెంపు అవసరమని తమ సంఘాల తరఫున తెలియజేశాయి. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంతమొత్తం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వేతన సవరణ సంఘం కూడా 25 శాతం వరకే ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదిక నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి అందనుంది. ఆ వెంటనే సీఎం కేసీఆర్‌ ఉద్యోగులతో సమావేశమై ఫిట్‌మెం ట్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. పీఆర్‌సీ నివేది కను 10–12 రోజుల్లో సమర్పించాలంటూ పీఆర్‌సీ చైర్మన్‌ సి.ఆర్‌. బిస్వాల్‌ను సీఎం కేసీఆర్‌ ఈ నెల 10న ఆదేశించడంతో నివేదికను అందజేసేందుకు వేతన సవరణ సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో పీఆర్‌సీ నివేది కలో ఉండే అంశాల్లో ప్రధానమైన ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు అంచనా వేసుకుంటున్నారు. నిత్యావ సర ధరల పెరుగుదల సూచీ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపుదలను ఖరారు చేయడమే ఫిట్‌మెంట్‌. ఫిట్‌మెంట్‌ ఆధారంగానే వేతనాల పెంపుదల ఉండనుండటంతో ఎక్కువ మొత్తంలో ఫిట్‌మెంట్‌ సాధనకు సీఎంను ఒప్పించాలని ఉద్యో గులు ఆయా సంఘాల నేతలను కోరుతున్నారు.

ఉద్యోగ సంఘాలు కోరుతున్నది.. 63%
వేతన సవరణ సంఘం సిఫార్సు?.. 25%

ఎంత ఫిట్‌మెంట్‌ ఇస్తే ఎంత భారం?
రాష్ట్రంలో ప్రస్తుతం 2.62 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్‌సీని అమలు చేయాల్సి ఉంటుంది. వారికి ఒక శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తే ఏటా అదనంగా రూ. 225 కోట్లను ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుందని పీఆర్‌సీ వర్గాలు ఇప్పటికే అంచనా వేశాయి. ఇలా ఒక శాతం నుంచి మొదలుకొని 35 శాతం వరకు ఫిట్‌మెంట్‌ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై లెక్కలు కట్టాయి. దాని ప్రకారం రాష్ట్రంలోని ఉద్యోగులకు 20 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే రూ. 4,500 కోట్లు, 22 శాతం ఇస్తే రూ. 4,950 కోట్లు, 24 శాతం ఇస్తే రూ. 5,400 కోట్లు, 25 శాతం ఇస్తే రూ. 5,625 కోట్లు, రూ. 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే రూ. 6,075 కోట్లు ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందని లెక్కలు వేశారు. అలాగే ప్రతి శాతానికి రూ. 225 కోట్ల చొప్పున లెక్కించి 35 శాతం ఇస్తే రూ. 7,875 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు.


సీఎం సమక్షంలోనే పెంపు ఖరారు...
పీఆర్‌సీ నివేదిక అందిన వెంటనే సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి ఫిట్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు. ఈ సందర్భంగా ఫిట్‌మెంట్‌ను వీలైనంతగా ఎక్కువగా పొందేలా సీఎం కేసీఆర్‌ను ఒప్పించాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ కనీసం 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తారని, అంతకంటే ఎక్కువ సాధించుకోవాలన్న ఆలోచనల్లో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 30 శాతం ఫిట్‌మెంట్‌ ఖరారు చేసేలా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నాయి. ఒకవేళ 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ప్రభుత్వం ఏటా రూ. 6,750 కోట్లు అదనంగా వెచ్చించాలి ఉంటుంది.

ఇతర అంశాలపైనా పీఆర్‌సీ దృష్టి...
ఉద్యోగులకు పీఆర్‌సీతోపాటు ప్రధాన డిమాండ్లు అయిన రిటైర్మెంట్‌ వయసు 61 ఏళ్లకు పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దుపై కమిటీ ఏర్పాటు వంటి అంశాలపైనా వేతన సవరణ సంఘం సిఫార్సు చేసే అవకాశం ఉంది. పీఆర్‌సీ సహా ఉద్యోగుల డిమాండ్లను ప్యాకేజీ రూపంలో అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ అంశాలపైనా సీఎం సమక్షంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాగా, పీఆర్సీలో పొందుపర్చాల్సిన అంశాలపై పీఆర్సీ సభ్యులతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం సమావేశం కానున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీ అనంతరం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement