సిద్దిపేటలో ఏర్పాటైన వెల్‌నెస్ సెంటర్
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులు, జర్నలిస్టులకు ఉచితంగా వైద్య ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బురుజు దగ్గర్లో గల పాత మాతా శిశుసంరక్షణ (ఎంసీహెచ్) సేవలు అందించే భవనంలో వెల్‌నెస్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని శనివారం (నేడు) జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించనున్నారని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే విషయాన్ని ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావ్ వారం రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని ఏంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై త్వరలోనే వెల్‌నెస్ సేవలు అందుబాటులోకి వస్తాయని గుర్తు చేసిన విషయం విదితమే.
సిద్దిపేటకమాన్ (సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులను జారీ చేసింది. ఈ ఆరోగ్య కార్డులున్న వారితోపాటు వారి కుటుంబానికి అవసరమైన వైద్యసేవలు ఉచితంగా అందిస్తుంది. ఒక కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచితంగా సేవలందిస్తారు. పరిమితి దాటితే ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఆరోగ్య కార్డులు ఉన్న వారు వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లి రావాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుతో వీరికి ఇబ్బందులు తప్పనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఐదు ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య కార్డులున్న వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నాయి.
ఏడాది కిందటే మంజూరు
సంవత్సరం కిందటే సిద్దిపేటకు వెల్‌నెస్ సెంటర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. సిద్దిపేటకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడం, జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా నూతనంగా 300 పడకల ఆస్పత్రిని నిర్మించడంతో సిద్దిపేటలోని ఏంసీహెచ్ విభాగాన్ని నూతన జిల్లా ఆస్పత్రి భవనంలోకి తరలించడం జరిగింది. దీంతో పాత ఎంసీహెచ్ భవనం ఖాళీ అయ్యింది. దీంతో పాత ఎంసీహెచ్ భవనంలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పుర్తి చేశారు. సుమారు రూ. పది లక్షల వ్యయంతో అన్ని వసతులను ఏర్పాటు చేసి సెంటర్ ప్రారంభానికి సిద్ధం చేశారు. వెల్‌నెస్ సెంటర్‌లో ఓపీ సేవలతో పాటు, జనరల్ సర్జరీ, ఆప్థాల్మిక్ సేవలు, దంత వైద్యం, గైనకాలజీ సేవలు అందించనున్నారు. ఇక్కడ వైద్య సేవలకు అవసరమైన యంత్ర పరికరాలు, మందులు, సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు.
అన్ని వసతుల ఏర్పాటు..
వెల్‌నెస్ కేంద్రంలోని భవనంలో ఓపీ సేవల కోసం గదులు, ఈసీజీ, ఎక్స్‌రే, దంత పరీక్షలు, డయాగ్నస్టిక్ పరీక్షల కోసం గదులను ఏర్పాటు చేశారు. ఇందుకు కావాల్సిన యంత్ర పరికరాలు, ఫర్నీచర్, సిబ్బందిని సిద్దం చేశారు. కార్పొరేటు ఆస్పత్రులకు దీటుగా ఇక్కడ వైద్య సేవలు అందనున్నాయి. ఇప్పటికే ఒక వైద్యుడితో పాటు సెంటర్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. వెల్‌నెస్ సెంటర్‌ను శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అమర్‌సింగ్ నాయక్, వెల్‌నెస్ సెంటర్ సిబ్బంది పాల్గొంటారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
జర్నలిస్టులు, ఉద్యోగుల సంక్షేమం కోసం..
జిల్లాలోని జర్నలిస్టులు ప్రతి నిత్యం పని ఒత్తిడితో సతమతం అవుతూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వారి సంక్షేమం కోసం జిల్లాలోని జర్నలిస్టులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఈ వెల్‌నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ, ఉచితంగా మందులను అందివ్వడానికి దోహదపడుతుంది. జిల్లా కేంద్రంలో వెల్‌నెస్ సెంటర్ అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయం. ఈ వెల్‌నెస్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావ్
Comments
Please login to add a commentAdd a comment