సాక్షి,సిటీబ్యూరో: జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా , ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన జర్నలిస్ట్‌ల హెల్త్‌స్కీమ్(జేహెచ్‌ఎస్) పాత్రికేయులకు వరంగా మారిందని సీఈవో కె. పద్మ తెలిపారు. ఈ పథకాన్ని ప్రారంభించి 13 నెలలు గడిచిన సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అర్హులైన జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నగదు రహిత వైద్యం
వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ‘ క్యాస్‌లెస్ ట్రీట్‌మెంట్’ అందించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2015 జూలై 22న జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద పాత్రికేయులకు వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ఔట్ పేషెంట్ చికిత్స, నెట్ వర్క్ హాస్పిటల్స్ ద్వారా ఇన్ పేషెంట్ చికిత్స అందజేస్తున్నాం, ఉచితంగా మందులను, వైద్య పరీక్షలు, వైద్యానికి సంబంధించి సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 8,100 మంది జర్నలిస్టులు, 25869 మంది జర్నలిస్టుల కుటుంబసభ్యులు ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోగా వారందరికీ హెల్త్‌కార్డులు పంపిణీ చేశాం.
‘వెల్‌నెస్’ సేవలివీ...
వెల్‌నెస్ సెంటర్లల్లో ల్యాబ్‌లెటరీ తదితర అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాం. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. 2016 డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు 42,252 మంది ఉద్యోగులు, 44128 మంది పెన్షనర్లు, 1778 మంది జర్నలిస్టులు ఈ పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్నారు
22 వేలకుగాను 6 వేల మంది...
రాష్ట్రంలో 22 వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉండగా అందులో 6 వేల మంది మాత్రమే హెల్త్‌కార్డులు పొందారు. కార్డులు పొందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 వేల హెల్త్‌కార్డులు జారీ చేశాం. జర్నలిస్టులంతా హెల్త్‌కార్డులు తీసుకొంటే వారి కుటుంబసభ్యులతో కలుపుకొంటే 50 వేల మందిపైగా ప్రయోజనం కలుగుతుంది.
అన్ని రకాల వ్యాధులకూ వర్తింపు..
అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స అందజేస్తున్నాం. జనరల్ చికిత్స, కార్డియాలజీ, చెస్ట్, నెఫ్రాలాజీ, న్యూరో సర్జరీ, కేన్సర్, మెదడుకు సంబంధించిన సమస్యలతో పాటు మహిళలకు సంబంధించిన అన్ని రకాల జబ్బులకు, ముఖ్యంగా దంత సమస్యలకు అధునాతన చికిత్స లభిస్తుంది. ఫిజియోథెరఫీ సేవలు సైతం అందజేస్తున్నాం. వెల్‌నెస్ సెంటర్లలోనే ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రా స్కానింగ్‌తో పాటు అన్ని రకాల స్కానింగ్‌లు తీస్తారు.
సీఎం ప్రత్యేక శ్రద్ధ: జర్నలిస్టుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏదైనా మీటింగ్‌లో తారసపడితే ముఖ్యమంత్రి జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు ఇచ్చారా.. వాటి పురోగతిపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటారు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
జర్నలిస్టులు ఎప్పుడు సమాజం గురించే ఆలోచిస్తూ, వారి కుటుంబం గురించి పట్టించుకోరు. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే వారికి హెల్త్‌కార్డు గుర్తుకు వస్తుంది. చివరి క్షణంలో మాపై హెల్త్‌కార్డుల కోసం ఒత్తిడి చేస్తారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు, ప్రెస్‌క్లబ్స్‌లు, ప్రెస్ అకాడమీతో చర్చించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందరూ కార్డులు పొంది ప్రాథమిక దశలోనే వ్యాధులకు చికిత్స చేయించుకుంటే మేలు.
రూ. 500 కోట్లతో ప్రాజెక్టు అమలు...
ఏ రాష్ట్రంలో కూడా జర్నలిస్టులకు, ఉద్యోగులు ఇలాంటి ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ ప్రాజెక్ట్‌లు అమలు చేయడం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఇది విజయవంతమయ్యేందుకు జర్నలిస్టులు సహకరించాలి. అందుకే ‘ఓ జర్నలిస్టు ఆలోచించు... స్పందించు.. నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో’ అని కోరుతున్నాం. పత్రిక యాజమాన్యాలు కూడా అక్రిడిటేషన్లు లేని, హెల్త్‌కార్డులు పొందని వారిని గుర్తించాలి. హెల్త్‌కార్డులు ఉంటేనే ఉద్యోగులుగా కొనసాగిస్తామనే నిబంధన విధించాలి. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే 12 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది.
నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్టుల కోసం...
నాన్ అక్రిడిటేషన్ జర్నలస్టులకు కూడా జేహెచ్‌ఎస్ కింద హెల్త్‌కార్డులు జారీ చేయాల్సి ఉంది. డెస్కు జర్నలిస్టులు, కాపీ రైటర్స్, పేజ్ మేకర్స్ ఈ విభాగంలోకి వస్తారు. దాదాపు ఆరు వేల మందికి కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది.
వెల్‌నెస్ సెంటర్లు ఇవీ
జర్నలిస్టులకు చికిత్స అందించేందుకు ఖైరతాబాద్, వనస్థలిపురం, ఏరియా ఆస్పత్రుల్లో, హన్మకొండ మెటర్నిటీ ఆస్పత్రిలో ఇప్పటికే వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభించాం. సంగారెడ్డిలో అత్యాధునిక వసతులతో కొద్దిరోజుల క్రితమే వెల్‌నెస్ సెంటర్ ప్రారంభించాం. త్వరలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్ధిపేట్, ఖమ్మం, హైదరాబాద్‌లో మరో రెండు ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించబోతున్నాం. కూకట్‌పల్లిలో ఒక వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో రోజుకు 800 నుంచి 1000 వరకు, వనస్థలిపురంలో 500 నుంచి 600 వరకు ఓపీ వైద్యసేవలు పొందుతున్నారు.
‘సాక్షి’తో హెల్త్‌స్కీమ్ సీఈవో డాక్టర్ పద్మ
Comments
Please login to add a commentAdd a comment