ట్రస్ట్ లేదా ఇన్సూరెన్స్‌తో ఈహెచ్‌ఎస్‌కు కసరత్తు చేస్తున్నాం
డిజిటల్ ఫ్యామిలీ కార్డులతో అన్ని పథకాలు, సేవలు
ఈ సమాచారానికి సైబర్ దాడుల ముప్పు లేకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తాం
ప్రపంచ బ్యాంకు నిధులొస్తే వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తాం
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు?
దామోదర: ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం.
సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?
దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?
దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు.
సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?
దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్‌లపై దృష్టిసారిస్తాం.
సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?
దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment