cashless treatment
-
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. రోడ్డు ప్రమాద బాధితులకు ఊరట
రోడ్డు ప్రమాదాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు నగదు రహిత చికిత్స అందించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ పథకం అమలు పైలట్ ప్రాతిపదికన ఇప్పటికే ప్రారంభమైంది.ఎలాంటి రోడ్డులోనైనా మోటారు వాహనాల వల్ల సంభవించిన రోడ్డు ప్రమాదాల బాధితులకు నగదు రహిత చికిత్స అందించడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) సహకారంతో కేంద్ర రవాణా శాఖ చండీగఢ్, అస్సాంలలో పైలట్ ప్రాతిపదికన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.ఈ పథకం కింద అర్హులైన బాధితులు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద నమోదైన ఆసుపత్రులలో ట్రామా, పాలీట్రామా కేర్‌కు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీలను ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల కాలానికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు పొందవచ్చు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, ఎంప్యానెల్ ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సమన్వయంతో ఎన్హెచ్ఏ ఈ పథకం అమలుకు బాధ్యత వహిస్తుంది. -
Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
న్యూఢిల్లీ: మోటార్ వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురై క్షతగాత్రులుగా మారినవారికి నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ పథకాన్ని ఛత్తీస్‌గఢ్, అస్సాంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి–జన ఆరోగ్య యోజన(ఏబీపీఎం–జేఏవై) కింద క్షతగాత్రులు ప్రమాదం జరిగిన తేదీ నుంచి వారం రోజులపాటు నిర్దేశిత ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల విలువైన వైద్యం పొందవచ్చని చెప్పారు. నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఓ) భాగస్వామ్యంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. మోటార్ వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 164బీ కింద ఏర్పాటైన మోటార్ వాహనాల ప్రమాధ నిధి నుంచి ఈ పథకానికి అవసరమైన నిధులు సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం!
రోడ్డు మరణాలు, ప్రమాదాల్ని తగ్గించేందకు కేంద్ర రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. జైన్ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ సదస్సులో రోడ్ సెక్రటరీ అనురాగ్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే మూడు లేదా నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా గాయపడిన రోడ్డు ప్రమాద బాధితులందరికీ నగదు రహిత వైద్య చికిత్సను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న అన్ని బ్లాక్స్పాట్లను తొలగించడం గురించి జైన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 4000 ప్రమాదాలకు గురయ్యే ఇంజినీరింగ్ లోపాలను సరిచేశామని అన్నారు. మిగిలిన 5,000 బ్లాక్స్పాట్లకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను రాబోయే మూడు లోపు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. అన్ని డీపీఆర్‌లు మూడు నెలల్లో తయారవవుతాయని, మే 2025 నాటికి అన్ని ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అన్ని ప్రాజెక్టులను ఒకేసారి మంజూరు చేయాలని మేము భావిస్తున్నాము’ అని ఆయన వెల్లడించారు. -
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే ఇది మీకోసమే.. క్యాష్‌లెస్ బెనిఫిట్స్ ఇలా!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం.. అత్యవసర పరిస్థితి ఏర్పడితే హాస్పిటల్లో చికిత్సను నగదు రహితంగా పొందొచ్చనే. సొంతంగా సమకూర్చుకునేంత వెసులుబాటు అందరికీ ఉండదు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అంశాలలో క్యాష్‌లెస్ సదుపాయం కూడా ఒకటి. దాదాపు అన్ని బీమా సంస్థలు నగదు రహిత వైద్య సేవల సదుపాయాన్ని ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేస్తుంటాయి. ఈ క్యాష్‌లెస్ క్లెయిమ్ ప్రక్రియ సాఫీగా సాగిపోవాలి. సంక్లిష్టంగా ఉండకూడదు. కనుక నగదు రహిత క్లెయిమ్‌ల విషయంలో ఇబ్బంది పడకూడదంటే పాలసీదారులు తమవంతుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలన్నీ వివరించే కథనం ఇది... నెట్వర్క్ హాస్పిటల్స్ హెల్త్ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాల్లో హాస్పిటల్ నెట్వర్క్ జాబితా ఒకటి. సదరు బీమా సంస్థ నెట్ వర్క్ పరిధిలో ఎన్ని హాస్పిటల్స్ ఉంటే అంత అనుకూలమని అర్థం చేసుకోవచ్చు. మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో మొత్తం ఎన్ని హాస్పిటల్స్ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయనే వివరాలను బీమా సంస్థ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. ఎక్కువ ఆస్పత్రులు ఉండడం వల్ల సమీపంలోని ఆస్పత్రిలో చేరి నగదు రహిత వైద్య సేవలు పొందే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు నగదు రహిత వైద్య సేవలు పొందే విషయంలో మరి కొన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాలసీ నియమ, నిబంధనలు, మినహాయింపులు, రూమ్ రెంట్ పరిమితులు గురించి కూడా తెలియాలి. డాక్యుమెంట్లు బీమా సంస్థలు జారీ చేసే హెల్త్ కార్డ్‌ను చికిత్స సమయంలో వెంట తీసుకెళ్లాలి. ఫిజికల్ కార్డు లేకపోయినా పాలసీ సాఫ్ట్ కాపీ తీసుకెళ్లినా చాలు. ఆధార్, పాన్ కూడా వెంట ఉంచుకోవాలి. లేదంటే చిరునామా ధ్రువీకరణ ఉండాలి. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో వెంట హెల్త్‌కార్డ్ ఉండేలా చూసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినా, ప్రమాదానికి గురైనా వెంట ఉండే వారు ఆ కార్డ్ ఆధారంగా ఆస్పత్రిలో చేర్పించడం సులభతరం అవుతుంది. మినహాయింపులు/కోపే హాస్పిటల్లో అయిన అన్ని ఖర్చులనూ బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుందని అనుకోవద్దు. డిస్పోజబుల్స్ లేదా కన్జ్యూమబుల్స్ (గ్లోవ్‌లు, కాటన్, సిరంజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు)కు ఎక్కువ శాతం ప్లాన్లు చెల్లింపులు చేయవు. అలాగే, చికిత్సలో భాగంగా రోగి అదనపు సేవలను పొందితే వాటికి అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా భరించాల్సి వస్తుంది. ఇంకా రిజిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేటివ్ లేదా సర్వీస్ చార్జీలకు కూడా చెల్లింపులు రావు. కేర్, మ్యాక్స్ బూపా, డిజిట్, టాటా ఏఐజీ కన్జ్యూమబుల్ రైడర్లను ప్రత్యేకంగా ఆఫర్ చేస్తున్నాయి. హెల్త్ ప్లాన్‌కు అనుబంధంగా ఈ రైడర్ తీసుకుంటే, కన్జ్యూమబుల్స్కు అయ్యే చార్జీలకు కూడా బీమా సంస్థే చెల్లిస్తుంది. హెల్త్ ప్లాన్‌లో కోపే ఆప్షన్ ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. కోపే అంటే క్లెయిమ్ మొత్తంలో నిర్ణీత శాతం (ఉదాహరణకు 10–20 శాతం) పాలసీదారుడే చెల్లించుకోవడం. దీన్ని ఎంపిక చేసుకుంటే పాలసీ ప్రీమియం తగ్గుతుంది. కానీ, ఆస్పత్రిలో చెల్లించే భారం పడుతుంది. కొన్ని ప్లాన్లలో వ్యాధుల వారీ కోపే ఆప్షన్ ఉంటుంది. ఆయా చికిత్సలకు సంబంధించి మాత్రమే కోపే నిబంధన అమలవుతుంది. ఇవి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ కోపే ఆప్షన్ ఎంచుకుంటే తనవంతు చెల్లింపులకు వీలుగా అత్యవసర వైద్య నిధి సమకూర్చుకోవడం అవసరం. రూమ్ రెంట్ పరిమితులు ఆరోగ్య బీమా పాలసీల్లో రూమ్ రెంట్ పరిమితులు ఉండడం సహజం. పాలసీ తీసుకునే సమయంలోనే పరిమితులు లేకుండా ‘ఎనీ రూమ్ టైప్’ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ, దీనికి కొంచెం ప్రీమియం అధికంగా ఉంటుంది. దీనికి బదులు సింగిల్ ప్రైవేటు రూమ్, షేర్డ్ రూమ్ పరిమితులు ఎంపిక చేసుకుంటే, ప్రీమియం కొంత తగ్గుతుంది. పాలసీదారులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ తమ హెల్త్ ప్లాన్ రూమ్ రెంట్ పరిమితి గురించి తప్పకుండా అవగాహనతో ఉండాలి. అప్పుడే హాస్పిటల్లో చేరినప్పుడు పాలసీ అనుమతించిన రూమ్‌లోనే చేరడానికి వీలుంటుంది. ఒకవేళ పాలసీలో చెప్పినదానికి భిన్నమైన రూమ్ సేవలను పొందితే అప్పుడు పాలసీదారుపై చెల్లింపుల భారం పడుతుంది. కొన్ని ప్లాన్లు రూమ్ రెంట్‌ను సమ్ అష్యూరెన్స్‌లో ఒక శాతానికి పరిమితం చేస్తుంటాయి. అంటే రూ.5 లక్షల ప్లాన్‌లో రూ.5,000, రూ.10 లక్షల ప్లాన్‌లో రూ.10,000 చార్జీ (రోజుకు) మించని రూమ్‌లోనే చేరాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు అయిన యనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీల ప్లాన్లలో ఇలాంటి పరిమితులు ఉంటాయి. ఆస్పత్రుల్లో రూమ్‌ను బట్టి రోగికి అందించే చికిత్సలు, సేవల చార్జీలు మారిపోతుంటాయి. ప్రీమియం రూమ్ సేవలు పొందడం వల్ల బిల్లు భారీగా అవుతుంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే బీమా సంస్థలు రూమ్ రెంట్ పరిమితి నిబంధనలు పెడుతుంటాయి. ఉదాహరణకు రూ.5,000 రూమ్ రెంట్ పరిమితి ఉన్న ప్లాన్ తీసుకుని.. రోజుకు రూ.10 వేలు చార్జీ చేసే రూమ్‌లో చేరారని అనుకుందాం. అప్పుడు మిగిలిన రూమ్ రెంట్ రూ.5,000ను పాలసీదారుడే భరించాలి. అంతేకాదు, రూమ్‌లో చికిత్సలకు అయిన వ్యయా ల్లోనూ సగం పాలసీదారుడే చెల్లించాలి. కనుక రూమ్‌రెంట్ పరిమితి ఉన్న ప్లాన్ తీసుకుంటే, ఆ పరిధిలోని రూమ్‌లోనే చేరడం మర్చిపోవద్దు. లేదంటే రూమ్ రెంట్ పరిమితి లేని ప్లాన్‌కు మారిపోవడం లేదా, రూమ్‌రెంట్ వైవర్ రైడర్ తీసుకోవాలి. ముందుగా తెలియజేయాలి.. ఏదైనా ప్రమాదం లేదంటే మరో అత్యవసర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. దగ్గర్లోని నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లడం మంచి నిర్ణయం అవుతుంది. ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్ మరీ దూరంలో ఉండి, రోగి పరిస్థితి సీరియస్‌గా ఉంటే సమీపంలోని ఏదో ఒక ఆస్పత్రికి వెళ్లాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వేరే మార్గం ఉండకపోవచ్చు. కాకపోతే కొన్ని రకాల చికిత్సలు ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునేవి ఉంటాయి. ఉదాహరణకు మోకాలి శస్త్రచికిత్స, హెర్నియా ఆపరేషన్, క్యాటరాక్ట్ సర్జరీ ఇవన్నీ ముందు అనుకుని తీసుకునే చికిత్సలు. ఇలాంటి వాటికి బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ/బీమా మధ్యవర్తి) నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి. హాస్పిటల్లో చేరడానికి వారం ముందు అనుమతి కోరొచ్చు. డాక్టర్ ప్రిస్కిప్షన్, ఇతర ఆధారాలను టీపీఏ లేదా బీమా కంపెనీ కస్టమర్ కేర్‌కు మెయిల్ చేయాలి. కాల్‌సెంటర్‌కు కాల్ చేసి ఇందుకు సంబంధించి వివరాలు పొందొచ్చు. వారు అడిగిన అన్ని వివరాలు, పత్రాలు ఇస్తే అనుమతి మంజూరు అవుతుంది. ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునే చికిత్సలకు అనుమతి విషయమై హాస్పిటల్‌లోని ఇన్సూరెన్స్ విభాగం సిబ్బంది సాయాన్ని తీసుకోవచ్చు. బీమా సంస్థ లేదా టీపీఏ నుంచి నగదు రహిత వైద్య సేవల కోసం అనుమతి లేఖను తీసుకోవాలి. చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు అడ్మిషన్ డెస్క్‌కు ఈ లేఖ సమర్పిస్తే సరిపోతుంది. అత్యవసరంగా చేరినట్టయితే బీమా సంస్థ లేదా టీపీఏకి 24 గంటల్లోపు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్‌కు హెల్త్ ప్లాన్ వివరాలు ఇస్తే వారే బీమా కంపెనీకి సమాచారం ఇస్తారు. దూరం బీమా సంస్థలకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. ఒక ఆస్పత్రిని తన నెట్వర్క్ పరిధిలో చేర్చుకునే ముందు బీమా కంపెనీలు ఎన్నో అంశాలను చూస్తుంటాయి. ప్రభుత్వ గుర్తింపు, చికిత్సల చార్జీలు, సేవల నాణ్యత తదితర అంశాలను పరిగణణలోకి తీసుకుంటాయి. మీ నివాసానికి సమీపంలో ఏఏ ఆసుపత్రి బీమా సంస్థ నెట్వర్క్ పరిధిలో ఉందనే వివరాలను సంబంధిత బీమా కంపెనీ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. బీమా సంస్థ కస్టమర్‌కేర్‌కు కాల్ చేసి అడిగినా వివరాలు అందిస్తారు. నెట్వర్క్ హాస్పిటల్స్ ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఈ జాబితా మారుతుంటుంది. కొన్ని ఆసుపత్రులు జాబితా నుంచి బయటకు వెళ్లిపోయి, కొత్తవి చేరుతుంటాయి. బీమా సంస్థల పోర్టళ్లలో అప్డేటెడ్ వివరాలు అందుబాటులో ఉంటాయి. నెట్వర్క్ జాబితాలో ఉన్నాయంటే సదరు ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలను పొందొచ్చని అర్థం చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్‌ను హాస్పిటల్లో చేరే సమయంలో చూపిస్తు చాలు. హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్ చికిత్స వ్యయాలకు బీమా సంస్థ నుంచి ఆమోదం తీసుకుంటుంది. బీమా కంపెనీ నుంచి ప్రాథమిక ఆమోదం వస్తే చాలు. రోగి నగదు చెల్లించే అవసరం ఏర్పడదు. బీమా సంస్థలే తుది బిల్లును కూడా సెటిల్ చేస్తాయి. పాలసీ నిబంధనల మేరకు కవరేజీ పరిధిలోకి రాని వాటికి మినహాయించి, మిగిలిన బిల్లును పరిష్కరిస్తాయి. అప్పుడు రోగి మిగిలిన మొత్తాన్ని తన వంతుగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బీమా కంపెనీలు హాస్పిటల్ పంపించిన రికార్డుల ఆధారంగా నగదు రహిత సేవలకు అనుమతి ఇవ్వవు. కస్టమర్‌ను రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలంటూ సమాచారం ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. నగదు రహిత సేవల నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకోవడం వల్ల.. బిల్లులు, రీయింబర్స్మెంట్ పత్రాలతో హాస్పిటల్, బీమా కంపెనీల చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సిన శ్రమ తప్పుతుంది. -
YSR Aarogyasri: ఇతర రాష్ట్రాల క్షతగాత్రులకూ చికిత్స.. మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: ఏపీలో రోడ్డు ప్రమాదానికి గురైన ఇతర రాష్ట్రాల వ్యక్తులకూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందనుంది. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 8,000 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు, మరణాలను 15 శాతం తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 14న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురవుతోన్న ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రైవర్లు, రోజువారీ కూలీలు, ప్రయాణికులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సలు అందించేలా చూడాలని సూచించారు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అందించడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు గురయ్యే ఇతర రాష్ట్రాల వ్యక్తులకు సీఎంసీవో కార్డును జారీ చేయడం ద్వారా నగదు రహిత చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందించనుంది. ఇందుకోసం అవసరమైన చర్యలను చేపట్టాలని ఆరోగ్యశ్రీ సీఈవో, రవాణా శాఖ కమిషనర్లను ఆదేశించారు. -
క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరిస్తే.. కుదరదు
కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా కలిగిన వారు సాధారణంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్సలను పొందొచ్చు. కానీ, ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో చాలా ఆస్పత్రులు నగదు చెల్లించేవారికే చికిత్సలు అందిస్తూ బీమా ప్లాన్లపై నగదు రహిత వైద్య సేవలను తిరస్కరిస్తున్నాయి. దీంతో ఐఆర్డీఏఐ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నగదు రహిత కరోనా చికిత్సల క్లెయిమ్‌లను తిరస్కరించొద్దంటూ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాలసీదారులకు నగదు రహిత వైద్య చికిత్సలు అందేలా చూడాలని కోరింది. కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు కరోనా చికిత్సలకు అధిక రేట్లను వసూలు చేయడమే కాకుండా.. నగదునే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రుల వైఖరి వల్ల పాలసీదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రా ణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో నగదు కోసం పాట్లు పడేలా పరిస్థితులను ఆస్పత్రులు మార్చేశాయి. ఇటువంటి ప్రతికూలతలు ఎదురైతే పాలసీదారుల ముందున్న మార్గాలేంటో చూద్దాం... బీమా సంస్థలు, ఆస్పత్రులు కుదుర్చుకున్న సేవల ఒప్పందాన్ని అమలు చేసే దిశగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఇప్పటికే రెండు పర్యాయాలు సర్క్యులర్లను జారీ చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. నిబంధనలను పాటించాలంటూ ఆస్పత్రులను కోరింది. ‘‘నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు పాలసీదారు గుర్తించినట్టయితే.. పాలసీ ఒప్పందం మేరకు ఆయా నెట్వర్క్ ఆస్పత్రిలో నగదు రహిత వైద్యం పాలసీదారుకు అందేలా బీమా సంస్థలు చర్యలు తీసుకోవాలి’’ అని తన ఉత్తర్వుల్లో ఐఆర్డీఏఐ కోరింది. నగదు రహిత వైద్యాన్ని ఆస్పత్రి తిరస్కరిస్తే.. అందుకు వీలు కల్పించాలని కోరుతూ పాలసీదారులు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (బీమా సంస్థ తరఫున క్లెయిమ్ సేవలు అందించే మూడో పక్షం/టీపీఏ)కు అధికారికంగా తెలియజేయాలి. అప్పటికీ నగదు రహిత వైద్యం లభించకపోతే.. ఆస్పత్రికి వ్యతిరేకంగా బీమా సంస్థకు నేరుగా ఫిర్యాదు దాఖలు చేయాలి. నగదు రహిత వైద్యం పాలసీదారులకు ఎంతో శ్రమను తప్పిస్తుంది. కనుక ఒక నెట్వర్క్ ఆస్పత్రి ఈ సేవను తిరస్కరించినట్టయితే.. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ సమయం వేచి చూసే పరిస్థితి ఉండదు. అటువంటి సందర్భాల్లో మరో నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లి నగదు రహిత చికిత్సలను తీసుకోవడం ఒక పరిష్కారం. దీనివల్ల పాలసీదారులు తమ జేబుల నుంచి భారీగా వ్యయం చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఆస్పత్రులు అంగీకరించిన ధరలనే వసూలు చేసేలా చూడాలని కూడా బీమా సంస్థలను ఐఆర్డీఏఐ కోరింది. ‘‘నెట్వర్క్ ఆస్పత్రులు అంగీకరించిన ధరలకే పాలసీదారులకు చికిత్సలు అందించేలా బీమా సంస్థలు చూడాలి. ఎటువంటి అదనపు చార్జీలు తీసుకోకుండా చూడాలి. ఒకవేళ ఒప్పందానికి విరుద్ధంగా నగదు రహిత చికిత్సలకు తిరస్కరిస్తే, ఆయా ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఐఆర్డీఏఐ కో రింది. ఒకవేళ ఆస్పత్రులు అధికంగా చార్జీలు వసూలు చేసినట్టయితే ఆ తర్వాత ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా వాటి సంగతి తేల్చవచ్చు. మంచి ఆస్పత్రి అని భావిస్తుంటే, నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో నగదు చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ పొందడం ఒక్కటే మార్గం. ఇతర ఆస్పత్రులు నగదు రహిత చికిత్సలకు తిరస్కారం ఎదురైన సందర్భాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రికి సైతం వెళ్లొచ్చు. ఎందుకంటే చికిత్సల వ్యయాలను సొంతంగా భరించి, ఆ తర్వాత రీయింబర్స్మెంట్ చేసుకోవడమే కనుక ఎక్కడైనా రిజిస్టర్డ్ హాస్పిటల్లో వైద్య సేవలను పొందొచ్చు. ముఖ్యంగా ఆయా క్లిష్ట సందర్భాల్లో ప్రాణాలను కాపాడుకోవడాన్ని ప్రాధాన్య అంశంగా చూడాలి. అందుకే కీలక సమయంలో కాలయాపనకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించడం మంచిది. నిధులు సర్దుబాటు అయితే అందుబాటులోని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ వచ్చేందుకు నెల వరకు సమయం తీసుకుంటుంది. ఆస్పత్రిపై ఫిర్యాదు నగదు రహిత వైద్యం తిరస్కరణపై ఐఆర్డీఏఐ తీవ్రంగా స్పందించింది. ఎటువంటి ఆటంకాల్లేని సేవలు లభించేందుకు నెట్వర్క్ ఆస్పత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులకు ఏర్పాట్లు చేసుకోవాలని బీమా కంపెనీలకు సూచించింది. పాలసీదారుల ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని.. చట్టపరమైన చర్యల కోసం స్థానిక అధికార యంత్రాంగం దృష్టికి ఆయా ఆస్పత్రుల వ్యవహారాలను తీసుకెళ్లాలని కోరింది. ఒకవేళ ఆస్పత్రుల వ్యవహారశైలి పట్ల సంతృప్తిగా లేకపోతే బీమా సంస్థకు, స్థానిక అధికార యంత్రాగానికి పాలసీదారులు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు దాఖలు ఎలా..? ఫిర్యాదును దాఖలు చేయడమే కాదు.. తగిన పరిష్కారాన్ని పొందడమూ ముఖ్యమే. పాలసీదారులు ముందుగా బీమా సంస్థకు చెందిన పాలసీదారుల ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని సంప్రదించాలి. 15 రోజుల్లోపు బీమా సంస్థ నుంచి సరైన పరిష్కారం లభించకపోయినా, పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోయినా అప్పుడు సమగ్ర ఫిర్యాదుల పరిష్కార విభాగం రూపంలో ఐఆర్డీఏఐ దృష్టికి సమస్యను తీసుకెళ్లొచ్చు. ఈ పోర్టల్‌లో (https://igms.irda. gov.in/) పాలసీదారులు తమ వివరాలతో నమోదు చేసుకోవాలి. అనంతరం లాగిన్ అయ్యి ఫిర్యాదును దాఖలు చేయడంతోపాటు పురోగతిని తెలుసుకోవచ్చు. అలాగే ఈ మెయిల్ (complaints@irdai.gov.in) రూపంలో నూ ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదు చేయవచ్చు. 1800 4254 732 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించొచ్చు. -
గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రిలో చేరిస్తే...
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గోల్డెన్ అవర్‌లో (గంటలోపు) ఆస్పత్రిలో చేరిన బాధితులకు నగదు రహిత వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో ఓ పథకాన్ని అమలు చేయనున్నాయి. ఇందుకోసం సూచనలు, సలహాలు అందించాలని కేంద్రం.. రాష్ట్రాల రవాణా శాఖలకు గతేడాది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పంపింది. రెండురోజుల కిందట ఢిల్లీలో జరిగిన ట్రాన్స్‌పోర్టు డెవలప్మెంట్ కౌన్సిల్ (టీడీసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ ఈ పథకంపై రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన గంటలోపు బాధితులను ఆస్పత్రిలో చేరిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఆస్పత్రిలో చేర్చడం ఆలస్యం కారణంగా ఏటా వేలాదిమంది ప్రాణాలు పోతున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో నగదు రహిత వైద్యం అందించాలన్న మోటారు వాహన చట్టం సెక్షన్ 162 (2)ను కేంద్రం అమలు చేయనుంది. ఈ చట్టంలోని సెక్షన్ 164 బీ ప్రకారం యాక్సిడెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులు ఈ పథకం ద్వారా సెక్షన్ 163 కింద లబ్ధి పొందవచ్చు. పరిహారనిధి ఏర్పాటు బీమా వాహనాలకు, బీమా లేని వాహనాలకు, హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లకు పరిహారనిధి (కాంపన్సేషన్ ఫండ్) ఏర్పాటు చేస్తారు. బీమా వాహనాలు ప్రమాదానికి కారణమైతే నగదు రహిత వైద్యం అందించేందుకు అన్ని బీమా కంపెనీలు కనిష్టనిధి అందించాలి. బీమా లేని వాహనాలైతే నేషనల్ హైవే ఫీజు కింద కేంద్రం సెస్ వసూలు చేసిన సొమ్ములో కేటాయించాలి. హిట్ అండ్ రన్ పరిహారనిధిని సొలాషియం స్కీం కింద జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. థర్డ్ పార్టీ ప్రీమియం వసూలు చేసే బీమా కంపెనీలు తమ వ్యాపారంలో 0.1 శాతం సొమ్ము కేటాయించాలి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రిలో చేరితే రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందించవచ్చు. చికిత్స వ్యయం రూ.1.50 లక్షల కంటే ఎక్కువైతే రూ.5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కేంద్రం నగదు రహిత వైద్యం ఖర్చు భరిస్తుంది. ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) దేశ వ్యాప్తంగా 22 వేల ఆస్పత్రులను రిఫరల్ ఆస్పత్రులుగా గుర్తించింది. ఈ పథకం కింద ఏ ఆస్పత్రి అయినా దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అందించే యాక్సిడెంట్ ఫండ్‌ను జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నుంచి కొంత సమకూరుస్తుంది. స్టేట్ హెల్త్ ఏజెన్సీకి భాగస్వామ్యం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ (మోర్త్)కు పలు సూచనలను గతంలోనే పంపినట్లు టీడీసీ సమావేశంలో ఏపీ రవాణా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్టేట్ హెల్త్ ఏజెన్సీని కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ కమిటీకి అనుబంధంగా రవాణా శాఖ, పోలీస్, వైద్యశాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: 7 సార్లు చక్కర్లు కొట్టి వెనుదిరిగిన విమానం 69 పట్టణాల్లో 54,056 ఇళ్లు.. రూ.392.23 కోట్లు ఆదా -
పాత్రికేయులకు పెన్నిధి
సాక్షి,సిటీబ్యూరో: జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా , ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన జర్నలిస్ట్‌ల హెల్త్‌స్కీమ్(జేహెచ్ఎస్) పాత్రికేయులకు వరంగా మారిందని సీఈవో కె. పద్మ తెలిపారు. ఈ పథకాన్ని ప్రారంభించి 13 నెలలు గడిచిన సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అర్హులైన జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగదు రహిత వైద్యం వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ‘ క్యాస్‌లెస్ ట్రీట్మెంట్’ అందించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 2015 జూలై 22న జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద పాత్రికేయులకు వెల్నెస్ సెంటర్ల ద్వారా ఔట్ పేషెంట్ చికిత్స, నెట్ వర్క్ హాస్పిటల్స్ ద్వారా ఇన్ పేషెంట్ చికిత్స అందజేస్తున్నాం, ఉచితంగా మందులను, వైద్య పరీక్షలు, వైద్యానికి సంబంధించి సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 8,100 మంది జర్నలిస్టులు, 25869 మంది జర్నలిస్టుల కుటుంబసభ్యులు ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోగా వారందరికీ హెల్త్‌కార్డులు పంపిణీ చేశాం. ‘వెల్నెస్’ సేవలివీ... వెల్నెస్ సెంటర్లల్లో ల్యాబ్లెటరీ తదితర అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాం. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. 2016 డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు 42,252 మంది ఉద్యోగులు, 44128 మంది పెన్షనర్లు, 1778 మంది జర్నలిస్టులు ఈ పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్నారు 22 వేలకుగాను 6 వేల మంది... రాష్ట్రంలో 22 వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉండగా అందులో 6 వేల మంది మాత్రమే హెల్త్‌కార్డులు పొందారు. కార్డులు పొందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 వేల హెల్త్‌కార్డులు జారీ చేశాం. జర్నలిస్టులంతా హెల్త్‌కార్డులు తీసుకొంటే వారి కుటుంబసభ్యులతో కలుపుకొంటే 50 వేల మందిపైగా ప్రయోజనం కలుగుతుంది. అన్ని రకాల వ్యాధులకూ వర్తింపు.. అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స అందజేస్తున్నాం. జనరల్ చికిత్స, కార్డియాలజీ, చెస్ట్, నెఫ్రాలాజీ, న్యూరో సర్జరీ, కేన్సర్, మెదడుకు సంబంధించిన సమస్యలతో పాటు మహిళలకు సంబంధించిన అన్ని రకాల జబ్బులకు, ముఖ్యంగా దంత సమస్యలకు అధునాతన చికిత్స లభిస్తుంది. ఫిజియోథెరఫీ సేవలు సైతం అందజేస్తున్నాం. వెల్నెస్ సెంటర్లలోనే ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రా స్కానింగ్‌తో పాటు అన్ని రకాల స్కానింగ్‌లు తీస్తారు. సీఎం ప్రత్యేక శ్రద్ధ: జర్నలిస్టుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏదైనా మీటింగ్‌లో తారసపడితే ముఖ్యమంత్రి జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు ఇచ్చారా.. వాటి పురోగతిపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి జర్నలిస్టులు ఎప్పుడు సమాజం గురించే ఆలోచిస్తూ, వారి కుటుంబం గురించి పట్టించుకోరు. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే వారికి హెల్త్‌కార్డు గుర్తుకు వస్తుంది. చివరి క్షణంలో మాపై హెల్త్‌కార్డుల కోసం ఒత్తిడి చేస్తారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు, ప్రెస్క్లబ్స్లు, ప్రెస్ అకాడమీతో చర్చించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందరూ కార్డులు పొంది ప్రాథమిక దశలోనే వ్యాధులకు చికిత్స చేయించుకుంటే మేలు. రూ. 500 కోట్లతో ప్రాజెక్టు అమలు... ఏ రాష్ట్రంలో కూడా జర్నలిస్టులకు, ఉద్యోగులు ఇలాంటి ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ప్రాజెక్ట్‌లు అమలు చేయడం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఇది విజయవంతమయ్యేందుకు జర్నలిస్టులు సహకరించాలి. అందుకే ‘ఓ జర్నలిస్టు ఆలోచించు... స్పందించు.. నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో’ అని కోరుతున్నాం. పత్రిక యాజమాన్యాలు కూడా అక్రిడిటేషన్లు లేని, హెల్త్‌కార్డులు పొందని వారిని గుర్తించాలి. హెల్త్‌కార్డులు ఉంటేనే ఉద్యోగులుగా కొనసాగిస్తామనే నిబంధన విధించాలి. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే 12 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్టుల కోసం... నాన్ అక్రిడిటేషన్ జర్నలస్టులకు కూడా జేహెచ్ఎస్ కింద హెల్త్‌కార్డులు జారీ చేయాల్సి ఉంది. డెస్కు జర్నలిస్టులు, కాపీ రైటర్స్, పేజ్ మేకర్స్ ఈ విభాగంలోకి వస్తారు. దాదాపు ఆరు వేల మందికి కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. వెల్నెస్ సెంటర్లు ఇవీ జర్నలిస్టులకు చికిత్స అందించేందుకు ఖైరతాబాద్, వనస్థలిపురం, ఏరియా ఆస్పత్రుల్లో, హన్మకొండ మెటర్నిటీ ఆస్పత్రిలో ఇప్పటికే వెల్నెస్ సెంటర్లు ప్రారంభించాం. సంగారెడ్డిలో అత్యాధునిక వసతులతో కొద్దిరోజుల క్రితమే వెల్నెస్ సెంటర్ ప్రారంభించాం. త్వరలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్ధిపేట్, ఖమ్మం, హైదరాబాద్‌లో మరో రెండు ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించబోతున్నాం. కూకట్‌పల్లిలో ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోజుకు 800 నుంచి 1000 వరకు, వనస్థలిపురంలో 500 నుంచి 600 వరకు ఓపీ వైద్యసేవలు పొందుతున్నారు. ‘సాక్షి’తో హెల్త్‌స్కీమ్ సీఈవో డాక్టర్ పద్మ -
ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం
-
ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం
నేటి నుంచి సేవలు షురూ - కార్పొరేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం - ఆరోగ్య కార్డులుంటే నగదు రహిత వైద్యం - శస్త్రచికిత్సల ప్యాకేజీ 40 శాతానికి పెంపు - వెల్నెస్ కేంద్రాల్లో పరీక్షించుకున్నాకే ‘కార్పొరేట్’కు సిఫారసు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఎట్టకేలకు నగదు రహిత కార్పొరేట్ వైద్యానికి అడుగు పడింది. ఆదివారం నుంచి రాష్ట్రంలోని ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఆయా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ మేరకు కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో శనివారం ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) సీఈవో డాక్టర్ కల్వకుంట్ల పద్మ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు, మరో 3 లక్షలకుపైగా రిటైర్డ్ ఉద్యోగులు, దాదాపు 25 వేల మంది జర్నలిస్టులున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి 20 లక్షల మందికిపైగా ఉంటారు. నగదు రహిత ఆరోగ్య కార్డున్న ఉద్యోగులు, జర్నలిస్టులు మొత్తం 1,885 వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకునేం దుకు అవకాశం ఉంది. వివిధ వ్యాధులకు ప్రస్తుతమున్న ప్యాకేజీ సొమ్మును 30 నుంచి 40 శాతం వరకు పెంచుతూ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఈజేహెచ్ఎస్ సీఈవో పద్మ ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని వ్యాధుల ప్యాకేజీలు పెంచామని... మరికొన్నింటిని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య ప్యాకేజీ ప్రకారం సరిచేశామని ఆమె తెలిపారు. కార్పొరేట్ ఓపీ సేవలు నో... రిఫర్ చేస్తేనే ఐపీ సేవలు నగదు రహిత ఆరోగ్య కార్డులను కార్పొరేట్ ఆసుపత్రులు సైతం అనుమతిస్తాయి. అయితే కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు మాత్రం నగదు రహితంగా ఉండవు. కేవలం ఇన్ పేషెంట్ (ఐపీ) సేవలే ఉంటాయి. నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడం కుదరదు. ముందుగా ప్రభుత్వం నెలకొల్పే వెల్నెస్ కేంద్రాల్లో చూపించుకున్నాక అక్కడి డాక్టర్లు రిఫర్ చేస్తేనే కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్స చేస్తాయి. వెల్నెస్ కేంద్రాలను ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో... హైదరాబాద్‌లో పలుచోట్ల నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెల్నెస్ కేంద్రాల్లో ప్రభుత్వ వైద్యులుంటారు. అక్కడ పరీక్షలు నిర్వహిస్తారు. మందులు ఉచితంగా ఇస్తారు. అక్కడ నయం కాని జబ్బులుంటేనే కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. నేరుగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లొచ్చు... వెల్నెస్ కేంద్రాన్ని ఖైరతాబాద్‌లో శనివారం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో అత్యాధునిక డయాగ్నస్టిక్ పరికరాలను అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్యులనే కాకుండా అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌లో నిష్ణాతులైన వైద్యులను నియమిస్తామన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అత్యవసర వైద్యం చేయించుకోవాల్సి వస్తే నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. అలాగే ఏ సమయంలోనైనా గుండెపోటు వంటివి వస్తే కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు నేరుగా వెళ్లడానికి వీలుంది. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఏడాదికోసారి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎగ్జిక్యూటివ్ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని విడతల వారీగా అమలుచేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
పైసలుంటేనే.. 'పల్స్' పట్టేది
- ప్రభుత్వ ఉద్యోగులకు అందని నగదు రహిత వైద్య సేవలు - ఆరోగ్య కార్డులపై చికిత్స చేయలేమని చేతులెత్తేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు - పట్టించుకోని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు - ప్యాకేజీ సొమ్ము 40% పెంచాలని పట్టు.. ఏడాదిగా తేలని వివాదం.. - నెట్వర్క్ ఆసుపత్రులకు సుమారు రూ.100 కోట్లు బకాయి పడ్డ ప్రభుత్వం - ఉచిత ఓపీ సేవలకూ గ్రహణం.. నిమ్స్‌లోనూ అదే తీరు - డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నా.. రీయింబర్స్మెంట్ రాక తిప్పలు - ఇప్పటిదాకా డబ్బులు కట్టి చికిత్స చేయించుకున్న వారు లక్ష మందికి పైనే.. - సర్కారుపై పోరుకు ఉద్యోగ సంఘాల కసరత్తు సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి గుండె ఆపరేషన్ కోసం నిమ్స్‌కు వెళ్లారు. అయితే నగదు రహిత ఆరోగ్య కార్డులపై చికిత్స చేయలేమని ఆసుపత్రి వర్గాలు చేతులెత్తేశాయి. ఆలస్యం కావడంతో ఆ ఉద్యోగి చనిపోయారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ టీచర్‌కు కిడ్నీల వ్యాధి వచ్చింది. డయాలసిస్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అందుకోసం నిమ్స్‌కు వస్తే.. నగదు రహిత ఆరోగ్య కార్డు కింద డయాలసిస్చేయలేమని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. ...నగదు రహిత వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆరోగ్య కార్డులు ఉద్యోగులను ఏ మేరకు ఆదుకుంటున్నాయో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు! నగదు రహిత చికిత్సలు అందక వేలాది మంది ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. సొంతంగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకున్నా.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రీయింబర్స్మెంట్ రాక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ప్రైవేటు ఆసుపత్రులు నగదు రహిత చికిత్సకు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో ఉచిత ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను ప్రారంభించినా.. ఆయా ఆసుపత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులైతే నగదు రహిత వైద్యాన్ని ఏమాత్రం అమలు చేయడం లేదు. ప్యాకేజీ కింద ఇచ్చే సొమ్మును 40 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏడాదిగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. బోధనాసుపత్రులు మినహా రాష్ట్రంలో ఏ ఆసుపత్రులూ నగదు రహిత ఆరోగ్య కార్డులను పట్టించుకోవడం లేదు. దీంతో నగదు రహిత వైద్యం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. సొంత డబ్బులతోనే.. రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు, మరో లక్షన్నర మందికిపైగా పెన్షన్‌దారులున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే 22 లక్షల మందికిపైగా ఉన్నారు. వారందరి కోసం ప్రభుత్వం నగదు రహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న దాదాపు 200 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఉద్యోగులందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలి. నగదు రహిత కార్డులు ఇచ్చిన మొదటి రెండు మూడు నెలల వరకు ఆసుపత్రులు బాగానే సహకరించాయి. కానీ ప్రభుత్వం ఆయా ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలను నిలిపివేశాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కారు దాదాపు 100 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులైతే ప్యాకేజీ సొమ్ము పెంచకుండా నగదు రహిత వైద్యం అందించలేమని స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య కార్డుల కింద ఇప్పటివరకు 10 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే వైద్య సేవలు పొందారు. పది నెలలుగా ఆరోగ్య కార్డుల ద్వారా నగదు రహిత వైద్య సేవలను నిలిపివేయడంతో.. లక్ష మందికిపైగా ఉద్యోగులు డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకున్నారు. ఉచిత ఓపీ సేవలూ అందడం లేదు ఓపీ సేవలను ఉచితంగా అందించాలని ఉద్యోగులు చేసిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం ఇటీవల ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు నెలల కిందట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిమ్స్‌లో, మరో ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సేవలను ప్రారంభించారు. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉద్యోగుల కోసమే ప్రత్యేక ఓపీ సేవలు అందించాలి. కానీ ఏ ఒక్క ఆసుపత్రిలోనూ ఈ సేవలు అందడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు. స్వయంగా మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించిన నిమ్స్‌లోనే సేవలకు దిక్కులేదని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బేఖాతరు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రీమియం చెల్లిస్తామన్నా అదే గోస కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, అన్ని ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ సేవలకు తాము ప్రీమియం చె ల్లిస్తామని ఉద్యోగులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఆరోగ్య కార్డులను సక్రమంగా అమలు చేయడం లేదని అఖిల భారత ఉపాధ్యాయుల సంఘం (ఏఐటీఓ) ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నిమ్స్ ఆసుపత్రి కూడా ఉద్యోగులకు సహకరించడంలేదని విమర్శించారు. ఉచిత ఓపీ సేవలకు ఆదేశాలు రాలేదంటూ నిమ్స్ వర్గాలు ఉద్యోగులను వెనక్కు పంపిస్తున్నాయన్నారు. -
నిమ్స్‌లో క్యాష్‌లెస్ ఓపీ సేవలు షురూ
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం...అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు - వైద్య మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దార్లకు నిమ్స్‌లో కార్పొరేట్ ఆస్పత్రుల కన్నా మరింత మెరుగైన వైద్యసేవలు అందించి, వాటి గుత్తాధిపత్యానికి గుణపాఠం చెబుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల కోసం ప్రభుత్వం రాజధానిలోని ‘నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్’ (నిమ్స్)లో ఏర్పాటు చేసిన ‘క్యాష్‌లెస్ అవుట్ పేషంట్’ సేవల విభాగాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఈహెచ్ఎస్ రిజిస్ట్రేషన్ కౌంటర్‌తో పాటు కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ విభాగాలు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, రుమటాలజీ, డెర్మటాలజీ, వాస్క్యూలర్ సర్జరీ ఓపీలను రోగులకు అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కింద ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దార్లకు ఓపీ, ఐపీ సేవలన్నీ ఉచితంగా అందించేందుకు ఇప్పటికే 200కు పైగా ఆస్పత్రులు ముందుకు వచ్చాయి. మిగతా 12 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా ఈ పథకం కిందకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈహెచ్ఎస్ లబ్ధిదారులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4-6 గంటల వరకు... ఉస్మానియా, గాంధీ సహా అన్ని జిల్లా, బోధనాసుపత్రుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈహెచ్ఎస్ అమలుపై ప్రతి నెలా సమీక్ష నిర్వహించి లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసి, రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాం’ అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ఈహెచ్ఎస్ పథకంలో భాగంగా ఉచిత వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రుల వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, ఆరోగ్యశ్రీ సీఈఓ చంద్రశేఖర్, డీఎంఈ రమణి, నిమ్స్ డెరైక్టర్ కె.మనోహర్, టీఎన్జీఓ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స
‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు * ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు రోడ్డు భద్రతా బిల్లు తెస్తున్నాం సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఏటేటా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాద మరణాలపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే రోడ్డు రవాణా భద్రత బిల్లు తీసుకువస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి నగదు రహిత వైద్యం అందజేస్తామని వెల్లడించారు. ఆదివారం రేడియోలో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ ఈ మేరకు తెలిపారు. అనేక సామాజికాంశాలపై మాట్లాడిన మోదీ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభనపై మాత్రం స్పందించలేదు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పంద్రాగస్టు ప్రసంగంలో ఏయే అంశాలపై మాట్లాడాలో సూచించాలని ప్రజలను కోరారు. ఇటీవల ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో ఓ బాధితుడు నెత్తురోడుతూ పడిపోయినా ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోయారని, ఈ ఘటన తర్వాత ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు పూనుకోవాలంటూ తనను అనేక మంది కోరారన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ♦ దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. ఈ ప్రమాదాల్లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. మృతుల్లో మూడోవంతు 15 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్నవారే. ♦ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్తగా బిల్లు తీసుకురావడంతోపాటు జాతీయ రోడ్డు భద్రతా విధానం, రోడ్డు భద్రత కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు చేపడతాం. ఈ కార్యక్రమం కింద ప్రమాదం జరిగిన తొలి 50 గంటలలోపు నగదుతో పనిలేకుండా చికిత్స అందిస్తాం. ♦ దేశవ్యాప్తంగా ప్రమాదాలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1033తోపాటు అంబులెన్సు వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ♦ రైల్వే ఐఆర్సీటీసీలో టికెట్లు తీసుకోడానికి వికలాంగులకు కోటా పెట్టాలని కాన్పూర్‌కు చెందిన అఖిలేష్ వాజపేయి చేసిన సూచన మేరకు ఆ విధానాన్ని అమలు చేశాం. కార్గిల్ అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నా... కార్గిల్ యుద్ధ అమరవీరులకు మోదీ ‘మన్‌కీ బాత్’లో, ట్విటర్లో నివాళులు అర్పించారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీరులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. భారత సాయుధ దళాల శౌర్యానికి, త్యాగానికి ఈయుద్ధం ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ విజయంలో దేశంలోని ప్రతి గ్రామం, నగరం వంతు పాత్ర ఉందని ఉద్ఘాటించారు. ఈ యుద్ధం కేవలం సరిహద్దులో జరిగిన పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదని, ఇందులో దేశంలోని ప్రతి ఒక్క గ్రామం, ఒక్క నగరం కూడా తమ వంతు పాత్రను నిర్వహించాయని అన్నారు. కార్గిల్‌లో మన ఒక్కో సైనికుడు వంద మంది శత్రు సైనికులకు సమానమని నిరూపించారని ఆయన కొనియాడారు. -
హెల్త్ కార్డుల విధివిధానాలు విడుదల
హైదరాబాద్: ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించిన విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేలా పథకం రూపొందించినట్టు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రుల్లో ఉద్యోగులకు వైద్య సేవలు అందించనుంది. 60 శాతం వైద్య సేవలు ప్రభుత్వాసుపత్రుల్లోనే అందిస్తామని నిబంధన విధించింది. ఆరు నెలల తర్వాత హెల్త్ కార్డుల పథకాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వం గుర్తించిన ఏ ఆసుపత్రిలోనైనా హెల్త్ కార్డు చూపించి పూర్తిస్థాయి వైద్య సేవలు పొందవచ్చు. సర్కారు గుర్తించిన 1,885 రోగాలకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్.. ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు.