నిమ్స్‌లో క్యాష్‌లెస్ ఓపీ సేవలు షురూ
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం...అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు
- వైద్య మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దార్లకు నిమ్స్‌లో కార్పొరేట్ ఆస్పత్రుల కన్నా మరింత మెరుగైన వైద్యసేవలు అందించి, వాటి గుత్తాధిపత్యానికి గుణపాఠం చెబుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల కోసం ప్రభుత్వం రాజధానిలోని ‘నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్’ (నిమ్స్)లో ఏర్పాటు చేసిన ‘క్యాష్‌లెస్ అవుట్ పేషంట్’ సేవల విభాగాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఈహెచ్‌ఎస్ రిజిస్ట్రేషన్ కౌంటర్‌తో పాటు కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ విభాగాలు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, రుమటాలజీ, డెర్మటాలజీ, వాస్క్యూలర్ సర్జరీ ఓపీలను రోగులకు అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) కింద ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దార్లకు ఓపీ, ఐపీ సేవలన్నీ ఉచితంగా అందించేందుకు ఇప్పటికే 200కు పైగా ఆస్పత్రులు ముందుకు వచ్చాయి. మిగతా 12 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా ఈ పథకం కిందకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఈహెచ్‌ఎస్ లబ్ధిదారులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4-6 గంటల వరకు... ఉస్మానియా, గాంధీ సహా అన్ని జిల్లా, బోధనాసుపత్రుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈహెచ్‌ఎస్ అమలుపై ప్రతి నెలా సమీక్ష నిర్వహించి లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసి, రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాం’ అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ఈహెచ్‌ఎస్ పథకంలో భాగంగా ఉచిత వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రుల వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, ఆరోగ్యశ్రీ సీఈఓ చంద్రశేఖర్, డీఎంఈ రమణి, నిమ్స్ డెరైక్టర్ కె.మనోహర్, టీఎన్‌జీఓ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ పాల్గొన్నారు.