- ప్రభుత్వ ఉద్యోగులకు అందని నగదు రహిత వైద్య సేవలు
- ఆరోగ్య కార్డులపై చికిత్స చేయలేమని చేతులెత్తేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు
- పట్టించుకోని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు
- ప్యాకేజీ సొమ్ము 40% పెంచాలని పట్టు.. ఏడాదిగా తేలని వివాదం..
- నెట్‌వర్క్ ఆసుపత్రులకు సుమారు రూ.100 కోట్లు బకాయి పడ్డ ప్రభుత్వం
- ఉచిత ఓపీ సేవలకూ గ్రహణం.. నిమ్స్‌లోనూ అదే తీరు
- డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నా.. రీయింబర్స్‌మెంట్ రాక తిప్పలు
- ఇప్పటిదాకా డబ్బులు కట్టి చికిత్స చేయించుకున్న వారు లక్ష మందికి పైనే..
- సర్కారుపై పోరుకు ఉద్యోగ సంఘాల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి గుండె ఆపరేషన్ కోసం నిమ్స్‌కు వెళ్లారు. అయితే నగదు రహిత ఆరోగ్య కార్డులపై చికిత్స చేయలేమని ఆసుపత్రి వర్గాలు చేతులెత్తేశాయి. ఆలస్యం కావడంతో ఆ ఉద్యోగి చనిపోయారు.
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ టీచర్‌కు కిడ్నీల వ్యాధి వచ్చింది. డయాలసిస్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అందుకోసం నిమ్స్‌కు వస్తే.. నగదు రహిత ఆరోగ్య కార్డు కింద డయాలసిస్చేయలేమని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.
...నగదు రహిత వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆరోగ్య కార్డులు ఉద్యోగులను ఏ మేరకు ఆదుకుంటున్నాయో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు! నగదు రహిత చికిత్సలు అందక వేలాది మంది ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. సొంతంగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకున్నా.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రీయింబర్స్‌మెంట్ రాక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ప్రైవేటు ఆసుపత్రులు నగదు రహిత చికిత్సకు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో ఉచిత ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను ప్రారంభించినా.. ఆయా ఆసుపత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులైతే నగదు రహిత వైద్యాన్ని ఏమాత్రం అమలు చేయడం లేదు. ప్యాకేజీ కింద ఇచ్చే సొమ్మును 40 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏడాదిగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. బోధనాసుపత్రులు మినహా రాష్ట్రంలో ఏ ఆసుపత్రులూ నగదు రహిత ఆరోగ్య కార్డులను పట్టించుకోవడం లేదు. దీంతో నగదు రహిత వైద్యం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి.
సొంత డబ్బులతోనే..
రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు, మరో లక్షన్నర మందికిపైగా పెన్షన్‌దారులున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే 22 లక్షల మందికిపైగా ఉన్నారు. వారందరి కోసం ప్రభుత్వం నగదు రహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న దాదాపు 200 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఉద్యోగులందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలి. నగదు రహిత కార్డులు ఇచ్చిన మొదటి రెండు మూడు నెలల వరకు ఆసుపత్రులు బాగానే సహకరించాయి. కానీ ప్రభుత్వం ఆయా ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలను నిలిపివేశాయి. నెట్‌వర్క్ ఆసుపత్రులకు సర్కారు దాదాపు 100 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులైతే ప్యాకేజీ సొమ్ము పెంచకుండా నగదు రహిత వైద్యం అందించలేమని స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య కార్డుల కింద ఇప్పటివరకు 10 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే వైద్య సేవలు పొందారు. పది నెలలుగా ఆరోగ్య కార్డుల ద్వారా నగదు రహిత వైద్య సేవలను నిలిపివేయడంతో.. లక్ష మందికిపైగా ఉద్యోగులు డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకున్నారు.
ఉచిత ఓపీ సేవలూ అందడం లేదు
ఓపీ సేవలను ఉచితంగా అందించాలని ఉద్యోగులు చేసిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం ఇటీవల ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు నెలల కిందట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిమ్స్‌లో, మరో ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సేవలను ప్రారంభించారు. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉద్యోగుల కోసమే ప్రత్యేక ఓపీ సేవలు అందించాలి. కానీ ఏ ఒక్క ఆసుపత్రిలోనూ ఈ సేవలు అందడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు. స్వయంగా మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించిన నిమ్స్‌లోనే సేవలకు దిక్కులేదని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బేఖాతరు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
ప్రీమియం చెల్లిస్తామన్నా అదే గోస
కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, అన్ని ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ సేవలకు తాము ప్రీమియం చె ల్లిస్తామని ఉద్యోగులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఆరోగ్య కార్డులను సక్రమంగా అమలు చేయడం లేదని అఖిల భారత ఉపాధ్యాయుల సంఘం (ఏఐటీఓ) ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నిమ్స్ ఆసుపత్రి కూడా ఉద్యోగులకు సహకరించడంలేదని విమర్శించారు. ఉచిత ఓపీ సేవలకు ఆదేశాలు రాలేదంటూ నిమ్స్ వర్గాలు ఉద్యోగులను వెనక్కు పంపిస్తున్నాయన్నారు.
పైసలుంటేనే.. 'పల్స్' పట్టేది
Published Mon, Dec 14 2015 8:25 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement