స్పౌజ్, హెల్త్, మ్యూచువల్ టాన్స్‌ఫర్లకు సర్కారు అనుమతి
ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు మాత్రమే బదిలీ
నేటి నుంచి మ్యూచువల్ బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ
డిసెంబర్ 31 నాటికి స్పౌజ్,హెల్త్ కేటగిరీల కింద బదిలీ పూర్తి
మంత్రివర్గ ఉపసంఘంసిఫార్సుల ఆధారంగా ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా జీవో–317 కింద గతంలో కొత్త లోకల్ కేడర్లకు కేటాయించిన ఉద్యోగులను స్పౌజ్ కేటగిరీ, పరస్పర బదిలీలు, అనారోగ్య కారణాల కింద వేరే లోకల్ కేడర్లకు మళ్లీ బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. బదిలీలను డిసెంబర్ 31లోగా పూర్తిచేయాలని గడువు విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత లోకల్ కేడర్ల నుంచి కొత్త లోకల్ కేడర్లకు గత ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం 2021 డిసెంబర్ 6న జీవో 317ను జారీ చేసింది. ఈ ప్రక్రియలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని సుదూర ప్రాంతాల్లోని కేడర్లకు వెళ్లిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో జీవో–317, జీవో–56 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు తాజాగా మూడు కేటగిరీల కింద కేడర్ మార్పునకు అనుమతిచ్చింది.
ఇక భార్యాభర్తలు ఒకేచోట!
రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే భార్యాభర్తలను ఒకవేళ వే ర్వేరు లోకల్ కేడర్లకు కేటాయిస్తే కేడర్ మార్పును కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వారికి అవకా శం కల్పిస్తామని జీవో–317లో ప్రభుత్వం పేర్కొంటోంది. పాలనావసరాలు, ఖాళీలకు లోబడి భార్యాభర్తలిద్దరినీ ఒకే కేడర్‌కు కేటాయిస్తామని హామీ ఇ చ్చింది. కొన్ని శాఖల్లో దీన్ని అమలు చేయలేదు.
చాలామంది ఉద్యోగులు స్పౌజ్ కేటగిరీ కింద కేడర్ మార్పుకు దరఖాస్తు చేసుకున్నా పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రివర్గం ఈ అంశాన్ని పరిశీలించి ఖాళీలకు లోబడి గరిష్టంగా సాధ్యమైనంత వరకు కేడర్ మార్పునకు అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. సంబంధిత విభాగాధిపతుల నుంచి ప్రతిపాదనలు, సిఫార్సులను సేకరించి డిసెంబర్ 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది.
నేటి నుంచి పరస్పర బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ..
ఒకే శాఖలో ఒకే కేటగిరీ పోస్టులను కలిగిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు లోకల్ కేడర్లలో పనిచేస్తుంటే వారిని ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు పరస్పర బదిలీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా మళ్లీ కొత్తగా పరస్పర బదిలీలకు దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించింది. ఇందుకు ప్రత్యేక వెబ్‌పోర్టల్ (po2018mutualtransfers. telangana.gov.in) ను రూపొందించింది.
ఎప్పటిలోగా ఈ బదిలీలను పూర్తి చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఒకే యాజమాన్యం కింద ఒకే కేటగిరీ పోస్టులో ఉండి ఒకే సబ్జెక్టును ఒకే మీడియంలో బోధిస్తున్న ఉపాధ్యాయు లు, ప్రధానోపాధ్యాయులు మాత్రమే ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు పరస్పర బదిలీకి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్, ఇతర స్థానికసంస్థల పాఠశాలల్లోని బోధనేతర ఉద్యోగులను పరస్పర బదిలీల్లో భాగంగా మరో లోకల్ కేడర్ పరిధిలోని సంబంధిత జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థల్లోని పాఠశాలలకు మాత్రమే బదిలీ చేస్తామని తెలిపింది. పరస్పర బదిలీల కింద వచ్చే ఉద్యోగులను కొత్త లోకల్ కేడర్ సీనియారిటీ జాబితాలో చివరి రెగ్యులర్ ఉద్యోగి తర్వాత చివరి ర్యాంకును కేటాయిస్తామని స్పష్టం చేసింది.
అనారోగ్య కారణాల కిందబదిలీలకు పచ్చజెండా..
ఆరోగ్య కారణాల కింద ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు బదిలీ కోరుతూ ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల కార్యదర్శులు పరీక్షించి అర్హులైన ఉద్యోగుల కేడర్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
70 శాతం, ఆపై వైకల్యం కలిగిన ఉద్యోగులు, కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు ఉద్యోగులు, కేన్సర్ బాధిత ఉద్యోగులు, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయం మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న ఉద్యోగులు కేడర్ మార్పునకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అవకాశం కల్పించాలని కోరింది.
మానసిక వైకల్యంగల పిల్లలు కలిగిన ఉద్యోగులను వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించింది. డిసెంబర్ 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment