ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం
నేటి నుంచి సేవలు షురూ
- కార్పొరేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం
- ఆరోగ్య కార్డులుంటే నగదు రహిత వైద్యం
- శస్త్రచికిత్సల ప్యాకేజీ 40 శాతానికి పెంపు
- వెల్‌నెస్ కేంద్రాల్లో పరీక్షించుకున్నాకే ‘కార్పొరేట్’కు సిఫారసు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఎట్టకేలకు నగదు రహిత కార్పొరేట్ వైద్యానికి అడుగు పడింది. ఆదివారం నుంచి రాష్ట్రంలోని ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఆయా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ మేరకు కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో శనివారం ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్) సీఈవో డాక్టర్ కల్వకుంట్ల పద్మ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు.
రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు, మరో 3 లక్షలకుపైగా రిటైర్డ్ ఉద్యోగులు, దాదాపు 25 వేల మంది జర్నలిస్టులున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి 20 లక్షల మందికిపైగా ఉంటారు. నగదు రహిత ఆరోగ్య కార్డున్న ఉద్యోగులు, జర్నలిస్టులు మొత్తం 1,885 వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకునేం దుకు అవకాశం ఉంది. వివిధ వ్యాధులకు ప్రస్తుతమున్న ప్యాకేజీ సొమ్మును 30 నుంచి 40 శాతం వరకు పెంచుతూ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఈజేహెచ్‌ఎస్ సీఈవో పద్మ ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని వ్యాధుల ప్యాకేజీలు పెంచామని... మరికొన్నింటిని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య ప్యాకేజీ ప్రకారం సరిచేశామని ఆమె తెలిపారు.
కార్పొరేట్ ఓపీ సేవలు నో... రిఫర్ చేస్తేనే ఐపీ సేవలు
నగదు రహిత ఆరోగ్య కార్డులను కార్పొరేట్ ఆసుపత్రులు సైతం అనుమతిస్తాయి. అయితే కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు మాత్రం నగదు రహితంగా ఉండవు. కేవలం ఇన్ పేషెంట్ (ఐపీ) సేవలే ఉంటాయి. నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడం కుదరదు. ముందుగా ప్రభుత్వం నెలకొల్పే వెల్‌నెస్ కేంద్రాల్లో చూపించుకున్నాక అక్కడి డాక్టర్లు రిఫర్ చేస్తేనే కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్స చేస్తాయి. వెల్‌నెస్ కేంద్రాలను ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో... హైదరాబాద్‌లో పలుచోట్ల నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెల్‌నెస్ కేంద్రాల్లో ప్రభుత్వ వైద్యులుంటారు. అక్కడ పరీక్షలు నిర్వహిస్తారు. మందులు ఉచితంగా ఇస్తారు. అక్కడ నయం కాని జబ్బులుంటేనే కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు.
నేరుగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లొచ్చు...
వెల్‌నెస్ కేంద్రాన్ని ఖైరతాబాద్‌లో శనివారం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో అత్యాధునిక డయాగ్నస్టిక్ పరికరాలను అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్యులనే కాకుండా అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌లో నిష్ణాతులైన వైద్యులను నియమిస్తామన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అత్యవసర వైద్యం చేయించుకోవాల్సి వస్తే నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. అలాగే ఏ సమయంలోనైనా గుండెపోటు వంటివి వస్తే కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు నేరుగా వెళ్లడానికి వీలుంది. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఏడాదికోసారి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎగ్జిక్యూటివ్ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని విడతల వారీగా అమలుచేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.