హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం.. అత్యవసర పరిస్థితి ఏర్పడితే హాస్పిటల్‌లో చికిత్సను నగదు రహితంగా పొందొచ్చనే. సొంతంగా సమకూర్చుకునేంత వెసులుబాటు అందరికీ ఉండదు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అంశాలలో క్యాష్‌లెస్ సదుపాయం కూడా ఒకటి. దాదాపు అన్ని బీమా సంస్థలు నగదు రహిత వైద్య సేవల సదుపాయాన్ని ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేస్తుంటాయి. ఈ క్యాష్‌లెస్ క్లెయిమ్ ప్రక్రియ సాఫీగా సాగిపోవాలి. సంక్లిష్టంగా ఉండకూడదు. కనుక నగదు రహిత క్లెయిమ్‌ల విషయంలో ఇబ్బంది పడకూడదంటే పాలసీదారులు తమవంతుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలన్నీ వివరించే కథనం ఇది...
నెట్‌వర్క్ హాస్పిటల్స్
హెల్త్‌ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాల్లో హాస్పిటల్ నెట్‌వర్క్ జాబితా ఒకటి. సదరు బీమా సంస్థ నెట్ వర్క్ పరిధిలో ఎన్ని హాస్పిటల్స్ ఉంటే అంత అనుకూలమని అర్థం చేసుకోవచ్చు. మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో మొత్తం ఎన్ని హాస్పిటల్స్ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయనే వివరాలను బీమా సంస్థ వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చు. ఎక్కువ ఆస్పత్రులు ఉండడం వల్ల సమీపంలోని ఆస్పత్రిలో చేరి నగదు రహిత వైద్య సేవలు పొందే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు నగదు రహిత వైద్య సేవలు పొందే విషయంలో మరి కొన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాలసీ నియమ, నిబంధనలు, మినహాయింపులు, రూమ్ రెంట్ పరిమితులు గురించి కూడా తెలియాలి.
డాక్యుమెంట్లు
బీమా సంస్థలు జారీ చేసే హెల్త్ కార్డ్‌ను చికిత్స సమయంలో వెంట తీసుకెళ్లాలి. ఫిజికల్ కార్డు లేకపోయినా పాలసీ సాఫ్ట్ కాపీ తీసుకెళ్లినా చాలు. ఆధార్, పాన్ కూడా వెంట ఉంచుకోవాలి. లేదంటే చిరునామా ధ్రువీకరణ ఉండాలి. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో వెంట హెల్త్‌కార్డ్ ఉండేలా చూసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినా, ప్రమాదానికి గురైనా వెంట ఉండే వారు ఆ కార్డ్ ఆధారంగా ఆస్పత్రిలో చేర్పించడం సులభతరం అవుతుంది.
మినహాయింపులు/కోపే
హాస్పిటల్‌లో అయిన అన్ని ఖర్చులనూ బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుందని అనుకోవద్దు. డిస్పోజబుల్స్ లేదా కన్జ్యూమబుల్స్ (గ్లోవ్‌లు, కాటన్, సిరంజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు)కు ఎక్కువ శాతం ప్లాన్‌లు చెల్లింపులు చేయవు. అలాగే, చికిత్సలో భాగంగా రోగి అదనపు సేవలను పొందితే వాటికి అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా భరించాల్సి వస్తుంది. ఇంకా రిజిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేటివ్ లేదా సర్వీస్ చార్జీలకు కూడా చెల్లింపులు రావు. కేర్, మ్యాక్స్ బూపా, డిజిట్, టాటా ఏఐజీ కన్జ్యూమబుల్ రైడర్లను ప్రత్యేకంగా ఆఫర్ చేస్తున్నాయి.
హెల్త్ ప్లాన్‌కు అనుబంధంగా ఈ రైడర్ తీసుకుంటే, కన్జ్యూమబుల్స్‌కు అయ్యే చార్జీలకు కూడా బీమా సంస్థే చెల్లిస్తుంది. హెల్త్ ప్లాన్‌లో కోపే ఆప్షన్ ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. కోపే అంటే క్లెయిమ్ మొత్తంలో నిర్ణీత శాతం (ఉదాహరణకు 10–20 శాతం) పాలసీదారుడే చెల్లించుకోవడం. దీన్ని ఎంపిక చేసుకుంటే పాలసీ ప్రీమియం తగ్గుతుంది. కానీ, ఆస్పత్రిలో చెల్లించే భారం పడుతుంది. కొన్ని ప్లాన్లలో వ్యాధుల వారీ కోపే ఆప్షన్ ఉంటుంది. ఆయా చికిత్సలకు సంబంధించి మాత్రమే కోపే నిబంధన అమలవుతుంది. ఇవి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ కోపే ఆప్షన్ ఎంచుకుంటే తనవంతు చెల్లింపులకు వీలుగా అత్యవసర వైద్య నిధి సమకూర్చుకోవడం అవసరం.
రూమ్ రెంట్ పరిమితులు
ఆరోగ్య బీమా పాలసీల్లో రూమ్ రెంట్ పరిమితులు ఉండడం సహజం. పాలసీ తీసుకునే సమయంలోనే పరిమితులు లేకుండా ‘ఎనీ రూమ్ టైప్’ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ, దీనికి కొంచెం ప్రీమియం అధికంగా ఉంటుంది. దీనికి బదులు సింగిల్ ప్రైవేటు రూమ్, షేర్డ్ రూమ్ పరిమితులు ఎంపిక చేసుకుంటే, ప్రీమియం కొంత తగ్గుతుంది. పాలసీదారులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ తమ హెల్త్ ప్లాన్ రూమ్ రెంట్ పరిమితి గురించి తప్పకుండా అవగాహనతో ఉండాలి. అప్పుడే హాస్పిటల్‌లో చేరినప్పుడు పాలసీ అనుమతించిన రూమ్‌లోనే చేరడానికి వీలుంటుంది. ఒకవేళ పాలసీలో చెప్పినదానికి భిన్నమైన రూమ్ సేవలను పొందితే అప్పుడు పాలసీదారుపై చెల్లింపుల భారం పడుతుంది.
కొన్ని ప్లాన్లు రూమ్ రెంట్‌ను సమ్ అష్యూరెన్స్‌లో ఒక శాతానికి పరిమితం చేస్తుంటాయి. అంటే రూ.5 లక్షల ప్లాన్‌లో రూ.5,000, రూ.10 లక్షల ప్లాన్‌లో రూ.10,000 చార్జీ (రోజుకు) మించని రూమ్‌లోనే చేరాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు అయిన యనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీల ప్లాన్లలో ఇలాంటి పరిమితులు ఉంటాయి. ఆస్పత్రుల్లో రూమ్‌ను బట్టి రోగికి అందించే చికిత్సలు, సేవల చార్జీలు మారిపోతుంటాయి. ప్రీమియం రూమ్ సేవలు పొందడం వల్ల బిల్లు భారీగా అవుతుంది.
ఈ భారాన్ని తగ్గించుకునేందుకే బీమా సంస్థలు రూమ్ రెంట్ పరిమితి నిబంధనలు పెడుతుంటాయి. ఉదాహరణకు రూ.5,000 రూమ్ రెంట్ పరిమితి ఉన్న ప్లాన్ తీసుకుని.. రోజుకు రూ.10 వేలు చార్జీ చేసే రూమ్‌లో చేరారని అనుకుందాం. అప్పుడు మిగిలిన రూమ్ రెంట్ రూ.5,000ను పాలసీదారుడే భరించాలి. అంతేకాదు, రూమ్‌లో చికిత్సలకు అయిన వ్యయా ల్లోనూ సగం పాలసీదారుడే చెల్లించాలి. కనుక రూమ్‌రెంట్ పరిమితి ఉన్న ప్లాన్ తీసుకుంటే, ఆ పరిధిలోని రూమ్‌లోనే చేరడం మర్చిపోవద్దు. లేదంటే రూమ్ రెంట్ పరిమితి లేని ప్లాన్‌కు మారిపోవడం లేదా, రూమ్‌రెంట్ వైవర్ రైడర్ తీసుకోవాలి.
ముందుగా తెలియజేయాలి..
ఏదైనా ప్రమాదం లేదంటే మరో అత్యవసర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. దగ్గర్లోని నెట్‌వర్క్ హాస్పిటల్‌కు వెళ్లడం మంచి నిర్ణయం అవుతుంది. ఒకవేళ నెట్‌వర్క్ హాస్పిటల్ మరీ దూరంలో ఉండి, రోగి పరిస్థితి సీరియస్‌గా ఉంటే సమీపంలోని ఏదో ఒక ఆస్పత్రికి వెళ్లాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వేరే మార్గం ఉండకపోవచ్చు. కాకపోతే కొన్ని రకాల చికిత్సలు ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునేవి ఉంటాయి. ఉదాహరణకు మోకాలి శస్త్రచికిత్స, హెర్నియా ఆపరేషన్, క్యాటరాక్ట్ సర్జరీ ఇవన్నీ ముందు అనుకుని తీసుకునే చికిత్సలు. ఇలాంటి వాటికి బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ/బీమా మధ్యవర్తి) నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి.
హాస్పిటల్‌లో చేరడానికి వారం ముందు అనుమతి కోరొచ్చు. డాక్టర్ ప్రిస్కిప్షన్, ఇతర ఆధారాలను టీపీఏ లేదా బీమా కంపెనీ కస్టమర్ కేర్‌కు మెయిల్ చేయాలి. కాల్‌సెంటర్‌కు కాల్ చేసి ఇందుకు సంబంధించి వివరాలు పొందొచ్చు. వారు అడిగిన అన్ని వివరాలు, పత్రాలు ఇస్తే అనుమతి మంజూరు అవుతుంది. ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునే చికిత్సలకు అనుమతి విషయమై హాస్పిటల్‌లోని ఇన్సూరెన్స్ విభాగం సిబ్బంది సాయాన్ని తీసుకోవచ్చు. బీమా సంస్థ లేదా టీపీఏ నుంచి నగదు రహిత వైద్య సేవల కోసం అనుమతి లేఖను తీసుకోవాలి. చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు అడ్మిషన్ డెస్క్‌కు ఈ లేఖ సమర్పిస్తే సరిపోతుంది. అత్యవసరంగా చేరినట్టయితే బీమా సంస్థ లేదా టీపీఏకి 24 గంటల్లోపు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్‌కు హెల్త్ ప్లాన్ వివరాలు ఇస్తే వారే బీమా కంపెనీకి సమాచారం ఇస్తారు.
దూరం
బీమా సంస్థలకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. ఒక ఆస్పత్రిని తన నెట్‌వర్క్ పరిధిలో చేర్చుకునే ముందు బీమా కంపెనీలు ఎన్నో అంశాలను చూస్తుంటాయి. ప్రభుత్వ గుర్తింపు, చికిత్సల చార్జీలు, సేవల నాణ్యత తదితర అంశాలను పరిగణణలోకి తీసుకుంటాయి. మీ నివాసానికి సమీపంలో ఏఏ ఆసుపత్రి బీమా సంస్థ నెట్‌వర్క్ పరిధిలో ఉందనే వివరాలను సంబంధిత బీమా కంపెనీ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. బీమా సంస్థ కస్టమర్‌కేర్‌కు కాల్ చేసి అడిగినా వివరాలు అందిస్తారు. నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఈ జాబితా మారుతుంటుంది. కొన్ని ఆసుపత్రులు జాబితా నుంచి బయటకు వెళ్లిపోయి, కొత్తవి చేరుతుంటాయి. బీమా సంస్థల పోర్టళ్లలో అప్‌డేటెడ్ వివరాలు అందుబాటులో ఉంటాయి. నెట్‌వర్క్ జాబితాలో ఉన్నాయంటే సదరు ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలను పొందొచ్చని అర్థం చేసుకోవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్‌ను హాస్పిటల్‌లో చేరే సమయంలో చూపిస్తు చాలు. హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్ చికిత్స వ్యయాలకు బీమా సంస్థ నుంచి ఆమోదం తీసుకుంటుంది. బీమా కంపెనీ నుంచి ప్రాథమిక ఆమోదం వస్తే చాలు. రోగి నగదు చెల్లించే అవసరం ఏర్పడదు. బీమా సంస్థలే తుది బిల్లును కూడా సెటిల్ చేస్తాయి. పాలసీ నిబంధనల మేరకు కవరేజీ పరిధిలోకి రాని వాటికి మినహాయించి, మిగిలిన బిల్లును పరిష్కరిస్తాయి. అప్పుడు రోగి మిగిలిన మొత్తాన్ని తన వంతుగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బీమా కంపెనీలు హాస్పిటల్ పంపించిన రికార్డుల ఆధారంగా నగదు రహిత సేవలకు అనుమతి ఇవ్వవు. కస్టమర్‌ను రీయింబర్స్‌మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలంటూ సమాచారం ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. నగదు రహిత సేవల నెట్‌వర్క్ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకోవడం వల్ల.. బిల్లులు, రీయింబర్స్‌మెంట్ పత్రాలతో హాస్పిటల్, బీమా కంపెనీల చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సిన శ్రమ తప్పుతుంది.
Comments
Please login to add a commentAdd a comment