emergency situations
-
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే ఇది మీకోసమే.. క్యాష్‌లెస్ బెనిఫిట్స్ ఇలా!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం.. అత్యవసర పరిస్థితి ఏర్పడితే హాస్పిటల్లో చికిత్సను నగదు రహితంగా పొందొచ్చనే. సొంతంగా సమకూర్చుకునేంత వెసులుబాటు అందరికీ ఉండదు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అంశాలలో క్యాష్‌లెస్ సదుపాయం కూడా ఒకటి. దాదాపు అన్ని బీమా సంస్థలు నగదు రహిత వైద్య సేవల సదుపాయాన్ని ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేస్తుంటాయి. ఈ క్యాష్‌లెస్ క్లెయిమ్ ప్రక్రియ సాఫీగా సాగిపోవాలి. సంక్లిష్టంగా ఉండకూడదు. కనుక నగదు రహిత క్లెయిమ్‌ల విషయంలో ఇబ్బంది పడకూడదంటే పాలసీదారులు తమవంతుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలన్నీ వివరించే కథనం ఇది... నెట్వర్క్ హాస్పిటల్స్ హెల్త్ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాల్లో హాస్పిటల్ నెట్వర్క్ జాబితా ఒకటి. సదరు బీమా సంస్థ నెట్ వర్క్ పరిధిలో ఎన్ని హాస్పిటల్స్ ఉంటే అంత అనుకూలమని అర్థం చేసుకోవచ్చు. మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో మొత్తం ఎన్ని హాస్పిటల్స్ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయనే వివరాలను బీమా సంస్థ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. ఎక్కువ ఆస్పత్రులు ఉండడం వల్ల సమీపంలోని ఆస్పత్రిలో చేరి నగదు రహిత వైద్య సేవలు పొందే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు నగదు రహిత వైద్య సేవలు పొందే విషయంలో మరి కొన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాలసీ నియమ, నిబంధనలు, మినహాయింపులు, రూమ్ రెంట్ పరిమితులు గురించి కూడా తెలియాలి. డాక్యుమెంట్లు బీమా సంస్థలు జారీ చేసే హెల్త్ కార్డ్‌ను చికిత్స సమయంలో వెంట తీసుకెళ్లాలి. ఫిజికల్ కార్డు లేకపోయినా పాలసీ సాఫ్ట్ కాపీ తీసుకెళ్లినా చాలు. ఆధార్, పాన్ కూడా వెంట ఉంచుకోవాలి. లేదంటే చిరునామా ధ్రువీకరణ ఉండాలి. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో వెంట హెల్త్‌కార్డ్ ఉండేలా చూసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినా, ప్రమాదానికి గురైనా వెంట ఉండే వారు ఆ కార్డ్ ఆధారంగా ఆస్పత్రిలో చేర్పించడం సులభతరం అవుతుంది. మినహాయింపులు/కోపే హాస్పిటల్లో అయిన అన్ని ఖర్చులనూ బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుందని అనుకోవద్దు. డిస్పోజబుల్స్ లేదా కన్జ్యూమబుల్స్ (గ్లోవ్‌లు, కాటన్, సిరంజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు)కు ఎక్కువ శాతం ప్లాన్లు చెల్లింపులు చేయవు. అలాగే, చికిత్సలో భాగంగా రోగి అదనపు సేవలను పొందితే వాటికి అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా భరించాల్సి వస్తుంది. ఇంకా రిజిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేటివ్ లేదా సర్వీస్ చార్జీలకు కూడా చెల్లింపులు రావు. కేర్, మ్యాక్స్ బూపా, డిజిట్, టాటా ఏఐజీ కన్జ్యూమబుల్ రైడర్లను ప్రత్యేకంగా ఆఫర్ చేస్తున్నాయి. హెల్త్ ప్లాన్‌కు అనుబంధంగా ఈ రైడర్ తీసుకుంటే, కన్జ్యూమబుల్స్కు అయ్యే చార్జీలకు కూడా బీమా సంస్థే చెల్లిస్తుంది. హెల్త్ ప్లాన్‌లో కోపే ఆప్షన్ ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. కోపే అంటే క్లెయిమ్ మొత్తంలో నిర్ణీత శాతం (ఉదాహరణకు 10–20 శాతం) పాలసీదారుడే చెల్లించుకోవడం. దీన్ని ఎంపిక చేసుకుంటే పాలసీ ప్రీమియం తగ్గుతుంది. కానీ, ఆస్పత్రిలో చెల్లించే భారం పడుతుంది. కొన్ని ప్లాన్లలో వ్యాధుల వారీ కోపే ఆప్షన్ ఉంటుంది. ఆయా చికిత్సలకు సంబంధించి మాత్రమే కోపే నిబంధన అమలవుతుంది. ఇవి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ కోపే ఆప్షన్ ఎంచుకుంటే తనవంతు చెల్లింపులకు వీలుగా అత్యవసర వైద్య నిధి సమకూర్చుకోవడం అవసరం. రూమ్ రెంట్ పరిమితులు ఆరోగ్య బీమా పాలసీల్లో రూమ్ రెంట్ పరిమితులు ఉండడం సహజం. పాలసీ తీసుకునే సమయంలోనే పరిమితులు లేకుండా ‘ఎనీ రూమ్ టైప్’ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ, దీనికి కొంచెం ప్రీమియం అధికంగా ఉంటుంది. దీనికి బదులు సింగిల్ ప్రైవేటు రూమ్, షేర్డ్ రూమ్ పరిమితులు ఎంపిక చేసుకుంటే, ప్రీమియం కొంత తగ్గుతుంది. పాలసీదారులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ తమ హెల్త్ ప్లాన్ రూమ్ రెంట్ పరిమితి గురించి తప్పకుండా అవగాహనతో ఉండాలి. అప్పుడే హాస్పిటల్లో చేరినప్పుడు పాలసీ అనుమతించిన రూమ్‌లోనే చేరడానికి వీలుంటుంది. ఒకవేళ పాలసీలో చెప్పినదానికి భిన్నమైన రూమ్ సేవలను పొందితే అప్పుడు పాలసీదారుపై చెల్లింపుల భారం పడుతుంది. కొన్ని ప్లాన్లు రూమ్ రెంట్‌ను సమ్ అష్యూరెన్స్‌లో ఒక శాతానికి పరిమితం చేస్తుంటాయి. అంటే రూ.5 లక్షల ప్లాన్‌లో రూ.5,000, రూ.10 లక్షల ప్లాన్‌లో రూ.10,000 చార్జీ (రోజుకు) మించని రూమ్‌లోనే చేరాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు అయిన యనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీల ప్లాన్లలో ఇలాంటి పరిమితులు ఉంటాయి. ఆస్పత్రుల్లో రూమ్‌ను బట్టి రోగికి అందించే చికిత్సలు, సేవల చార్జీలు మారిపోతుంటాయి. ప్రీమియం రూమ్ సేవలు పొందడం వల్ల బిల్లు భారీగా అవుతుంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే బీమా సంస్థలు రూమ్ రెంట్ పరిమితి నిబంధనలు పెడుతుంటాయి. ఉదాహరణకు రూ.5,000 రూమ్ రెంట్ పరిమితి ఉన్న ప్లాన్ తీసుకుని.. రోజుకు రూ.10 వేలు చార్జీ చేసే రూమ్‌లో చేరారని అనుకుందాం. అప్పుడు మిగిలిన రూమ్ రెంట్ రూ.5,000ను పాలసీదారుడే భరించాలి. అంతేకాదు, రూమ్‌లో చికిత్సలకు అయిన వ్యయా ల్లోనూ సగం పాలసీదారుడే చెల్లించాలి. కనుక రూమ్‌రెంట్ పరిమితి ఉన్న ప్లాన్ తీసుకుంటే, ఆ పరిధిలోని రూమ్‌లోనే చేరడం మర్చిపోవద్దు. లేదంటే రూమ్ రెంట్ పరిమితి లేని ప్లాన్‌కు మారిపోవడం లేదా, రూమ్‌రెంట్ వైవర్ రైడర్ తీసుకోవాలి. ముందుగా తెలియజేయాలి.. ఏదైనా ప్రమాదం లేదంటే మరో అత్యవసర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. దగ్గర్లోని నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లడం మంచి నిర్ణయం అవుతుంది. ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్ మరీ దూరంలో ఉండి, రోగి పరిస్థితి సీరియస్‌గా ఉంటే సమీపంలోని ఏదో ఒక ఆస్పత్రికి వెళ్లాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వేరే మార్గం ఉండకపోవచ్చు. కాకపోతే కొన్ని రకాల చికిత్సలు ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునేవి ఉంటాయి. ఉదాహరణకు మోకాలి శస్త్రచికిత్స, హెర్నియా ఆపరేషన్, క్యాటరాక్ట్ సర్జరీ ఇవన్నీ ముందు అనుకుని తీసుకునే చికిత్సలు. ఇలాంటి వాటికి బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ/బీమా మధ్యవర్తి) నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి. హాస్పిటల్లో చేరడానికి వారం ముందు అనుమతి కోరొచ్చు. డాక్టర్ ప్రిస్కిప్షన్, ఇతర ఆధారాలను టీపీఏ లేదా బీమా కంపెనీ కస్టమర్ కేర్‌కు మెయిల్ చేయాలి. కాల్‌సెంటర్‌కు కాల్ చేసి ఇందుకు సంబంధించి వివరాలు పొందొచ్చు. వారు అడిగిన అన్ని వివరాలు, పత్రాలు ఇస్తే అనుమతి మంజూరు అవుతుంది. ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునే చికిత్సలకు అనుమతి విషయమై హాస్పిటల్‌లోని ఇన్సూరెన్స్ విభాగం సిబ్బంది సాయాన్ని తీసుకోవచ్చు. బీమా సంస్థ లేదా టీపీఏ నుంచి నగదు రహిత వైద్య సేవల కోసం అనుమతి లేఖను తీసుకోవాలి. చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు అడ్మిషన్ డెస్క్‌కు ఈ లేఖ సమర్పిస్తే సరిపోతుంది. అత్యవసరంగా చేరినట్టయితే బీమా సంస్థ లేదా టీపీఏకి 24 గంటల్లోపు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్‌కు హెల్త్ ప్లాన్ వివరాలు ఇస్తే వారే బీమా కంపెనీకి సమాచారం ఇస్తారు. దూరం బీమా సంస్థలకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. ఒక ఆస్పత్రిని తన నెట్వర్క్ పరిధిలో చేర్చుకునే ముందు బీమా కంపెనీలు ఎన్నో అంశాలను చూస్తుంటాయి. ప్రభుత్వ గుర్తింపు, చికిత్సల చార్జీలు, సేవల నాణ్యత తదితర అంశాలను పరిగణణలోకి తీసుకుంటాయి. మీ నివాసానికి సమీపంలో ఏఏ ఆసుపత్రి బీమా సంస్థ నెట్వర్క్ పరిధిలో ఉందనే వివరాలను సంబంధిత బీమా కంపెనీ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. బీమా సంస్థ కస్టమర్‌కేర్‌కు కాల్ చేసి అడిగినా వివరాలు అందిస్తారు. నెట్వర్క్ హాస్పిటల్స్ ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఈ జాబితా మారుతుంటుంది. కొన్ని ఆసుపత్రులు జాబితా నుంచి బయటకు వెళ్లిపోయి, కొత్తవి చేరుతుంటాయి. బీమా సంస్థల పోర్టళ్లలో అప్డేటెడ్ వివరాలు అందుబాటులో ఉంటాయి. నెట్వర్క్ జాబితాలో ఉన్నాయంటే సదరు ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలను పొందొచ్చని అర్థం చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్‌ను హాస్పిటల్లో చేరే సమయంలో చూపిస్తు చాలు. హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్ చికిత్స వ్యయాలకు బీమా సంస్థ నుంచి ఆమోదం తీసుకుంటుంది. బీమా కంపెనీ నుంచి ప్రాథమిక ఆమోదం వస్తే చాలు. రోగి నగదు చెల్లించే అవసరం ఏర్పడదు. బీమా సంస్థలే తుది బిల్లును కూడా సెటిల్ చేస్తాయి. పాలసీ నిబంధనల మేరకు కవరేజీ పరిధిలోకి రాని వాటికి మినహాయించి, మిగిలిన బిల్లును పరిష్కరిస్తాయి. అప్పుడు రోగి మిగిలిన మొత్తాన్ని తన వంతుగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బీమా కంపెనీలు హాస్పిటల్ పంపించిన రికార్డుల ఆధారంగా నగదు రహిత సేవలకు అనుమతి ఇవ్వవు. కస్టమర్‌ను రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలంటూ సమాచారం ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. నగదు రహిత సేవల నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకోవడం వల్ల.. బిల్లులు, రీయింబర్స్మెంట్ పత్రాలతో హాస్పిటల్, బీమా కంపెనీల చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సిన శ్రమ తప్పుతుంది. -
బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రభుత్వం రాజధాని బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ప్రధానమంత్రి గద్దె దిగాలనీ, దేశంలో రాజ కుటుంబం పెత్తనం తొలగించి, ప్రజాస్వామ్య సంస్కరణలు తేవాలంటూ బుధవారం విద్యార్థులు రాజ ప్రాసాదానికి సమీపంలో నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజ కుటుంబం వాహనాలకు అవరోధం కలిగించేందుకు యత్నించారు. దీనిపై ఆగ్రహించిన ప్రభుత్వం ఈ అనూహ్య చర్యకు పూనుకుంది. ‘రాజ కుటుంబం వాహనాలకు అవరోధం కలిగించడం వంటి వివిధ మార్గాల్లో అవాంఛనీయ ఘటనలను, ఉద్యమాలను ప్రేరేపించడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించాయి’అని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితి ప్రకటన అనంతరం రాజధాని వీధుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు కనిపించారు. గురువారం వేకువజాము నుంచే పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రయుత్ చన్ ఓచా నివాసం ఎదుట నిరసనలను కొనసాగిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదర్శనలపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ తాజా అరెస్టులకు నిరసనగా బ్యాంకాక్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. ప్రధాని రాజీనామా చేయాలని, అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. థాయ్ చట్టాల ప్రకారం రాజు పూజనీయుడు. రాజు, రాజకుటుంబాన్ని బహిరంగంగా ప్రశ్నించినా, విమర్శించినా శిక్షలు కఠినంగా ఉంటాయి. -
ఇంట్లోనూ సురక్షితంగా లేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సుప్రీంకోర్టు మండిపడింది. తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, వారి ఆయుర్దాయం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన డివిజన్ ఇలాంటి వాతావరణంలో మనుషులెవరైనా జీవించగలరా అని ప్రశ్నించింది. ప్రజలు ప్రాణాలు కోల్పేయే పరిస్థితి వచ్చినా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైనది కాదని మండిపడింది. ఇళ్లల్లో సురక్షితంగా లేకపోవడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల జీవించే హక్కుని కాలరాసినట్టేనని ఘాటుగా విమర్శించింది. ఈ పరిస్థితి కంటే ఎమర్జెన్సీ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలూ బాధ్యత వహించాలి పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లు పంట వ్యర్థాలను కాల్చడం నిలిపివేయాలని ఆదేశించింది. పంట వ్యర్థాలు తగులబెట్టడమే కాలుష్యానికి కారణమైతే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామ పంచాయతీల వరకు అందరూ బాధ్యత వహించాలని పేర్కొంది. బాధ్యత వహించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల గిమ్మిక్కుల మీద ఉన్న శ్రద్ధ మరి దేని మీద లేదని విమర్శించింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో అన్ని రకాల నిర్మాణాలను, కూల్చివేతలను, చెత్తను కాల్చడాన్ని తమ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ నిపుణుల్ని కోర్టులో ప్రవేశపెట్టాలని సుప్రీం ఆదేశంతో కోర్టుకు హాజరైన పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ మండలి (ఈపీసీఏ) చైర్మన్ భూరేలాల్ పొరుగు రాష్ట్రాల్లో తగలబెడుతున్న పంట వ్యర్థాల కారణంగానే ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోందని ఆయా రాష్ట్రాల ప్రధానకార్యదర్శులని పిలిచి మాట్లాడాలని సూచించారు. నాలుగైదు రోజులతో పోల్చి చూస్తే ఢిల్లీలో కాలుష్యం కాస్తో కూస్తో తగ్గింది. కానీ గాలి నాణ్యత సూచీ మాత్రం తీవ్రస్థాయిలోనే ఉంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచి 438కి తగ్గింది. అయినప్పటికీ ఈ కాలుష్యాన్ని తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుంది. కారు పూల్‌లో సీఎం ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, కార్మిక మంత్రి గోపాల రాయ్‌తో కలిసి కారు పూల్ విధానంతో ఒకే కారులో సచివాలయానికి వచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తన ఇంటి నుంచి సైకిల్‌పై సెక్రటేరియెట్‌కి వచ్చారు. కాగా, బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్ సరిబేసి కార్ల ప్రయాణం నిబంధనల్ని అతిక్రమించారు. సోమవారం సరి సంఖ్యలో ఉన్న కార్లను మాత్రమే బయటకు తీసుకురావాలి. కానీ గోయెల్ బేసి సంఖ్యలో ఉన్న కారులో ప్రయాణించడంతో పోలీసులు ఆయనను ఆపి రూ.4వేల జరిమానా విధించారు. ఈ కార్ల విధానాన్ని తప్పుపట్టిన గోయెల్ ఇదంతా కేజ్రివాల్ చేస్తున్న ఎన్నికల స్టంట్ అని వ్యాఖ్యానించారు. బాబోయ్ ఢిల్లీలో షూటింగ్ ఢిల్లీలో షూటింగ్ చేయడం అత్యంత కష్టంగా మారిందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాలుష్యంలో అందరూ ఎలా ఉంటున్నారో ఆలోచిస్తే దడ పుడుతోందన్నారు. ‘వైట్ టైగర్’ షూటింగ్ కోసం ఢిల్లీలో ఉన్నపుడు తన ముఖానికి మాస్క్ ధరించిన ఫొటోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ముఖం అంతా కప్పి ఉంచే మాస్క్‌లు, ఎయిర్ ప్యూరిఫయర్లు ఉండటంతో మనం బతికిపోయాం. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో నిలువ నీడ లేని వారి పరిస్థితి ఏమిటి ? ఢిల్లీవాసులందరూ సురక్షితంగా ఉండాలని అందరూ ప్రార్థించండి’ అని ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నారు. మాస్క్‌తో ప్రియాంక చోప్రా -
జెట్ నుంచి ఎజెక్ట్ అయితే.. ఎట్లుంటదో తెలుసా ?
అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు జెట్ విమానాల నుంచి దూకాల్సి వస్తుంది. అలా దూకడం అంత సులువేం కాదు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అలా దూకిన తర్వాత గాయాలపాలైన పైలట్లు కొన్ని సంవత్సరాల వరకు ఏ విమానాన్ని కూడా నడపలేరు. విమానం నుంచి సడన్‌గా సీటు విడిపోవడంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. దూకే సమయంలో సాధారణ గురుత్వాకర్షణ శక్తి కన్నా 14 నుంచి 16 రెట్లు ఎక్కువగా సీటుపై శక్తి పనిచేస్తుంది. గాలి వేగంగా ఉన్న సమయంలో జెట్ నుంచి దూకడం వల్ల చేతులు విరుగుతుంటాయి. భుజం ఎముకకు గాయాలు అవుతుంటాయి. కాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే అవకాశ ఉంటుంది. మంటలు రావడంతో శరీరం కాలిపోయే ప్రమాదం ఉంది. -
1974 నాటికి నేటికి తేడా ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎమర్జెన్సీ (అత్యయిక పరిస్థితి) విధించడం కాంగ్రెస్ చేసిన పాపమంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించడమే కాకుండా అది రాజ్యాంగాన్ని కాలరాయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని కూడా ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం కూడా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రత్యారోపణలు చేసింది. ఇందులో ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది? నాడు ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన 1974 పరిస్థితులు నేడున్నాయా? తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం నాటి ఎమర్జెన్సీ గురించి ప్రస్థావించడం లేదని, నాటి పరిస్థితులు గురించి తెలుసుకొని భవిష్యత్తులో మరోసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత నేటి, భవిష్యత్ తరాలపై ఉందని కూడా మోదీ వ్యాఖ్యానించారు. ఇంతకు ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు ఏమిటీ? నేటి పరిస్థితులకు నాటి పరిస్థితులకు పోలికలేమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు నేడు అప్రకటిత అత్యయిక పరిస్థితి ఉందా? దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం నేటి లేదా భవిష్యత్ తరాలకు వస్తుందా? 1973లో పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పాలనపై ప్రజలు విసిగెత్తారు. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా ముందుగా గుజరాత్లో, ఆ తర్వాత బీహార్‌లో తిరుగుబాటు తలెత్తింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలంటూ, ప్రభుత్వాలను రద్దు చేయాలంటూ పట్టణ మధ్య తరగతికి చెందిన యువకులు తిరుగుబాటు లేవనెత్తారు. ఇందిరాగాంధీ రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తున్న అగ్రవర్ణాల వారు, ఉన్నత వర్గాల వారు, వ్యాపారస్థులు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెషనల్స్ తిరుగుబాటుకు మద్దతు తెలిపారు. ఇందిర ప్రభుత్వం దళితులు, ఎస్సీలు, ఎస్టీలను రాజకీయ రంగంలోకి తీసుకరావడం, వారి సంక్షేమం కోసం ఉచిత, ఆకర్షణీయ పథకాలను అమలు చేయడం కూడా వారికి ఆగ్రహం తెప్పించింది. అప్పటికే పాలనా వ్యవస్థలో పేరుకు పోయిన అవినీతిని ఆయుధంగా చేసుకొని ఆ వర్గాల వారంతా తిరుగుబాటు లేవనెత్తారు. 1974లో జరిగిన రైల్వే సమ్మెను అణచివేయడం ఉద్యమాలకు మరింత ఊపునిచ్చింది. దళితులు, బడుగువర్గాల సంక్షేమం పేరిట సీపీఐతో సత్ససంబంధాలు పెట్టుకున్న ఇందిరాగాంధీ వామపక్ష భావాలు కలిగిన వీఆర్ కృష్ణ అయ్యర్‌ను 1973లో సుప్రీం కోర్టు జడ్జీగా నియమించారు. ముగ్గురు జడ్జీల సీనియారిటీ కాదని ఆయన్ని సుప్రీం కోర్టు జడ్జీగా నియమించడం వివాదాస్పదమైంది(పేదలు, బడుగు వర్గాల ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండాలన్న ఉద్దోశంతో ఎన్నో న్యాయ సంస్కరణలను తీసుకొచ్చిన కృష్ణ అయ్యర్ కేరళ వామపక్షాల ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1971 నుంచి 1973 వరకు లా కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు). 1975లో పార్లమెంట్ సభ్యురాలిగా ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఈ తీర్పును ఇందిర సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఆమె నియమించిన జడ్జీ వీఆర్ కృష్ణ అయ్యర్ అలహాబాద్ తీర్పుపై షరతులతో కూడిన స్టేను మంజూరు చేశారు. బేషరతుగా స్టేను ఇవ్వనందుకు అప్పట్లో ఆయన్ని ప్రశంసించిన ప్రజలు కూడా ఉన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో ఇందిరను ప్రధాని పదవికి రాజీనామా చేయలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఆ మరుసటి రోజే ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే వీఆర్ కృష్ణ అయ్యర్ తీర్పును వ్యతిరేకిస్తూ నలుగురు సుప్రీం జడ్జీలు తమ పదవులకు రాజీనామా చేశారు. 1971లో ఇందిరాగాంధీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ దేశంలో ఆర్థిక ప్రగతి మందగించడం, నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, గుజరాత్, బీహార్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై అంతులేని అవినీతి ఆరోపణలు రావడం ఇందిర పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి రాజేసింది. పార్టీలో ఇందిర ఏకఛత్రాదిపత్యం చెలాయించడం పార్టీ సీనియర్ నాయకులకు, రాష్ట్రాల నాయకులకు ఏమాత్రం నచ్చలేదు. తోటి నాయకుల అభిప్రాలను కాదని ఆమె ఆనాడు వివి గిరిని రాష్ట్రపతిని చేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రను ముందే దెబ్బతీసిన ఇందిర ఎమర్జెన్సీ పేరిట ఇటు న్యాయవ్యవస్థ, అటు పత్రికా స్వేచ్ఛను హరించి వేశారు. మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో ఉండే కార్లను దేశీయంగా ఉత్పత్తి చేయాలనుకున్న ఇందిర పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ ‘1971’లో మారుతి సంస్థను తీసుకొచ్చి అందులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామిక వేత్తలపై ఒత్తిడి తెచ్చారు. అది కూడా పారిశ్రామిక వేత్తల ఆగ్రహానికి కారణమైంది(సంజయ్ సూచన మేరకు ‘పీపుల్స్ కార్’ను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఇందిర కేబినెట్ ఆమోదించింది. సూర్యరామ్ మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్లిమిటెడ్గా ఏర్పడిన ఆ సంస్థకు సంజయ్ తొలి డైరెక్టర్‌గా వ్యవహరించారు). దేశ పురోభివృద్ధికి పెరుగుతున్న అధిక జనాభే కారణమన్న ఉద్దేశంతో కుటుంబ నియంత్రణను దౌర్జన్యంగా సంజయ్ గాంధీ అమలు చేయించడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. మానవ హక్కులు కూడా పూర్తిగా హరించుకు పోవడంతో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనసంఘ్, సీపీఎం, నక్సలైట్లు, జయప్రకాష్ నారాయణ్ తదితరులు ఉద్యమాలు నిర్మించారు. జయప్రకాష్ నారాయణ్ 1974లోనే బీహార్, గుజరాత్ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. నాటి పరిస్థితులు నేడున్నాయా? నాటి లాగే నేడు కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులు దేశంలో కొనసాగుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి ఏడు శాతాన్ని దాటలేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అందులో మూడో వంతు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. నాటి ఇందిర ‘గరీబీ హఠావో’ నినాదం లాగానే నేడు మోదీ ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ అబాసు పాలయింది. నాటి అవినీతి మరకలు నేడు లేకున్నా ‘పెద్ద నోట్ల రద్దు’తో బీజేపీ నేతలు లాభ పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. నాడు కాంగ్రెస్ ప్రాభవానికి వన్నె తగ్గినట్లే నేడు బీజేపీ ప్రాభవం పడిపోతోంది. నాడు కాంగ్రెస్‌పై మధ్య తరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు తిరుగుబాటు చేయగా, నేడు బీజేపీకి వ్యతిరేకంగా దిగువ తరగతి, దళితులు, నిమ్న వర్గాల ప్రజలు, కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఆనాటి స్థాయిలో ఆందోళనలు, అరెస్ట్‌లు నేడు కనిపించకపోయినా అశాంతి పరిస్థితులు మాత్రం ఉన్నాయి. గోరక్షణ పేరిట, హిందూత్వం పేరిట దాడులు జరుగుతున్నాయి. కోర్టు పాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం, కొలీజియం చేసిన సిఫార్సులను రెండు సార్లు ప్రధాని కార్యాలయం తిరస్కరించడం న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను ప్రశ్నిస్తోంది. మీడియాపై కూడా అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇందిరకు మోదీకి తేడా ఏమిటీ? నాడు ఇందిరా గాంధీ ఏకఛత్రాధిపత్యంగానే దేశాన్ని పాలించారు. దాదాపు అదే స్థాయిలో నేడు నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారు. ఎలాంటి కఠోర నిర్ణయాలను తీసుకోవడానికైనా వెనకాడని మనస్తత్వం ఆమెది. ఆచితూచి వ్యవహరించకపోయినా అంతటి కఠిన నిర్ణయాలు తీసుకునే సాహసం మోదీ చేయలేరు. -
ఎఫ్డీలపై చౌకగా రుణం..
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నప్పటికీ.. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు, దాన్ని బ్రేక్ చేయడం ఇష్టం లేక రుణాల కోసం ఇతర మార్గాలూ చూస్తాం. పర్సనల్ లోన్ అంటూ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల చుట్టూ తిరుగుతాం. అధిక వడ్డీ రేటుకు తెచ్చుకుంటుంటాం. అయితే, ఎఫ్డీని బ్రేక్ చేయకుండానే అందులో కొంత భాగాన్ని వినియోగించుకునే వీలు ఉంది. ఇందుకోసం ఫిక్సిడ్ డిపాజిట్‌పై సైతం రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి బ్యాంకులు. ఇతర రుణాలతో పోలిస్తే ఈ లోన్లపై వడ్డీ రేట్లు కాస్త తక్కువగానూ ఉంటాయి. సాధారణంగా ఎఫ్డీలో 70-90% మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. కొన్ని మరింత ఎక్కువగా కూడా ఇవ్వొచ్చు. ఇక వడ్డీ రేటు విషయానికొస్తే.. డిపాజిట్ మీద బ్యాంకు చెల్లించే వడ్డీ రేటు కన్నా 2-2.5% ఎక్కువగా ఉంటుంది. బ్యాంకును బట్టి ఇది మారుతుంది. ఈ తరహా రుణాలపై చాలా మటుకు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వంటివి వసూలు చేయడం లేదు. ఒకవేళ చేసినా నామమాత్రం స్థాయిలోనే ఉంటోంది. ఇక చెల్లింపు వ్యవధి విషయానికొస్తే.. డిపాజిట్ గడువే దీనికి కూడా వర్తిస్తుంది. ఒకవేళ ముందుగానే రుణమొత్తాన్ని చెల్లించేసినా.. సాధారణంగా పెనాల్టీలు లాంటివేమీ ఉండవు. అయితే, లోన్ తీసుకున్నందున ... అది తీరేదాకా ఎఫ్డీని ముందస్తుగా క్లోజ్ చేయడానికి మాత్రం కుదరదు. ఏదైతేనేం.. అధిక వడ్డీ రేటు ఉన్న వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఎఫ్డీలపై రుణం మెరుగైనదే. లోన్ తీసుకున్నప్పటికీ మీ డిపాజిట్‌పై వడ్డీ వస్తూనే ఉంటుంది. దీనివల్ల మీరు నికరంగా కట్టే వడ్డీ రేటూ తక్కువగానే ఉంటుంది.