ఎఫ్‌డీలపై చౌకగా రుణం..
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నప్పటికీ.. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు, దాన్ని బ్రేక్ చేయడం ఇష్టం లేక రుణాల కోసం ఇతర మార్గాలూ చూస్తాం. పర్సనల్ లోన్ అంటూ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల చుట్టూ తిరుగుతాం. అధిక వడ్డీ రేటుకు తెచ్చుకుంటుంటాం. అయితే, ఎఫ్‌డీని బ్రేక్ చేయకుండానే అందులో కొంత భాగాన్ని వినియోగించుకునే వీలు ఉంది. ఇందుకోసం ఫిక్సిడ్ డిపాజిట్‌పై సైతం రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి బ్యాంకులు. ఇతర రుణాలతో పోలిస్తే ఈ లోన్‌లపై వడ్డీ రేట్లు కాస్త తక్కువగానూ ఉంటాయి.
సాధారణంగా ఎఫ్‌డీలో 70-90% మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. కొన్ని మరింత ఎక్కువగా కూడా ఇవ్వొచ్చు. ఇక వడ్డీ రేటు విషయానికొస్తే.. డిపాజిట్ మీద బ్యాంకు చెల్లించే వడ్డీ రేటు కన్నా 2-2.5% ఎక్కువగా ఉంటుంది. బ్యాంకును బట్టి ఇది మారుతుంది. ఈ తరహా రుణాలపై చాలా మటుకు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వంటివి వసూలు చేయడం లేదు. ఒకవేళ చేసినా నామమాత్రం స్థాయిలోనే ఉంటోంది. ఇక చెల్లింపు వ్యవధి విషయానికొస్తే.. డిపాజిట్ గడువే దీనికి కూడా వర్తిస్తుంది.
ఒకవేళ ముందుగానే రుణమొత్తాన్ని చెల్లించేసినా.. సాధారణంగా పెనాల్టీలు లాంటివేమీ ఉండవు. అయితే, లోన్ తీసుకున్నందున ... అది తీరేదాకా ఎఫ్‌డీని ముందస్తుగా క్లోజ్ చేయడానికి మాత్రం కుదరదు. ఏదైతేనేం.. అధిక వడ్డీ రేటు ఉన్న వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఎఫ్‌డీలపై రుణం మెరుగైనదే. లోన్ తీసుకున్నప్పటికీ మీ డిపాజిట్‌పై వడ్డీ వస్తూనే ఉంటుంది. దీనివల్ల మీరు నికరంగా కట్టే వడ్డీ రేటూ తక్కువగానే ఉంటుంది.