
ఆర్థిక పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. నెలకు లక్షల రూపాయలు సంపాదించేవారు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు, కావలసినప్పుడు లోన్స్ కూడా తీసుకుంటున్నారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత లోన్స్ తీసుకోవచ్చు. కానీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. లేకుంటే తీసుకున్న అసలు కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
సిబిల్ స్కోర్
బ్యాంకు లోన్ ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ చూస్తుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఎక్కువ బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. లేకుంటే లోన్ లభించడం కొంత కష్టమనే చెప్పాలి. ఒకవేళా మీకు లోన్ లభించినా వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

వడ్డీ రేటు
లోన్ తీసుకునే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరో విషయం వడ్డీ రేటు. ఎందుకంటే ఒక్కో బ్యాంక్ ఒక్కో వడ్డీ రేటుతో లోన్ అందిస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీతో లోన్ ఇచ్చే బ్యాంకుల వద్ద నుంచి లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇది మీరు తిరిగీ చెల్లించాల్సిన ఈఎమ్ఐలను సులభతరం చేస్తుంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీకి లోన్ ఇస్తుందనే విషయాలను అధికారిక వెబ్‌సైట్‌లలో లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవచ్చు.

లోన్ వ్యవధి
లోన్ తీసుకునే వ్యక్తి.. తిరిగి ఎన్ని నెలల్లో చెల్లచగలుగుతాడో, సంపాదన ఎంత వంటి వాటిని బేరీజు వేసుకుని వ్యవధిని ఎంచుకోవచ్చు. పర్సనల్ లోన్ వ్యవధి 12 నెలల నుంచి 60 నెలల మధ్య ఉంటుంది. అయితే 36 నెలలు లేదా మూడు సంవత్సరాలకు మించి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడం మీకే మంచిది. అయితే ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన అవసరం లేదు.

లోన్ ఎక్కడ నుంచి తీసుకోవాలి (బ్యాంకు/ఎన్‌బీఎఫ్‌సీ)
పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి.. బ్యాంకు నుంచి తీసుకోవాలా? లేదా ఎన్‌బీఎఫ్‌సీ నుంచి తీసుకోవాలా? అని సొంతంగా నిర్దారించుకోవాలి. బ్యాంకు నుంచి తీసుకోవడం చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతారు. లోన్ తీసుకోవడానికి కొంత ఆలస్యమైనా బ్యాంకు నుంచే తీసుకోవడం మంచిది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావుండదు.

ఎన్‌బీఎఫ్‌సీ (నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు) నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. కానీ ఇందులో కొన్నిసార్లు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఎక్కువ అవసరం లేదు. ఎన్‌బీఎఫ్‌సీలో లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా ఆ సంస్థ గురించి తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment