
బ్యాంకాక్ ప్రధాన రహదారిపై వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూలవాదుల నిరసన
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రభుత్వం రాజధాని బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ప్రధానమంత్రి గద్దె దిగాలనీ, దేశంలో రాజ కుటుంబం పెత్తనం తొలగించి, ప్రజాస్వామ్య సంస్కరణలు తేవాలంటూ బుధవారం విద్యార్థులు రాజ ప్రాసాదానికి సమీపంలో నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజ కుటుంబం వాహనాలకు అవరోధం కలిగించేందుకు యత్నించారు. దీనిపై ఆగ్రహించిన ప్రభుత్వం ఈ అనూహ్య చర్యకు పూనుకుంది. ‘రాజ కుటుంబం వాహనాలకు అవరోధం కలిగించడం వంటి వివిధ మార్గాల్లో అవాంఛనీయ ఘటనలను, ఉద్యమాలను ప్రేరేపించడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించాయి’అని ప్రభుత్వం తెలిపింది.
అత్యవసర పరిస్థితి ప్రకటన అనంతరం రాజధాని వీధుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు కనిపించారు. గురువారం వేకువజాము నుంచే పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రయుత్ చన్ ఓచా నివాసం ఎదుట నిరసనలను కొనసాగిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదర్శనలపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ తాజా అరెస్టులకు నిరసనగా బ్యాంకాక్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. ప్రధాని రాజీనామా చేయాలని, అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. థాయ్ చట్టాల ప్రకారం రాజు పూజనీయుడు. రాజు, రాజకుటుంబాన్ని బహిరంగంగా ప్రశ్నించినా, విమర్శించినా శిక్షలు కఠినంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment